మా అమ్మమ్మకు నాలుగు వందల నలభైనాలుగు వందల మంది పిల్లలు…

మా అమ్మమ్మను, మా తాత ఏడేండ్లు ఉన్నప్పుడు పెండ్లి చేసుకున్నడు. మా అమ్మమ్మకు ఏడేండ్లు అయితే ఆయనకు పదిహేనేండ్లు. ఇంగ ఏడేండ్ల పిల్ల తోటి ఏగుడెట్లుంటదో ఎరుకనే గదా. ఊ.. అంటే అలుగుడు, ఆ.. అంటే అలుగుడు. మా అమ్మమ్మ ఆళ్ళ అమ్మకు ఒక్కత్తే బిడ్డ అవ్వుడు తోటి మా తాతనే ఇల్లరికం వచ్చిండు. మా అమ్మమ్మ రెండేండ్లు ఉన్నప్పుడే ఆళ్ళ నాయిన చచ్చిపోయిండు. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ మేడమ్మనే ఆమెను సాకింది. తండ్రి లేని పిల్ల గనుక పువ్వు లెక్క సూసుకున్నది. మేడమ్మ ఆళ్ళకున్న మూడెకరాల భూమిని, ఆమెకున్న తెలివి తోటి ముప్పై ఎకరాలు జేశి, మా తాత చేతుల ఏడేండ్ల మా అమ్మమ్మను, ఏడేండ్ల సంది కష్టవడి సంపాదిచ్చిన ముప్పై ఎకరాల భూమిని చేతుల వెట్టి గుటుక్కు మన్నది. ఆమె పెండ్లి అయిన మూడో రోజుకే గుటుక్కు మనుడు తోటి, పెండ్లికని వచ్చిన చుట్టాలు ఇంకో పదకొండొద్దులుండి, పదిలంగుండుండి బిడ్డ అని మా తాతకు, మా అమ్మమ్మ కు జెప్పి, పెండ్లికోసమని వచ్చినోళ్ళు చావింట్ల నుండి బయట వడ్డరు. ఆడికెంచి ఈళ్ళ సంసారం మొదలైంది. పువ్వు లెక్క పెరిగిన మా అమ్మమ్మ పొద్దు నెత్తికెక్కే దాంక లేవకనే పోతుండె. మా తాతకేమో ఆమెను లేపి లేపి యాష్టకొచ్చి ఆయననే వాకిలూకి, సాన్పి జల్లి అడ్డమో, దొడ్డమో ముగ్గేశి, అప్పుడు మా అమ్మమ్మను లేపుతుండే. ఇద్దరు గలిశి ఇంతంత చాయ వొట్టు తాగి, చద్ది గట్టుకొని పొలానికి వోతుండె.
ఇంతకీ మా అమ్మమ్మ, తాతల పేర్లు చెప్పుడె యాది మర్చిన.. మా అమ్మమ్మ పేరు తిమ్మక్క. ఇంక మా తాత పేరేమొ చిక్కయ్య. గట్ల తిమ్మక్క , చిక్కయ్యల సంసారం మంచిగనె నడుస్తున్నది. చిక్కయ్యకు తిమ్మక్కను సవరిచ్చుడే సరిపోయింది. ఆమెతోటి కచ్చ కాయలు, తొక్కుడు బిళ్ళ, కోతి కొమ్మచ్చి ఆడుడు. ఆమెకు కాళ్ళు గుంజితె ఆమెని నెత్తి మీద ఎక్కిచ్చుకొని ఇంటి దాంక తొల్క వోతుండె. అట్ల తిమ్మక్క ఆడుకుంట, పాడుకుంట చిక్కయ్య తాన అన్ని పనులు నేర్చుకున్నది. పచ్చి పులుసు తోటి మొదలు వెడితే, తల్కాయ కూర దాంక అన్ని వండుడు నేర్చుకొని చిక్కయ్యకు మంచిగ వండి పెడుతున్నది. ఇట్ల కాలం గడుస్తావున్నది. ఇద్దరు మంచిగనే వండుక తింటుని, సప్పుడు జెయ్యక పొయ్యి పొలం పనులు చేసుకుంటున్నరు. ఇట్లో ఇరవై యేండ్లు గడిచే వరకల్ల తిమ్మక్కకు ఇరవై ఏడేండ్లు వచ్చినయి. చిక్కయ్య కేమొ ముప్పైఏడొచ్చినయి. గిన్నెండ్ల సంసారం గనుక ఇద్దరికీ మంచిగనె కుదిరింది. పరాచకాలు, కిరాచకాలు అన్నీ మొదలైనయి. అట్ల ఇద్దరు ఎప్పుడు తిమ్మక్క కడుపుల ఒక కాయ కాస్తదా అని ఆరాటపడుతున్నరు. ఇద్దరు ఇన్నేండ్ల సంది వుండుడు తోటి ఒకళ్ళ కొకలు యాష్టకొచ్చినరు. ఇద్దరికి ఎట్లనన్న జేశి ఒక తోడు కావాలెనని పడ్డది. దాని కోసం తిమ్మక్క, చిక్కయ్యల చిక్కులు మొదలైనయి. వీళ్ళు తిరగని గుడిలేదు, మొక్కని దేవుడు లేడన్నట్టు, ఇద్దరు పొద్దుగాలనే బస్సు ఎక్కుడు ఏ గుడికో వొయ్యి దేవుని చుట్టూ తిరుగుడు. ఇంగ గుళ్ళే గిట్ల ఏ చెట్టో కనిపిస్తే దానికి ఉయ్యాలలు గట్టుడు. అట్ల తిరిగి తిరిగి నాలుగువందల నలపై నాలుగు చెట్లకు ఉయ్యాలలు గట్టిర్రు. మర్రి చెట్టు, రావి చెట్టు, జువ్వి చెట్టు, మేడి చెట్టు, యాప చెట్టు, చింత చెట్టు, మామిడి చెట్టు అని ఏ చెట్టును వదలకుండ ఉయ్యాలలు కట్టుకుంట వోతనేవున్నరు. ఆ చెట్ల మీదనైతె ఉయ్యాలలు ఊగుతున్నయిగని, వీళ్ళ ఇంట్ల మటుకు ఉయ్యాల ఊగుతలేదు.
ఇట్ల తిరిగి తిరిగి ఇద్దరు ఇంట్ల ఓ తాన కులవడి ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు సూసుకుంటున్నరు. గిన్ని గుడ్లు తిరిగి, గన్ని చెట్లకు ఊయ్యాలలు కట్టినా కడుపుల పంటవండుతలేదంటె.. నీ తప్పంటె, నీ తప్పని అని ఒకరి మీదికి ఒకరు ఎగవడుతున్నరు. ఇట్ల దగ్గర దగ్గర ఇద్దరు కొట్టుకునేదాంకొచ్చింది. తిమ్మక్కకు ఒర్రి ఒర్రి యాష్టకొచ్చి చెర్ల దుంకుదామని చెరువు దిక్కు పోవుడు వెట్టింది. అప్పటికే చెరువు సగం ఎండిపోవుడు తోటి వీళ్ళ ముప్పై ఎకరాలు పండే భూమి, మూడెకరాలె వండుతున్నది. ఆమె చెరువు పంటి వురుకుడు తోటి చిక్కయ్య గిట్ల ఆమె ఎంబటి ఉరుకుంట చెరువుకాడికి చేరుకుండు. ఆమె చెర్ల నీళ్ళు లేంది జూశి, ఏం జెయ్యాలెనో తోచక చెర్లకు వొయ్యి నిలవడి తపస్సు జేసుడు మొదలు వెట్టింది. అది జూశి చిక్కయ్య గిట్ల ఆడ్నే కూలవడ్డడు. తిండి లేదు, తిప్పలు లేదు. తిమ్మక్క నీళ్ళల్ల అట్లనే నిలవడి తపస్సు జేస్తనే వున్నది.
చిక్కయ్యకు యాష్టకొచ్చి ఇంటికివొయ్యి ఇంతంత వండి, ఆయనింత తిని, తిమ్మక్కకు ఇంత తీసుకవొయ్యి గట్టుమీద నిలవడి మొత్తుకుంటున్నడు. ”నీ తపస్సు కాలవడ, పిల్లలు లేకపోతే లేకమాయె గని, నీ పిచ్చి కాకపోతే గిట్ల చెర్ల నిలవడి తపస్సు జేస్తె పిల్లలు వుడుతరానె.. మా యమ్మ కదు, ఇంతంత ముద్ద తిను. తపస్సు జేసుకో..” అని ఎంత మొత్తుకున్న తిమ్మక్క తపస్సు మాత్రం భంగమైతలేదు. ఇట్ల రోజులు గడుస్తున్నయి, చెరువు ఎండిపొతున్నది కని, తిమ్మక్క మాత్రం ఆడికెంచి కదులుత లేదు. చిక్కయ్య రోజు వచ్చుడు ఒర్రి పోవుడు. అట్ల అట్ల ఓ రోజు తిమ్మక్క సోయిలేకుండ చర్లనే కులవడ్డది. పొద్దు గూకుతున్నది. సూర్యుడు ఎర్రగ గుడ్రంగున్నడు. అప్పుడే తిమ్మక్క ను గంగమ్మ కరునించింది. చెర్ల కెంచి పొల్లగాండ్లు వస్తనే వున్నరు. గట్టు మీది నుంచి చిక్కయ్య సూసుకుంట నోరెళ్ళ వెట్టిండు. తిమ్మక్క పిల్లల ఏడుపులకి కళ్ళు తెరిచి చూసే వరకూ అక్షరాల నాలుగు వందల నలభై నాలుగు మంది పిల్లలున్నరు. వాళ్ళను చూస్తూంటే తిమ్మక్క, చిక్కయ్య ఆనందానికి అవధులు లేవు. పిల్లలు ఏడుస్తుంటే ఎవరిని ఎత్తుకోవాలెనో వాళ్ళకు సమజైతలేదు. వీళ్ళను సూడనికి వచ్చిన ఊరోళ్ళందరు ముక్కు మీద యేలేసుకొని పిల్లలను అట్లనే జూస్తున్నరు. అందరిదీ ఒకటే ముచ్చట… నాలుగు వందల నలభైనాలుగు మంది పిల్లలను ఎట్ల సాదుతరో అని అనుకుంటున్నరు.
తిమ్మక్క, చిక్కయ్య ఎట్లనో జేషి పిల్లలకు పేర్లు వెట్టుడు మొదలు వెట్టిండ్రు. పొద్దుగాల నాలుగింటికి మొదలు వెట్టిన పేర్లు పొద్దిమీకి ఆరింటిదాంక నడుస్తనె వున్నయి. ఏం పేర్లు వెట్టాలనో తెల్వక అందరికి చెట్ల పేర్లు, పువ్వుల పేర్లు పెట్టుకొస్తున్నరు. వరుసగ గునుగు, తంగేడు, బంతి, చామంతి, మందారం, మొదుగ, కనకాంబరం, జమ్మి, ఉమ్మెత్త, స్వస్తిక, బ్రహ్మ జముడు, నాగ జముడు, అశోక, జాపత్రి, కుంకుడు, నాగలింగం, ఉమ్మెత్త, కానికాయ, కరక్కాయ ఇట్ల ఏ పేరు తోస్తే ఆ పువ్వో, చెట్టో, కాయ పేరు వెట్టుకుంట నాలుగు వందల నలభై నాలుగు మంది పిల్లల పేర్లు వెట్టినమనిపిచ్చుకున్నరు.
ఉన్న ముప్పై ఆరు ఎకరాలల్ల ఓ నాలుగెకరాలు అమ్మి పిల్లలకు పాల సీసాలు, పాలు వట్టుకొచ్చిండ్రు. పాలు కాగ వెట్టి, చల్లార్చి పాల సీసాలల్ల వోశి ఒక్కొక్క పిల్లకు పాలు వడుతుంటె ఒక్కరు గిట్ల పాలు తాగుతలేరు. వీళ్లకు సల్ల చముటలు వుట్టినయి. పిల్లలు పాలు తాగుతలేరు, ఎడుస్తలేరు, ఎవ్వరిది వాళ్ళు సప్పుడు జేయ్యకుండ ఆడుకుంటున్నరు. వీళ్లకు ఏం తోస్తలేదు. ఊరోళ్ళు అందరు వచ్చి ఇదెక్కడి వింతనని బీరిపోయి చూస్తున్నరు. పిల్లలు దప్పిక వట్టిర్రు. తిమ్మక్క ఒక పాపకు నీళ్ళు పాలసీసల వట్టుడు తోటి, ఆ పాప గుటుక్కుమని మింగింది. అట్ల పిల్లలందరు నీళ్ళు వట్టిచ్చుడు మొదలు వెట్టిండ్రు. ఊళ్ళె వున్న బాయిలు, బోరింగులు ఎండిపోతున్నయి. పిల్లలందరు గంగమ్మ తల్లి బిడ్డలు గనుక ఎన్ని నీళ్ళు తెచ్చినా తాగుతనే వున్నరు. తిమ్మక్క, చిక్కయ్య కిలో మీటర్లు, కిలోమీటర్లు నడుచుకుంట వొయ్యి ఎన్ని నీళ్ళు వట్టుకొచ్చినా, పిల్లలు నీళ్ళు వట్టిస్తనే వున్నరు. నీళ్ళు మొయ్యలేక చిక్కయ్య బక్కచిక్కి పోయి, ఎవ్వరికి చిక్క కుండ పోయిండు. తిమ్మక్క ఒక్కతే పిల్లలకు నీళ్ళు వట్టిచ్చి వట్టిచ్చి పెంచి పెద్దోల్లను జేశింది. తిమ్మక్క పెరిగిన పిల్లలను జూసుకుంట మురిసిపోవుడు, ఆమె ఆకాశమంత పెరిగిన కొడుకునో, బిడ్డనో పల్కరిచ్చుకుంట వోతుంటే, మబ్బుల బయలుదేరిన తిమ్మక్కకు ఆఖరి కొడుకు దాంక వచ్చే వరకు ఏ రాత్రో అయితుండే. ఇదే ఆమె ప్రపంచమయిపోయింది. అట్ల పెరిగిన నాలుగు వందల నలభై నాలుగుమంది పిల్లలకు, ఇంకో ఎనిమిది వందల ఎనభైనాలుగు మంది పిల్లలు, ఆళ్ళకు ఇంకో పదిహేడు వందల డెబ్భై రెండు మంది పిల్లలు… అట్ల తిమ్మక్కకు మనవలు, మనవరాండ్లు, మునిమనవలు, మునిమనవరాండ్ల సంతతి పెరుకుంట వోతావున్నది. అట్ల ఒకొక్కళ్ళు వంద, రెండు వందలు ఏండ్లు బతుకుంట, కొన్ని లక్షల మందికి ఆశ్రయమిచ్చుకుంట . మింగిన నీళ్ళన్ని కక్కి ఎండిన బాయిలు, చెరువులను నింపుకుంట… ఆ చుట్టు పక్కల పొయ్యేటోళ్లకు గాలి, వెలుతురు, నీడను పంచుకుంట నిమ్మలంగ బతుకుతున్నరు.
ఈ కథ కర్ణాటకలో మూడువందల ఎనభై ఐదు చెట్లు వెట్టి, వాటిని మహా వృక్షాలను చేసి, వృక్ష సంపద కోసం ఎంతో కృషి చేసిన సాలుమరద తిమ్మక్కకు అంకితం.
– బాలు శాండిల్య, 8248335126

Spread the love