Sunday, June 28, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహార్ముజ్ లో మళ్లీ ఉద్రిక్తతలు

హార్ముజ్ లో మళ్లీ ఉద్రిక్తతలు

- Advertisement -

ఇరాన్ క్షిపణి, డ్రోన్ స్థావరాలపై అమెరికా ప్రతీకార దాడులు
బహ్రెయిన్ సహా గల్ఫ్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ఎటాక్

టెహ్రాన్ : ఒకవైపు అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు జరుగుతుండగానే, మరోవైపు ఇరు దేశాలు పరస్పరం దాడులకు దిగాయి. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. హార్ముజ్ లో మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. ఇరాన్ దళాలు వాణిజ్య నౌకపై డ్రోన్ దాడికి పాల్పడటంతో, దానికి ప్రతిచర్యగా అమెరికా సైన్యం ఇరాన్ భూభాగంలోని కీలక క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీరప్రాంత రాడార్ స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు నిర్వహించింది.
అయితే, ఈ కాల్పుల విరమణ ఒప్పంద గడువు ముగియక ముందే ఇరాన్ దానిని ఉల్లంఘించిందని అమెరికా ఆరోపించింది. అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్ దళాలు జరిపిన దాడులకు సమాధానంగానే తాము ఈ శక్తివంతమైన ప్రతిదాడి చేయాల్సి వచ్చిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. ఈ దాడుల తీవ్ర తకు దక్షిణ ఇరాన్‌లోని వ్యూహాత్మక ప్రాంతమైన సిరిక్ సమీపంలో వరుసగా మూడు కంటే ఎక్కువ భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక వార్తా ఛానల్ ఐఆర్ఐబీ పేర్కొంది.

అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేశాం: ఇరాన్
అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతీ కారంగా తాము కూడా ఈ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో దాడులు చేసినట్లు ఇస్లామిక్ రివల్యూ షనరీ గార్డ్ కార్ప్స్ (ఐజీఆర్సీ) ప్రకటించింది. అమెరికా తమ డ్రోన్, రాడార్ కేంద్రాలను దెబ్బ తీసినందుకు బదులుగానే ఈ ప్రతిదాడి జరిపినట్టు పేర్కొన్నప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా అమెరికాకు చెందిన ఏ నిర్దిష్ట స్థావరాలపై దాడులు చేశారనే పూర్తి వివరాలను ఇరాన్ సైన్యం వెల్లడించలేదు.

ఖండించిన ట్రంప్
ఇరాన్ దాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ఖండించారు. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న అంతర్జాతీయ వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ కనీసం నాలుగు డ్రోన్లను ప్రయోగించిందని ఆయన వెల్లడించారు. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లలో మూడింటిని తమ సాయుధ దళాలు గాల్లోనే విజయవంతంగా కూల్చివేసాయని పేర్కొన్నారు. కానీ, దురదృష్టవశాత్తూ ఒక డ్రోన్ అత్యంత ఖరీదైన పెద్ద కార్గో నౌక పైభాగంలో బలంగా దూసుకెళ్లిందన్నారు. దీనివల్ల ఆ నౌకకు కొంత నష్టం వాటిల్లిందని ట్రంప్ చెప్పారు. ఇరాన్ చేసిన ఈ పని స్పష్టంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిం చడమే అని ట్రంప్ స్పష్టం చేశారు. కాల్పుల విరమ ణకు సంబంధించి అమెరికా, ఇరాన్ దేశాలు ఇటీవలే ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ ఎలాంటి అదనపు రవాణా రుసుములు లేదా ఆంక్షలు విధించకుండా 60 రోజుల పాటు హార్ము జ్ ద్వారా అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకలను సజావుగా సాగనివ్వా లి. ఇందుకు బదులుగా అమెరికా సైన్యం ఆ ప్రాంతం లో విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేసి, ఇరాన్‌తో 60 రోజుల పాటు దౌత్యపరమైన అణు చర్చలు ప్రారంభించడానికి అంగీకరించింది.

దాడులకు ముందే 
అమెరికాకు 
వార్నింగ్
దాడులకు ముందే ఇరాన్ సంయుక్త సైనిక కేంద్రం అధికారిక ప్రతినిధి ఇబ్రహీం అల్-ఫికార్ ఎక్స్ వేదికగా అమెరికాను హెచ్చరించారు. అమెరికా జరిపిన దురాక్రమణ చర్యను ఇరాన్ ఊరికే వదిలిపెట్టదని, తాము ఎంచుకున్న సరైన సమయం, స్థలంలో మునుపెన్నడూ లేని విధంగా సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. ఈ రాత్రి ఇరాన్ ఇవ్వబోయే సైనిక ప్రతిఘటన భూమిని కుదిపేస్తుందని, మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక ఉనికిని శాశ్వతంగా తుడిచిపెట్టేలా ఉంటుందని హెచ్చరించారు. చర్చల నెపంతో అమెరికా వెన్నుపోటు పొడిచిందని, ఈ చర్యకు అమెరికా తీవ్రంగా పశ్చాత్తాప పడాల్సి వస్తుందని ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు ఇబ్రహీం అజీజీ కూడా మండి పడ్డారు.

సింగపూర్ నౌకపై దాడి
ఒమన్ దహిత్ రేవు సమీపంలో ప్రయాణిస్తున్న సింగపూర్ పతాకంతో ఉన్న ‘ఎవర్ లవ్లీ’ అనే అంతర్జాతీయ కార్గో నౌకపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ శుక్రవారం రాత్రి ప్రొజెక్టైల్‌తో దాడి చేశారు. ఈ దాడిలో నౌక దెబ్బతిన్నది. అయితే, అందులోని సిబ్బంది ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు కాలేదని అంతర్జాతీయ ఏజెన్సీలు వెల్లడించాయి. ఈ ఘటన జరగడానికి కొన్ని గంటల ముందే, ఇరాన్ పారామిలిటరీ నావికాదళం తమ ముందస్తు అనుమతి లేకుండా హార్ముజ్ జలసంధి గుండా ఏ నౌకలూ ప్రయాణించరాదని హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -