న్యాయ ప్రక్రియకే విపత్తు : సుప్రీంకోర్టు
ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు
న్యూఢిల్లీ : కృత్రిమ మేధస్సు (ఏఐ)ను వినియోగించి తయారు చేసిన కల్పిత తీర్పులను ఉపయోగించడం న్యాయ ప్రక్రియకే విపత్తు అని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఏఐ కల్పిత తీర్పులను ఉపయోగించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. స్వతంత్ర ధ్రు వీకరణ లేకుండా ఎఐ రూపొందించిన తీర్పులపై ఆధారపడే విషయంలో న్యాయస్థానాలు “జీరో-టాలరెన్స్” వైఖరిని అవలంబించాలని పేర్కొంది. ఎఐ కల్పిత తీర్పులను ఉపయోగించడం న్యాయ నిర్ణయాల జీవనాడిని” “కలుషితం” చేస్తుందని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరధేలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘ న్యాయ నిర్ణయ ప్రక్రియలోకి స్వల్పంగానైనా నకిలీ లేదా కల్పిత సమాచారం ప్రవేశించినా అది తీర్పు పవిత్రతను ఉల్లంఘించినట్లే. నిర్ణయాలు తీసుకోవడంలో సమగ్రతను కాపాడుకోవడం అత్యంత అవసరం. కాబట్టి అలాంటి సమాచారాన్ని అధారంగా తీసుకోవడం, ప్రస్తావించడం లేదా దానిపై పూర్తి ఆధారపడటం వంటి విషయాల్లో బార్, బెంచ్‌లు “జీరో-టాలరెన్స్” వైఖరిని అవలంభించాలని పునరుద్ఘాటిస్తున్నాం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కృత్రిమ మేధ సృష్టించే భ్రమలు న్యాయవాద వృత్తిలోకి నిశ్శబ్దంగా చొచ్చుకొని రావడంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.
ఎఐ కల్పిత తీర్పులపై ఆధారపడటం “చట్టబద్ధమైన పాలనను అణగదొక్కుతుందని” ధర్మాసనం హెచ్చరించింది. జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ చేసిన ఒక దరఖాస్తు విషయంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సమయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. జమ్మూకాశ్మీర్ బ్యాంక్ నుంచి సస్పెండ్ అయిన డైరెక్టర్ పూజా రమేష్ సింగ్ ఈ పిటీషన్ దాఖలు చేశారు. జమ్మూకాశ్మీర్ బ్యాంక్ తరుపు న్యాయవాది ఎన్‌సిఎల్‌టి ముందు కల్పిత తీర్పులను ఉపయోగించి పాన్ ఇండియా యుటిలిటీస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌పై దివాళా ప్రక్రియను ఆమోదించుకున్నారని పూజా రమేష్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎఐ తీర్పులపై ఆధారపడి ఎన్‌సిఎల్‌టి ముంబయి బెంచ్ ఆగస్టులో దివాలా దరఖాస్తును అంగీకరించింది. తరువాత ఈ ఉత్తర్వును తదనంతరం నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) కూడా ధ్రు వీకరించడం విశేషం. కల్పిత తీర్పుల ఆధారంగా ఎన్‌సీఎల్‌టీ ఈ ఉత్తర్వులు జారీ చేసిందనే విషయాన్ని ఎన్‌సీఎల్‌ఏటీ కూడా గుర్తించకపోవడంపై సుప్రీం కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అలాగే, వివిధ కోర్టుల ముందు ఎఐ సృష్టించిన కల్పిత తీర్పులను ఉదహరిస్తున్న సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని పరిశీలంచి తగిన నిబంధనలను రూపొందించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)ను ధర్మాసనం ఆదేశించింది. ‘‘బార్ కౌన్సిల్ ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించి నిబంధనల ఉల్లంఘనపై తీసుకునే క్రమశిక్షణా చర్యలతో పాటు, ఇలాంటి సంఘటనలను నివారించడానికి ఒక మార్గదర్శక సూత్రాన్ని సూచించాలి’’ అని ధర్మాసనం పేర్కొంది.
ఏఐ కల్పిత తీర్పులను ఉపయోగించడం సరికాదు
- Advertisement -
- Advertisement -



