హెల్తీ ఫుడ్
పోషకాహార సమతుల్యత దెబ్బతినటం, శారీరక శ్రమ తగ్గడం, ప్రాసెస్ చేసిన ఆహారపదార్థాల వినియోగం కారణంగా బరువు పెరగడం నేడు అత్యంత సాధారణంగా మారింది. బరువును అదుపులో ఉంచుకోవడానికి కఠినమైన ఉపవాసాలు పాటించడం కంటే, పోషక విలువలు మెండుగా ఉండి కేలరీలు తక్కువగా ఉండే సహజమైన ఆహారాన్ని ఎంచుకోవడమే అత్యుత్తమ మార్గం. ముఖ్యంగా అధిక పీచుపదార్థం (ఫైబర్), నీటి శాతం, అత్యవసర విటమిన్లు కలిగిన ఆహార పదార్థాలు జీర్ణక్రియను వేగవంతం చేసి, కొవ్వును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
పోషకాల నిలయం: ఆకుకూరలు
బరువు తగ్గాలనుకునే వారికి ఆకుకూరలు అత్యంత ప్రధానమైన ఆహారం. వీటిలో కేలరీలు అత్యంత తక్కువగా ఉండటంతో పాటు శారీరక ఉత్సాహానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
పాలకూరలో ఐరన్‌తో పాటు సమృద్ధిగా ఉండే విటమిన్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. కేలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల ఇది శరీర బరువును పెరగకుండా చూస్తుంది.
కేల్.. అధిక పోషక విలువలు కలిగిన కేల్ ఆకలి వేసే ప్రక్రియను నెమ్మదింపజేసి, ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.
లెట్యూస్.. అధిక నీటి శాతం, తక్కువ కేలరీలు కలిగి ఉండే లెట్యూస్ సలాడ్లలో ప్రముఖంగా ఉపయోగపడే ఆరోగ్యకరమైన ఎంపిక.
ఫైబర్, ప్రొటీన్ల సమ్మేళనం: క్రూసిఫెరస్ కూరగాయలు
జీర్ణవ్యవస్థను ఉత్తేజపరచడానికి, శరీరానికి అవసరమైన పీచుపదార్థాన్ని అందించడానికి క్రూసిఫెరస్ కూరగాయలు సహాయపడతాయి.
బ్రోకలీ.. ఇందులో ఉండే ఫైబర్, విటమిన్ సీ జీర్ణక్రియను మెరుగుపరచి, అతిగా తినాలనే కోరికను నియంత్రిస్తాయి.
కాలిఫ్లవర్.. అధిక కేలరీలు ఉండే అన్నం లేదా ఆలూలకు ప్రతిగా ఉపయోగించగల అత్యంత సద్గుణాలు కలిగిన ప్రత్యామ్నాయం.
బ్రస్సెల్స్ స్ప్రౌట్స్.. ఇవి శరీరంలో ఉండే వాపులను తగ్గించడమే కాక, జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి.
క్యాబేజీ.. కేలరీ డెన్సిటీ చాలా తక్కువగా ఉండే క్యాబేజీ ఆహారంలో ఎక్కువ పరిమాణంలో తీసుకున్నా బరువు పెరిగే ప్రమాదం ఉండదు.
డీహైడ్రేషన్ నివారణకు: అధిక నీటి శాతం ఉన్న కూరగాయలు
బరువు తగ్గే క్రమంలో శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటం చాలా అవసరం. ఈ కూరగాయలు శరీరానికి అవసరమైన తేమను అందిస్తాయి.
దోసకాయ.. 95% పైగా నీటి శాతాన్ని కలిగి ఉండే దోసకాయ శరీరానికి విషతుల్య పదార్థాలను తొలగించి బరువు నియంత్రణలో సాయపడుతుంది.
జుకినీ.. మైదా లేదా బియ్యంతో చేసే పాస్తా, నూడుల్స్ స్థానంలో ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా దీనిని ఉపయోగించవచ్చు.
సెలెరీ.. అత్యంత తక్కువ కేలరీలు, ఎక్కువ నీటి శాతం కలిగిన సెలెరీ జీర్ణక్రియకు ఎంతో ఉపకరిస్తుంది.
బెల్ పేపర్స్/ క్యాప్సికం.. ఇవి ఆహారానికి మంచి రుచిని అందించడమే కాకుండా విటమిన్ సీ ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
సహజమైన తీపి, శక్తినిచ్చే పండ్లు
మధురమైన ఆహారాలు లేదా తీపి పదార్థాలు తినాలనే కోరిక కలిగినప్పుడు పండ్లు సురక్షితమైన ఎంపికగా నిలుస్తాయి.
ఆపిల్స్.. ఆపిల్స్‌లోని కరిగే పీచుపదార్థం జీర్ణక్రియను సమతుల్యం చేస్తుంది. దీనిలోని పూర్తి ప్రయోజనాలు పొందడానికి తొక్కతో సహా తీసుకోవడం శ్రేయస్కరం.
బెర్రీలు.. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్బెర్రీలలో కేలరీలు, చక్కెర తక్కువగా ఉండి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ మెండుగా లభిస్తాయి.
పుచ్చకాయ.. 90% పైగా నీరు ఉండే పుచ్చకాయలో ‘అర్జినిన్’ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును కరిగించడంలో సాయపడుతుంది.
గ్రేప్‌ఫ్రూట్.. భోజనానికి ముందు గ్రేప్‌ఫ్రూట్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు సమతుల్యమై ఆకలి అదుపులో ఉంటుంది.
బేరిపండ్లు.. సమృద్ధిగా ఉండే ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని ఇచ్చి, అదనపు ఆహారం తీసుకోకుండా చూస్తుంది.
నారింజ పండ్లు.. విటమిన్ సీ, ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రిస్తాయి.
టమోటాలు.. వీటిలో ఉండే నీరు, ఫైబర్ ఆకలిని కలిగించే ‘లెప్టిన్’ హార్మోన్ నిరోధకతపై ప్రభావవంతంగా పోరాడతాయి.
పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలు
జ్యూస్‌ల కంటే పండ్లకే ప్రాధాన్యం: పండ్లను రసంగా తాగడం వల్ల ఫైబర్ నశించి, దానిలోని సహజమైన చక్కెరలు రక్తంలో త్వరగా కలుస్తాయి. అందుకే పండ్లను నేరుగా నమిలి తినడం వల్ల శరీరానికి సంపూర్ణ ఫైబర్ అందుతుంది.
పోషకాల సమతుల్యత: రోజువారీ భోజనంలో పెరుగు, ఓట్మీల్ లేదా సలాడ్లతో ఈ పండ్లు, కూరగాయలను చేర్చి తీసుకోవడం వల్ల అదనపు కేలరీలు చేరకుండా ఎక్కువ పోషకాలు శరీరానికి లభిస్తాయి.
ముందస్తు ఆహార ప్రణాళి: మధ్యాహ్నం లేదా రాత్రి భోజనానికి ముందు వెజిటబుల్ సూప్ లేదా సలాడ్ తీసుకోవడం వల్ల ప్రధాన భోజనం ఎక్కువగా తినకుండా నియంత్రించవచ్చు.
వాణీ అయోధ్య
క్లినికల్ డైట్ కన్సల్టంట్
99593 61180
హాయిగా తినండి.. బరువు తగ్గండి
- Advertisement -
- Advertisement -



