Sunday, June 28, 2026
E-PAPER
Homeహెల్త్సబ్జాతో ఆరోగ్య ప్రయోజనాలు

సబ్జాతో ఆరోగ్య ప్రయోజనాలు

- Advertisement -

సబ్జా గింజలు (తులసి గింజలు) శరీరానికి అవసరమైన పోషకాల ఖజానా. వీటిని సరైన పద్ధతిలో తీసుకుంటే ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే, ఏ పదార్థమైనా మితిమీరితే నష్టం కలిగిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు
సహజ శీతలకరణి
: ఇవి వేసవిలో శరీర తాపాన్ని తగ్గించి, చల్లదనాన్ని ఇస్తాయి. శరీరంలో వేడిని తగ్గించే గుణం వీటికి ఎక్కువగా ఉంది.
బరువు నియంత్రణ: వీటిలో పీచుపదార్థం (Fiber) అధికంగా ఉంటుంది. ఇవి తిన్నప్పుడు కడుపు నిండిన భావన కలిగి ఉండి, ఆకలిని అదుపులో ఉంచుతాయి.

జీర్ణ సమస్యలకు చెక్‌: అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించి పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి తోడ్పడతాయి.
మధుమేహం (Diabetes) నియంత్రణ: రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి ఇవి సహాయపడతాయి.
ఒత్తిడి తగ్గింపు: ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో తోడ్పడతాయి.

వాడే విధానం
సబ్జా గింజలను ఎప్పుడూ నేరుగా (పచ్చిగా) తినకూడదు
1. నానబెట్టడం: ఒక టీస్పూన్‌ సబ్జా గింజలను ఒక గ్లాసు నీటిలో వేయాలి.
2. సమయం: కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు వాటిని నీటిలో నానబెట్టాలి. అవి జెల్లీ లాగా ఉబ్బిన తర్వాతే వాడుకోవాలి.
3. తీసుకునే పద్ధతి: ఇలా నానిన గింజలను మంచినీటిలో, నిమ్మరసంలో, మజ్జిగలో లేదా జ్యూస్‌లలో కలుపుకుని తాగవచ్చు.

రోజువారీ పరిమాణం: పోషకాహార నిపుణుల ప్రకారం.. రోజుకు ఒక చెంచా (దాదాపు 5 గ్రాములు) సబ్జా గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి, ఉదయం పూట తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం.

దుష్ప్రభావాలు – జాగ్రత్తలు
సబ్జా గింజలను అతిగా తీసుకున్నా లేదా సరిగ్గా నానబెట్టకుండా తిన్నా పలు ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
గొంతులో ఇరుక్కునే ప్రమాదం: సబ్జా గింజలను నానబెట్టకుండా తింటే అవి గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. నానిన తర్వాత కూడా వాటి జెల్‌ ఆకతి కొన్నిసార్లు శ్వాసకోశంలో అడ్డంకిగా మారవచ్చు. కాబట్టి పిల్లలు, వద్ధుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
జీర్ణక్రియ సమస్యలు: వీటిలో ఫైబర్‌ అధికంగా ఉండటం వల్ల, పరిమితికి మించి తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్‌ సమస్యలు, విరేచనాలు లేదా కడుపు నొప్పి రావచ్చు.

హార్మోన్ల అసమతుల్యత: సబ్జా గింజలను పెద్ద మొత్తంలో తీసుకోవడం వల్ల ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ స్థాయిలు ప్రభావితం అవుతాయి. ఇది మహిళల్లో రుతుచక్రాన్ని (పీరియడ్స్‌) దెబ్బతీసే అవకాశం ఉంది.
అలెర్జీలు: కొంతమందికి ఇవి పడకపోవచ్చు. వీటిని తిన్న తర్వాత శరీరంపై దురద, వాపు, దద్దుర్లు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి అలెర్జీ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆపేయాలి.

మందులు వాడుతున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
హై బీపీ:
సబ్జా గింజలకు రక్తపోటును తగ్గించే గుణం ఉంది. ఇప్పటికే బీపీ మందులు వాడుతున్న వారు వీటిని ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు మరీ తగ్గిపోయి, నీరసించిపోయే ప్రమాదం ఉంది.
షుగర్‌ వ్యాధి: షుగర్‌ మందులు వాడుతున్న వారు వైద్యుల సలహా మేరకు మాత్రమే మోతాదు మించకుండా తీసుకోవాలి. లేదంటే బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ అకస్మాత్తుగా పడిపోయి బలహీనత, తలనొప్పి, తలతిరగడం వంటి సమస్యలు వస్తాయి.
ప్రత్యేక గమనిక: గర్భిణీలు వైద్యుడి సలహా మేరకు మాత్రమే సబ్జా గింజలను తీసుకోవాలి. వీటి వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, గర్భధారణలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చిన్న పిల్లలకు ఇచ్చే ముందు, అలాగే ఏదైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య ఉన్నవారు వీటిని తీసుకునే ముందు ఆరోగ్య నిపుణులను లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

వాణి అయోధ్య
క్లినికల్‌ డైట్‌ కన్సల్టంట్‌
9959361180

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -