మీ అవసరాలను గుర్తించండి. అలాగని వాటిని తీర్చుకునే నేపధ్యంలో ఆందోళనకు, తీవ్రమైన ఆతతకు లోనుకాకండి. మీరు పడే తపన వాస్తవిక దృక్పథంతో వుండాలి. దానికి తగిన సహనం, పట్టుదల తోడై చేసే కృషి ప్రయోజనాత్మక పద్ధతిలో కొనసాగితే సంతృప్తికరమైన ఫలితం తథ్యం
ఉద్యోగాల వేటలో ఉపాధి అన్వేషణలో కొంతమందికి తమ అన్వేషణ ఇలా ప్రారంభించిన వెంటనే అలా ఒక మంచి ఉద్యోగం అమరిపోతుంది. మరికొంత మందికి ఎన్నాళ్ళు ఎదురు చూసినా సరైన వుద్యోగం రాదు. ఇంకొంత మందికి ఏవేవో ఉద్యోగాలు చేయటం, తరచూ వేర్వేరు ఉద్యోగాలకు మారుతూ వుండటం జరుగుతూనే వుంటుందే తప్ప, ఎంతకాలం ఈ వెదుకులాటలో కొనసాగుతూ వున్నా సరే, తమకు పూర్తి సంతప్తినిచ్చే ఉద్యోగం ఏదీ రాదు. దరఖాస్తు చేత పుచ్చుకుని బయల్దేరిన వెంటనే ఉద్యోగం వరించే వ్యక్తులు చాలా అదష్టవంతులని అందరూ భావిస్తుంటారు. నిజంగా ఇదంతా అదష్టమేనా..? కాదంటుంది విండా మెటియిస్ (అమెరికాకు చెందిన కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్).
పరిమితమైన సంఖ్యలో ఉద్యోగాలు, అపరిమితమైన సంఖ్యలో నిరుద్యోగులు వుంటున్న నేపథ్యంలో ఈవిధంగా అప్లై చేసిన వెంటనే ఉద్యోగం వచ్చేయటం నిజంగానే ఏదో అదృష్టం కలసి వచ్చిందన్నట్లే అన్పిస్తుంది. కానీ, అట్లా చిటికెలో ఉద్యోగం సంపాదించుకున్న వ్యక్తులను, వారి వ్యక్తిత్వాలను కొంత పరిశీలనాత్మక దృష్టితో చూసినట్లయితే వాళ్ళు అవలీలగా ఉద్యోగాన్ని సంపాదించుకోవడం వెనక ‘అదృష్టం’ ప్రసక్తి అట్టే లేదని తెలుస్తుందని లిండా అంటుంది. మరి వేరే కారణమేమయినా వుండవచ్చు…? ఈ ప్రశ్నకు సమాధానంగా లిండా, ఉద్యోగవిజయం సాధించిన వ్యక్తుల స్వభావంలో 7 రకాల మంచి అలవాట్లు వుంటాయని అంటుంది. ఉద్యోగాల వేటను ప్రారంభించిన నాటి నుంచే వారు ఈ 7 అలవాట్లను కల్గి వుండటం వల్ల వారి అన్వేషణ అనతికాలంలోనే ఫలిస్తుంది. మంచి ఉద్యోగం దొరుకుతుంది. అందుచేత ఉద్యోగాలకోసం అదృష్టాన్ని నమ్ముకుని కూర్చోకుండా వీలయినంత వరకు ఈ 7 అలవాట్లను కలిగి వుండండి. అవి ఏమిటో తెలుసుకుందాం.
1. ప్రయోజనంతో వెదకండి: క్లాసిఫైడ్స్ చూసి ‘కావలెను’ అని అడిగిన వారందరికీ తలో అప్లికేషన్ పడేయడం వల్ల ప్రయోజనం వుండదు. మీ లక్ష్యాలకు, విలువలకు ఏది సరియైనదో అటువంటి కంపెనీని ఎన్నుకోండి.
2. ఎప్పుడూ తయారుగా వుండండి: పలు ఉద్యోగాలకు అప్లై చేశాం కదా.! చూద్దాం. ఏదో ఒకటి దొరక్కపోతుందా..! దొరికిన తరువాత ఆ ఉద్యోగంలో ఏం చేయాలో, ఎట్లా ఇమడాలో, ఏవేవి సిద్ధం చేసుకోవాలో ఆలోచిద్దాం..! అనే ఉదాసీనతను వదిలిపెట్టండి. మీరు ఏ కోవకు చెందిన ఉద్యోగానికి దరఖాస్తు పంపారో ఆ ఉద్యోగం వస్తే దానిని వెంటనే తీసుకోవటానికి తయారుగా వుండండి.
3. ఒక ప్రణాళిక ప్రకారం చేయండి : ఉద్యోగాలు మీ ఒళ్ళోకి వచ్చి చేరవు. అందుకు తగిన వ్యూహరచన చేయాలి. మీ ప్రాధాన్యతలేమిటో తెలుసుకోండి. వాటిని ఒక క్రమపద్ధతిలో అమర్చండి. మీ లక్ష్యాలను తెలుసుకోండి. ఒక స్పష్టమైన దృష్టితో ‘ఫలానా ఉద్యోగమే కావాలి’ అనే విశిష్ట స్వభావంతో వేట మొదలు పెట్టండి.
4. సరైన శాఖకు దరఖాస్తు పంపండి : సంస్థలలో మానవ వనరుల శాఖాధికారులు, తమ వద్దకు వచ్చే దరఖాస్తులను స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు. సంస్థ ప్రయోజనాలకు జతకలిసే లక్షణాలు కల్గిన దరఖాస్తులను మాత్రమే నిర్ణయాధికారుల వద్దకు పంపుతారు. కాగా, వడబోతకు గురయిన దరఖాస్తులు మాత్రమే నిర్ణయాధికారి వద్దకు చేరతాయి. మీరు పంపే దరఖాస్తు వడపోతలో ఎగిరి పోయేలా చేసుకోకండి. సంస్థలలో ఎవరిది నిర్ణయాధికారమో వారికి మీరు తిన్నగా దరఖాస్తు పంపండి. అందువలన మీ దరఖాస్తులోని అంశాలు నిర్ణయాధికారికి నేరుగా వెళ్తాయి.
5. ఫాలో అప్ ఉత్తరాలు రాయండి : ఇంటర్వ్యూలకు హాజరైన పిదప వారికి థ్యాంక్స్ చెబుతూ లెటర్స్ రాయండి. అట్లాగే ఉద్యోగావకాశాలకు దగ్గరగానో, లేక సంస్థల అవసరాలకు దగ్గరగా వున్న వ్యక్తులకు తరచూ ఉత్తరాల ద్వారా మీ గురించి తెలియ చేస్తుండండి.
6. వాళ్ళని దూరం పెట్టండి : ఉద్యోగాల వేటలో వున్న వ్యక్తులు కొంతమంది స్వార్ధపరులకు బలై పోతూ వుండటం మనం చూస్తూ వుంటాం. అంచేత ‘ఉద్యోగాలిప్పిస్తాం రండి’ అని బోర్డు పెట్టేవారివద్దకు ‘ప్లేస్మెంట్ గ్యారంటీ’ అని డాంబికాలు పలికే వారి వద్దకు వెళ్ళకండి. మీ ఆకలిని అవి తమ అవకాశంగా భావిస్తాయి.
7. మీ మనసుతో స్నేహం చేయండి : ఉద్యోగం దొరక్కపోటానికి మీ బలహీనత కారణమన్న ఆత్మనిందను వదిలిపెట్టండి. మీ మనస్తత్వం పట్ల మైత్రీభావాన్ని పెంచుకోండి.
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్



