ఆ రోజు అర్చన ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి వెళుతున్న సమయంలో ఆమె కొలీగ్స్ చాలామంది వచ్చారు.
”హారు అర్చన, కంగ్రాట్యులేషన్స్ ఫర్ యువర్ మ్యారేజ్. అయినా మమ్మల్ని పెళ్ళికి పిలవకపోవడం అన్యాయం” అన్నారు వాళ్ళు.
”సారీ ఫ్రెండ్స్, నా పెళ్లి సడన్ గా కుదిరింది. అందుకే మిమ్మల్ని పిలవకపోయాను. మళ్ళీ వారం మీ అందరికీ హోటల్లో పెళ్లి విందు ఇస్తాను” అని అర్చన చెప్పడంతో వాళ్ళు శాంతించి వెళ్లిపోయారు. ఆ తరువాత ఆమె సిస్టంని ఆపేసి కిందకు వెళ్ళింది .
ఆమె స్కూటీ తీస్తుండగా ఆమె స్నేహితురాలు వినీల వచ్చి ”అర్చన, నీకు వివాహ శుభాకాంక్షలు. ఏంటి ఇంత అకస్మాత్తుగా పెళ్లి చేసుకున్నావు? ఇంతకీ మధుకి ఎప్పుడు బ్రేకప్ చెప్పేసావు. ఆఫీసులో అందరం నీ పెళ్లి మధుతోనే జరుగుతుందని అనుకునేవాళ్లం. అటువంటిది మా అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ నువ్వు రాజేష్‌ని పెళ్లి చేసుకున్నావు? ఇంతకీ ఏం జరిగింది? అన్నట్టు చెప్పటం మరిచిపోయాను, మధుకి కూడా పెళ్లి అయిపొయింది తెలుసా? ఆ అమ్మాయి పేరు ప్రణీతట. టీసీఎస్‌లో పని చేస్తోందిట. ఏమిటో అన్నీ వింతలూ, విడ్డూరాలూ జరుగుతున్నాయి. ఇవాళ పెళ్లి అయేదాకా ప్రేమల్ని నమ్మకూడదు. ఏదైనా నీ భర్తకి నువ్వు మధుని ప్రేమించిన విషయం తెలియకుండా చూసుకో. లేకపోతే దేవదాస్ అయిపోగలడు” అంది నవ్వూతూ.
”ఈ రోజుల్లో ప్రేమలూ బ్రేకప్పులూ, ఇంకొకరిని పెళ్లి చేసుకోవడాలూ అన్నీ సహజమేనే. వాటి గురించి పెద్దగా పట్టించుకోకూడదు. ప్రతీ వాళ్లకు ఓ ప్రేమకథ ఉంటుంది. ఏం నీకు లేదా? ఇప్పటికి ఇద్దర్ని మార్చేవు? రేపు నీ పెళ్లి నువ్వు తిరుగుతున్న వాడితో కాకుండా వేరే వాడితో జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు .తనదాకా వస్తే గానీ ఏదీ తెలీదు” అని ఆమెకు వ్యంగ్యంగా సమాధానమిచ్చి ఇంటికి బయలుదేరింది అర్చన.
ఆ సమయంలో ఆమెకు గతం గుర్తుకు రాసాగింది.
—
అర్చన నాలుగేళ్ళ క్రితం ఇంజనీరింగ్ పూర్తైన తరువాత హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో చేరింది. అక్కడ ఆమెకు మధు పరిచయం అయ్యాడు. అది సంవత్సరం తిరిగేసరికి ప్రేమగా మారి వాళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో కూరుకు పోయారు. అయితే వాళ్ళు పెళ్లి చేసుకుందామని అనుకుంటున్న సమయంలో ఎదురైన ఒక చిన్న సమస్య పెద్దదై వాళ్ళు విడిపోవడానికి కారణమైంది. మధుకి బెంగళూరులో ఇంకో కంపెనీలో ఎక్కువ జీతంతో ఉద్యోగం రావడంతో అతను అక్కడికి వెళ్ళిపోదామని నిర్ణయించుకొని అర్చనతో చెప్పాడు.
ఆమె ఆశ్చర్యపోతూ ”మధు, నాకు చెప్పకుండా నువ్వు బెంగళూరు ఉద్యోగానికి ఎందుకు దరఖాస్తు చేసావు? మనం త్వరలో పెళ్లి చేసుకుందామనుకుంటున్నాం కదా? ఇప్పుడు నువ్వు బెంగళూరు వెళ్ళిపోతే రేపు మనిద్దరం పెళ్లి చేసుకుంటే ఇబ్బంది అవుతుంది కదా?” అని అడిగింది.
”పెళ్లికోసం మంచి ఉద్యోగాన్ని, ఎక్కువ జీతాన్ని వదులుకోమంటావా? కావలిస్తే నువ్వు కూడా బెంగళూరులో ఉద్యోగం కోసం ప్రయత్నించు. అప్పుడు మన సమస్య తీరిపోతుంది” అన్నాడు మధు.
”అంటే నీకోసం నేను ఇక్కడ చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని అక్కడికి రావాలన్న మాట. నువ్వు మాత్రం నాకోసం ఇక్కడ ఉండవు. ఇది సరైన నిర్ణయమేనా? ఇది నువ్వు కోరి చేసిన పనిలా నాకనిపిస్తోంది” కోపంగా చెప్పింది అర్చన.
అలా మొదలైన వాళ్ళ వాగ్వివాదం పెరిగి పెద్దదై ఇద్దరు పట్టుదలకు, పంతాలకూ పోయి విడిపోయారు.
ఆ తరువాత అర్చన పెళ్లి తన తండ్రి స్నేహితుడి కొడుకైన రాజేష్‌తో జరిగింది. ఆ సంబంధాన్ని అర్చన తండ్రి కుదిర్చేడు. రెండు కుటుంబాలు వాళ్ళ పెళ్ళికి సమ్మతి తెలపడంతో నెల రోజుల వ్యవధిలోనే వాళ్ళ పెళ్లి జరిగిపోయింది. ఆమె భర్త రాజేష్ ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. పెళ్లి తరువాత హైదరాబాద్‌కు బదిలీ పెట్టుకుంటే వాళ్ళ కంపెనీ ఒప్పుకుంది. ఈ నెలాఖరుకి అతను హైదరాబాద్ వచ్చేస్తాడు.
మధుతో విడిపోయిన దగ్గర్నుంచి రాజేష్‌తో పెళ్లి జరిగే వరకు అర్చన బాగా సంఘర్షణకు గురైంది. ూశీఙవ ఱర అవఙవతీ a టaఱశ్రీబతీవబీ ఱ్ ర aశ్రీషayర a శ్రీవరరశీఅ అనీ ఆమె ఎక్కడో చదివింది. మోసపోవడం ద్వారా ప్రేమ మనకు ఒక గుణపాఠం నేర్పుతుంది. మోసపోకుండా ఉండాలంటే జీవితంలో ఎవ్వరినీ ప్రేమించకూడదు. అందుకే ఇప్పుడు ఆమె మధుని పూర్తిగా మరచిపోవాలన్న నిర్ణయానికి వచ్చింది.
దురదష్టవశాత్తూ అతను ఈ హైదరాబాద్ లోనే ఉన్నాడు. పెళ్ళికి ముందు అతను బెంగళూరు వెళ్లి కొత్త ఉద్యోగంలో చేరతానన్నాడు కానీ వెళ్ళలేదు. ఇంకా పాత కంపెనీలోనే పని చేస్తున్నాడు. బహుశా వాళ్ళు ఆఫర్ లెటర్ ఇచ్చి వుండరు. అందుకే ఇక్కడ ఉన్నాడు. పొరపాటున ఎప్పుడైనా అతను ఎదురు పడవచ్చు. కానీ అది జరగకూడదని ఆమె కోరుకుంటోంది.
ఆలోచనల్లోంచి బయటపడి ఇంటికి చేరుకుంది అర్చన.
—
వారం తరువాత శనివారం నాడు రాజేష్ బెంగళూరు నుంచి అర్చన దగ్గరకు పది రోజుల శలవు మీద వచ్చాడు. ఆదివారం వాళ్లిద్దరూ ఆఫీస్ వాళ్లందరికీ తాజ్ దక్కన్‌లో తమ పెళ్లి విందు ఇచ్చారు. దానికి చాలా మంది వచ్చి వాళ్ళిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు.
వారం తరువాత అర్చన ఆఫీసులో ఉన్నప్పుడు ఆమె స్నేహితురాలు వినీల వచ్చి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పింది.
”అర్చన, నీ పాత బారు ఫ్రెండ్ మధుకి ప్రణీత అనే అమ్మాయితో పెళ్లయిందని నీకు చెప్పాను గుర్తుందా? ఆమె బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. నీ హబ్బీ అదే నీ భర్త రాజేష్, ప్రణీత ఇది వరకు ప్రేమించుకున్నారట. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారట. కానీ ఎందుకో మీ పెళ్లిలాగే వాళ్ళది కూడా జరగలేదుట. ఈ నెలాఖరుకి ప్రణీత హైదరాబాద్ బదిలీ చేయించుకొని మధు దగ్గరకు వచ్చేస్తుందిట. ఇంటరెస్టింగ్‌గా ఉంది కదూ? మీ రెండు జంటల ప్రేమలు విఫలమై ప్రేమించిన వాళ్ళను పెళ్లిళ్లు చేసుకోలేదు .కానీ నువ్వు ప్రేమించిన మధుని నీ భర్త ప్రేమించిన ప్రణీత పెళ్లి చేసుకుంటే మధు ప్రేమించిన నిన్ను ప్రణీత ప్రేమించిన రాజేష్ పెళ్లి చేసుకున్నాడు. విధి అంటే ఇదేనేమో? అందుకే ‘విధి చేయు వింతలన్నీ మతిలేని చేత లేననీ’ అన్నాడు ఆత్రేయ. ఇంక మీ రెండు జంటలు ఇక్కడే ఉంటాయి. ఈ విషయం నీకు ఒక్కర్తికే తెలుసనుకుంటాను. భవిష్యత్తులో మీ అందరికీ తెలిసి, మీ నలుగురు కలిస్తే అప్పుడు చూడాలి ఆమెలో డ్రామాని” నవ్వుతూ చెప్పింది వినీల.
ఆ తరువాత కొద్దిసేపు మాట్లాడి ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తరువాత అర్చన ఆలోచనల్లో పడింది.
ఆ మర్నాడు ఉదయం రాజేష్ వాకింగ్‌కి వెళ్ళినపుడు అతని సెల్ ఫోన్ కాంటాక్ట్స్ లిస్ట్ లో ప్రణీత పేరు ఉండటాన్ని గమనించింది అర్చన. అప్పుడు వాట్సాప్‌లో వాళ్ళ మధ్య జరిగిన సంభాషణలను చదివి వాళ్లిద్దరూ ప్రేమించుకున్నట్లు రూఢ చేసుకుంది. అలా ఇంకొకరి ఫోన్స్‌ని వాళ్ళు లేనప్పుడు చూడటం తప్పే అయినా వినీల చెప్పిన సంగతి నిజామా కాదా అన్నది తెలుసుకునేందుకు ఆ పని చేసింది అర్చన.
రాజేష్ ప్రణీతను ప్రేమించాడన్న సంగతి తెలిసిన తరువాత ఆలోచనలతో ఆమె మస్తిష్కం మొద్దు బారిపోయింది. ఈ రోజుల్లో ప్రేమలు సహజం. దానికి తల్లితండ్రులకు దూరంగా, ఒంటరిగా చదువుకోవడం ఒక కారణమైతే యుక్త వయసు ఇంకొక కారణం. అన్ని ప్రేమలూ పెళ్లిళ్లకు దారి తీయవు కాబట్టి ప్రేమించిన వ్యక్తిని కాకుండా ఇంకొక తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకోక తప్పదు. కాకపోతే వాళ్లకు మనం ప్రేమించిన సంగతి తెలియకపోతే సమస్య ఉండదు. తొంబై శాతం అమ్మాయిలు, అబ్బాయిల విషయాల్లో ఇలాగే జరుగుతుంది.
కానీ అర్చన విషయంలో అందుకు భిన్నంగా జరిగింది. విచిత్రంగా ఆమె ప్రేమించిన మధుని ప్రణీత చేసుకోవడం, ప్రణీత ప్రేమించిన రాజేష్‌ని ఆమె పెళ్లిచేసుకోవడంతో పాటు ఆ నలుగురు ఒకే నగరంలో ఉండటం వల్ల భవిష్యత్తులో ఆమె మధుని ప్రేమించిన విషయం భర్త రాజేష్‌కు తెలిసే అవకాశం వుంది. ఆ విషయం తెలిస్తే నలుగురి జీవితాల్లోనూ సమస్యలు ఎదురయ్యే అవకాశం వుంది. కాబట్టి తెలియకుండా ఉంటేనే మంచిది. కానీ తెలియకుండా ఉండటం ఎలా? అందుకు తాను ఏమి చెయ్యాలి? ఆలోచనలతో ఆమె మస్తిష్కం వేడెక్కిపోసాగింది.
వారం తరువాత భర్త రాజేష్‌తో కలిసి ఆమె బెంగుళూర్ వెళ్ళింది. ఆ వారమే రాజేష్ అక్కడ ఉద్యోగంలో రిలీవ్ అయి హైదరాబాద్ వచ్చేస్తాడు కాబట్టి బెంగుళూర్ అంతా తిరుగుదామని ఆమె వెళ్ళింది. ఒక విధంగా హానీమూన్ లాంటిది.
రెండు రోజుల తరువాత రాజేష్ ఒక పని మీద ఆఫీసుకి వెళ్ళినప్పుడు అతనికి తెలియకుండా అర్చన ప్రణీత ఆఫీస్‌కి వెళ్ళింది. అంతకు మునుపే వినీల ద్వారా ప్రణీత పనిచేసే ఆఫీసు వివరాలన్నీ కనుక్కోవడంతో ఆమె ఆఫీసుకి సులభంగానే చేరుకుంది. వెంటనే ప్రణీతను కలిసి తనను పరిచయం చేసుకొని కొద్దిసేపు మాట్లాడాలని చెప్పడంతో పదకొండు గంటలప్పుడు కేంటీన్‌కి తీసికెళ్ళింది ప్రణీత. ఇద్దరూ ఒక మూల కూర్చొని కాఫీ తాగుతున్నప్పుడు అర్చన చెప్పడం మొదలుపెట్టింది.
”ప్రణీతగారు, నేను మధు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాము. అలాగే మీరు, రాజేష్ కూడా ప్రేమించుకున్నారని నాకు తెలిసింది. కానీ మన జీవితాల్లో అనుకున్నవి జరగలేదు. అంతవరకు ఏ సమస్యా లేదు. కానీ భవిష్యత్తులో మనం ఇంకొకరిని ప్రేమించిన సంగతి మన భాగస్వాములకు తెలిస్తే మన వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ వుంది. మగవాడు తాను ఒక అమ్మాయిని ప్రేమించి ఇంకొక అమ్మాయిని పెళ్లిచేసుకోవచ్చు. కానీ తన భార్య ఇంకొక అబ్బాయిని ప్రేమిస్తే అతను తట్టుకోలేడు. పెళ్లి తరువాత ఈ విషయం తెలిస్తే వాడు రాక్షసుడిలాగ మారిపోతాడు. మానవమగంలా తయారై భార్యను జీవితాంతం హింసిస్తాడు. ఒక్కోసారి మగంగా మారి ఆమెను కిరాతకంగా చంపేసే అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల ఆ భార్యాభర్తల జీవితాలు నాశనం అయ్యే ప్రమాదం ఉంది. అదే మన స్త్రీలైతే ఆ విషయాలను కడుపులో పెట్టుకొని జీవితాలను కొనసాగిస్తారు. కడుపులో బడబాగ్నిని దాచుకొని కాపురం చేస్తారు. తాము దీపంలా మారిపోయి వాళ్ళ జీవితాలకు వెలుగును పంచుతారు. అలా జరగకుండా ఉండాలంటే మన భర్తలకు పెళ్ళికి ముందు మనం ఇంకొకరిని ప్రేమించిన సంగతులు ఎట్టి పరిస్థితుల్లో తెలియ కూడదు. అప్పుడే మనిద్దరి జీవితాలు బాగుంటాయి.
జీవితం చదరంగం ఆట లాంటిది. అది అనేక సవాళ్లతో కూడిన ప్రయాణం. శ్రీఱటవ ఱర శ్రీఱసవ a స్త్రaఎవ శీట షష్ట్రవరర, షష్ట్రaఅస్త్రఱఅస్త్ర షఱ్‌ష్ట్ర వaషష్ట్ర ఎశీఙవ. అందులో ప్రతి కదలిక మన గమనాన్ని, గమ్యాన్ని మారుస్తుంది. అందుకే రెండింటిలోనూ వ్యూహం, ఓర్పు, దూరదష్టి ఉండాలి.
నేనిప్పుడు మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే నా భర్త రాజేష్ ఎలాగూ ఈ వారం హైదరాబాద్ బదిలీ మీద వచ్చేస్తున్నాడు. మీరు కూడా హైదరాబాద్ బదిలీ కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసింది. అలా అయితే మనకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. మన రెండు జంటలూ ఒకే దగ్గర ఉంటే మన ప్రేమల సంగతి భర్తలకు తెలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నాకు, మీకే మన నలుగురి ప్రేమ సంగతి తెలుసు. మన భర్తలకు ఆ సంగతులు తెలియవనే అనుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా తెలియకుండా ఉండాలంటే మన రెండు జంటలు ఒక దగ్గర ఉండకూడదు. మీ బదిలీ ఆర్డర్స్ ఇంకా రాలేదు కాబట్టి మీరు హైదరాబాద్ వచ్చే బదులు మధుని ఇక్కడికి బదిలీ చేయించుకోమని చెప్పండి. అందుకు హైదరాబాద్‌కు బదిలీ కష్టం లాంటి ఏవో కారణాలు చెప్పి అతన్ని ఒప్పించండి. అప్పుడు మనిద్దరికీ మంచి జరుగుతుంది. ఈ విషయం చేప్పడానికే నేను ఈ రోజు మీ దగ్గరికి వచ్చాను. ఈ విషయంలో మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి” అని చెప్పి అర్చన వచ్చేసింది.
ఆ మర్నాడు రాజేష్ బెంగళూరు ఆఫీసు నుంచి రిలీవ్ అయ్యాడు. ఆ సాయంత్రమే అర్చన, రాజేష్ కలిసి హైదరాబాద్ వచ్చేసారు.
—
నెల రోజుల తరువాత మధు బదిలీ చేయించుకొని బెంగళూరు వచ్చేసినట్లు అర్చనకు ప్రణీత ఒక మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ చదివి ఆనందంతో ఆ దంపతుల నెంబర్లను కాంటాక్ట్స్ లిస్ట్ నుంచి డిలీట్ చేసింది అర్చన.
గన్నవరపు నరసింహ మూర్తి



