Saturday, August 29, 2026
E-PAPER
Homeహెల్త్అంతరాత్మను కోల్పోకండి.. అదే మీ జీవితానికి నిజమైన దిక్సూచి!

అంతరాత్మను కోల్పోకండి.. అదే మీ జీవితానికి నిజమైన దిక్సూచి!

- Advertisement -

ఒక్కోసారి మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు.. ఒకవైపు ‘అవును’ అంటున్న మనసు, మరోవైపు ‘కాదు’ అని హెచ్చరిస్తున్న అంతరాత్మ! చివరికి ఒక అద్దంలా అంతరాత్మ మన ముందు నిలబడి ‘నువ్వు చేస్తున్నది నిజంగా సరైనదేనా?’ అని ప్రశ్నిస్తుంది. అది కేవలం ఊహ కాదు. మన జీవితంలో ఇలాంటి అంతర్గత సంభాషణ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. మనం చేసే ప్రతి పనిని మనలోని ఒక భాగం పరిశీలిస్తూ ఉంటుంది. అదే మన మనస్సాక్షి లేదా అంతరాత్మ.

విద్యార్థి జీవితంలో అయితే ఈ అంతరాత్మ పాత్ర మరింత ముఖ్యమైనది. ఎందుకంటే ఆ వయసులో వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. ఏది మంచి? ఏది చెడు? ఎవరి మాట వినాలి? ఏ సందర్భంలో ‘నో’ చెప్పాలి? స్నేహం కోసం ఎంతవరకు వెళ్లాలి? విజయం కోసం తప్పు మార్గాన్ని ఎంచుకోవచ్చా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునే దశ అదే.

మార్కుల కంటే ముందుగా మనిషితనం
ఒక విద్యార్థి పరీక్షలో మంచి మార్కులు సాధించాడు అనుకుందాం. అందరూ అభినందించారు. తల్లిదండ్రులు సంతోషించారు. కానీ ఆ మార్కులు అతను కాపీ కొట్టి సంపాదించినవైతే? బయటకు చూస్తే అతను విజేత. కానీ అతని అంతరాత్మకు మాత్రం నిజం తెలుసు. ‘నేను నిజంగా ఈ మార్కులకు అర్హుడినా?’ అనే ప్రశ్న అతని లోపల ఎక్కడో మొదలవుతుంది. మొదటిసారి కాపీ కొట్టినప్పుడు భయం ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎవరైనా చూస్తారేమో అనిపిస్తుంది. పట్టుబడతానేమో అనే ఆందోళన ఉంటుంది. కానీ రెండోసారి.. ఆ భయం కొంచెం తగ్గుతుంది. మూడోసారి.. మరింత తగ్గుతుంది. తర్వాత? తప్పు తప్పుగా అనిపించకుండా పోవచ్చు. ఇదే మనస్తత్వశాస్త్రంలో చాలా ముఖ్యమైన విషయం. ఒక ప్రవర్తనను పదే పదే పునరావృతం చేస్తే, దానిపట్ల మన భావోద్వేగ స్పందన క్రమంగా తగ్గిపోవచ్చు. తప్పును సమర్థించుకునే అలవాటు ఏర్పడుతుంది. ‘అందరూ కాపీ కొడుతున్నారు’, ‘మార్కులు రాకపోతే ఇంట్లో తిడతారు’, ‘ఒక్కసారి చేస్తే ఏమవుతుంది?’, ‘ఎవరికి నష్టం జరగలేదు కదా!’.. ఇలాంటి మాటలు మనస్సాక్షిని నిశ్శబ్దం చేసే స్వీయ సమర్థనలు.

చిన్న తప్పును చిన్నదిగా చూడటం ప్రమాదకరం
ఒక విద్యార్థి స్నేహితుడి పెన్ను తీసుకున్నాడు. అనుమతి అడగలేదు. మరుసటి రోజు మరో వస్తువు తీసుకున్నాడు. తర్వాత ఇంట్లో చెప్పకుండా డబ్బు తీసుకున్నాడు. ‘ఇది పెద్ద నేరం కాదు’ అని ప్రతిసారి తనను తాను సమర్థించుకున్నాడు. ఇక్కడ అసలు సమస్య ఆ వస్తువు విలువ కాదు. తప్పును తప్పుగా గుర్తించే నైతిక స్పందన క్రమంగా బలహీనపడటం. అందుకే పిల్లల విషయంలో ‘ఇది చిన్న తప్పే కదా!’ అని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిర్లక్ష్యం చేయకూడదు. అదే సమయంలో ప్రతి చిన్న తప్పుకూ పిల్లలను అవమానించడం కూడా సరైన పద్ధతి కాదు. తప్పును ఖండించాలి.. పిల్లవాడిని కాదు. ‘నువ్వు చెడ్డవాడివి’ అని చెప్పడం కంటే, ‘నువ్వు చేసిన పని సరైంది కాదు. దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో చూద్దాం’ అని చెప్పడం మానసికంగా ఆరోగ్యకరమైన విధానం.

స్నేహం కోసం మనస్సాక్షిని అమ్ముకోవద్దు
విద్యార్థుల జీవితంలో peer pressure స్నేహితుల ఒత్తిడి చాలా ప్రభావం చూపుతుంది. ఒక బాలుడిని అతని స్నేహితులు స్కూల్‌లో మరో విద్యార్థిని ఆటపట్టించమన్నారు అనుకుందాం. అతనికి అది తప్పని తెలుసు. కానీ ‘నువ్వు చేయకపోతే మా గ్రూప్‌లో ఉండవు’ అని స్నేహితులు బెదిరించారు. అతను కూడా వారితో కలిసి bullying చేశాడు. ఇక్కడ సమస్య కేవలం bullying కాదు. తన అంతరాత్మ చెప్పిన ‘ఇది తప్పు’ అనే మాట కంటే, స్నేహితుల ఆమోదాన్ని ముఖ్యంగా భావించడం. సైకాలజీలో మనిషికి belongingness… తాను ఒక సమూహానికి చెందినవాడిననే భావన చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా యుక్తవయసులో peers మన నిర్ణయాలపై బలమైన ప్రభావం చూపవచ్చు. అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచే ఒక విషయం నేర్పాలి.. ‘అందరూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేయాలి’ అనేది సరైన కారణం కాదు. ఒంటరిగా నిలబడగల ధైర్యం కూడా వ్యక్తిత్వంలో భాగమే.

సోషల్ మీడియా.. అంతరాత్మకు మరో పరీక్ష
ఇప్పటి విద్యార్థుల జీవితంలో సోషల్ మీడియా కూడా ఒక పెద్ద పరీక్ష. ఒక స్నేహితుడి ఫోటోను తీసుకుని funny meme తయారు చేయడం, అతని అనుమతి లేకుండా వీడియోను షేర్ చేయడం, ఒక అమ్మాయి లేదా అబ్బాయి గురించి fake rumour పెట్టడం, ఎవరినైనా అవమానిస్తూ comment చేయడం.. ఇవన్నీ ‘జస్ట్ ఫన్’ అని కొందరు అనుకోవచ్చు. కానీ స్క్రీన్ అవతల కూడా ఒక మనిషి ఉంటాడు. మన మాట వల్ల అతని మనసు బాధపడవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన psychological principle గుర్తుంచుకోవాలి. వ్యక్తి ఎదుట లేకపోతే మనలోని empathy తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ముఖాముఖిగా చెప్పలేని మాటను onlineలో కూడా చెప్పకూడదు. ‘నేను పంపిన మెసేజ్ వల్ల ఆ వ్యక్తి ఎలా ఫీల్ అవుతాడు?’ అని ఒక్క క్షణం ఆలోచించడం కూడా ఒక గొప్ప నైతిక అలవాటు.

ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయం జీవితాన్ని మార్చవచ్చు. ఒక విద్యార్థి చదువులో వెనుకబడ్డాడు. ఇంట్లో ఎప్పుడూ ‘మార్కులు ఎందుకు రావడం లేదు?’ అనే ప్రశ్నలు. స్నేహితులంతా మంచి మార్కులు తెచ్చుకున్నారు. అతనిలో తక్కువతన భావన మొదలైంది. ఒక స్నేహితుడు చెప్పాడు.. ‘నువ్వు ట్యూషన్‌కు రావాల్సిన అవసరం లేదు. ఈసారి question paper ముందే దొరుకుతుంది’. ఆ విద్యార్థికి అది తప్పని తెలుసు. కానీ భయం, ఒత్తిడి, తక్కువతన భావన కలిసి అతన్ని తప్పు నిర్ణయం వైపు నడిపించవచ్చు. ఇక్కడ తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.. పిల్లలపై విజయం కోసం ఒత్తిడి పెంచేటప్పుడు, విజయం సాధించడానికి వారు ఎలాంటి మార్గాన్ని ఎంచుకుంటున్నారో కూడా మనం గమనించాలి. ‘ఎలాగైనా మొదటి ర్యాంక్ రావాలి’ అనే సందేశం కంటే, ‘నిజాయితీగా నీ శక్తిమేరకు ప్రయత్నించు’ అనే సందేశం పిల్లల వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది.

డా.హిప్నో పద్మా కమలాకర్‌
9390044031
కౌన్సెలింగ్‌ సైకో థెరపిస్ట్,
హిప్నో థెరపిస్ట్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -