ఆవు చేనుల మేస్తే దూడ గట్టున మేస్తదా!

పశువులు పంట చేనులు మేయకూడదు. పొలం గట్ల మీద వాటిని మేపుతుంటారు. తల్లిదండ్రుల అలవాట్లు పిల్లలకు వచ్చినట్లు పశువులక్కూడా అట్లాగే వస్తాయి. ఎవరైనా పిల్లవాడు తప్పుడు పని చేస్తే వాల్ల తండ్రిని దృష్టిలో వుంచుకుని మందలిస్తరు. అందుకు ‘ఆవు చేనుల మేస్తే దూడ గట్టున మేస్తదా’ అని అంటారు. లేదా అన్నదమ్ములవి, తండ్రీ తనయులవి ఒకే తీరు ప్రవర్తనలో ఇబ్బంది అయితే ‘ఆ తానులదే ఆ గుడ్డ’ అంటరు. దుస్తుల కోసం వస్త్రాన్ని కొనేటప్పుడు ‘తాను’ లో కత్తిరించి అమ్ముతరు. ఆ తానులో అదే గుడ్డ వుంటది. ఈ అర్ధంలో వాడుతరు. మరొక సందర్భంలో తల్లీ బిడ్డ ఒకే తీరు వ్యవహరిస్తే లేదా ఏదైనా నచ్చని పని చేస్తే వాల్ల అవ్వ కూడా అట్లనే చేసేది అనే అర్ధంలో ‘తల్లికి బొల్లి వుంటే పిల్లకు సుక్కనైనా వుంటది’ అంటరు. బొల్లి అనేది తెల్ల మచ్చల వ్యాది. ఇది తల్లికి వుంటే బిడ్డకు కూడా వుంటుందని అంటరు. జానపదుల మాటలో మాధుర్యం వుంటది. భాషలో రాగం వుంటది. అందుకే తల్లి బొల్లి పిల్ల సుక్క అనే పదాడంబర సామెత పుట్టింది. అట్లాగే ఇంకో తీరుగా కూడా అంటరు. ‘ఇత్తు ఒకటి పెడితే చెట్టు మరొకటి అయితదా’ అని. ఏ చెట్టు గింజ నాటితే ఆ చెట్టే పెరుగుతది. ఎవల పిల్లలు వాల్ల లెక్కనే వుంటరు అనే అర్ధంలో వాడుతరు. ఇంటి వాతావరణం వారసత్వం నుంచి మనిషి గుణాలు, అహంకారాలు వ్యక్తం అవుతాయి. కొందరిలో ఆధునిక భావాల పరంపర కొనసాగుతది. అయితే ఈ సామెతలన్నీ శాస్త్రీయమైనవి కాకపోవచ్చు కానీ ‘సోలుపూత రామాయణం చెప్పక సూటిగ ఒక్క మాటలో చెప్పుడు’ అన్నట్టు, కొన్ని సామెతలైతే కొన్ని కులాలను, స్త్రీలను చిన్న చూపుతో వుంటాయి. వాటిని వాటిని ప్రజాస్వామిక సమాజంలో చర్చించక పోవడమే మంచిది.

– అన్నవరం దేవేందర్‌, 9440763479

Spread the love