లాకప్ డెత్ పై మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు
ముంబయి : పోలీసుల అదుపులో మరణించిన బేగ్యా పవార్ కుటుంబీకులకు ఎట్టకేల కు న్యాయం దక్కింది. 15 ఏండ్లుగా హంతకులకు శిక్ష పడే వరకు కోర్టుల చుట్టూ తిరిగారు. పోలీసు కస్టడీలో జరిగిన హత్య కేసులో, మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా సెషన్స్ కోర్టు, మాజీ స్టేషన్ అధికారితో సహా తొమ్మిది మంది పోలీసులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. తమ అమాయక యువ కుమారుడిని కోల్పోయిన వృద్ధ తల్లిదండ్రులకు న్యాయం లభించింది.
ఫిర్యాదు నమోదుకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ నిరాకరణ
తమ కుమారుడి మృతి తర్వాత, ఆ వృద్ధ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడానికి రిసోద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు, అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. వాస్తవానికి, ఆ ఫిర్యాదులో స్టేషన్ హౌస్ ఆఫీసర్ పేరునే చేర్చారు. దీని తరువాత, కేసు నమోదు చేయాలని ఒత్తిడి చేస్తూ ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు, ప్రదర్శనలు జరిగాయి. రహస్యాన్ని వెల్లడించిన సీఐడీ దర్యాప్తు ఈ దర్యాప్తును సీఐడీ అధికారి అన్వర్ షేక్‌కు అప్పగించారు. అన్వర్ షేక్ ఈ కేసులోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేసి, కోర్టులో బలమైన చార్జిషీట్‌ను సమర్పించారు. ఈ ఛార్జిషీట్ పోలీసుల అరాచకాల పూర్తి నిజాన్ని వెల్లడించింది.
15 ఏండ్ల తర్వాత దోషులకు శిక్ష
15 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత, వాషిం జిల్లా సెషన్స్ కోర్టు ఎట్టకేలకు తన తీర్పును వెలువరించింది. అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ మహాదేవ్ మాణిక్ ధాండేతో పాటు అతని ఎనిమిది మంది పోలీసు అధికారులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తొమ్మిది మంది దోషులలో, అప్పటి స్టేషన్ అధికారితో సహా ఇద్దరు అధికారులు ఇప్పుడు పోలీసు సేవ నుంచి ఉద్యోగ విరమణ చేశారు. తమ కుమారుడి హంతకులకు శిక్ష పడినందుకు ఆ వృద్ధ తల్లిదండ్రులు దేశ న్యాయవ్యవస్థకు, సీఐడీ అధికారి అన్వర్ షేక్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ తీర్పుతో ఇప్పుడు తాము ప్రశాంతంగా నిద్రపోగలమని వారు అన్నారు.
ఏం జరిగింది..?
మే 10వ తేదీన, తెల్లవారుజామున 3 గంటలకు, రిసోద్ పోలీసులు 23 ఏండ్ల పార్ధి వాసి అయిన బేగ్యా పవార్‌ను ఇంటినుంచి అరెస్టు చేశారు. విచారణ కోసమే తీసుకువెళ్తున్నా మని పోలీసులు తెలిపారు. అయితే, పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లిన తర్వాత, అతడిని దారుణంగా కొట్టి చంపే శారు. మృతుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా, ఈ దారుణమైన దాడి కార ణంగా అతని శరీరంలోని అనేక ఎముకలు విరిగినట్టు వెల్లడైంది. ఏడాది క్రితమే వివాహం చేసుకున్న బేగ్యాపవార్‌కు గతంలో ఎలాంటి నేరచరిత్ర లేదు. అయినప్పటికీ, పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి తీవ్రంగా కొట్టారు.



