విజృంభించనున్న
సూపర్ ఎల్‌నినో
మరింతగా భానుడి భగభగ
లక్షల సంఖ్యలో
ప్రాణాలు పోతాయి : క్లైమెట్ ఇంపాక్ట్ ల్యాబ్ నివేదిక
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా పేద దేశాల్లో ‘సూపర్ ఎల్‌నినో’తో లక్షల సంఖ్యలో ప్రాణాలు పోవడం ఖాయమని క్లైమెట్ ఇంపాక్ట్ ల్యాబ్ నివేదిక హెచ్చరిస్తోంది. 2026 సెప్టెంబర్ నుంచి 2027 ఫిబ్రవరి మధ్యలో కనీసం 4.5 లక్షల మంది ఎండ వేడికి చనిపోయే అవకాశం ఉందని పేర్కొంది. భారత్‌లో కూడా వేల సంఖ్యలో మరణాలకు అవకాశాలున్నాయని నివేదిక వెల్లడించింది. సాధారణ రోజుల్లో.. సగటున ఎంతమంది చనిపోతారనే ముందుస్తు అంచనాకు ఇది అదనమని రిపోర్టు పేర్కొంది. 1996-2025ను బేస్‌లైన్‌గా తీసుకొని దీనిని తయారు చేశారు.
భారీ మూల్యం చెల్లించుకొంటున్న పేద దేశాలు
ప్రపంచ పేద దేశాలపై ఈ రిపోర్టు ఎక్కువ దృష్టి సారించింది. ఆఫ్రికాలోని ‘సాహిల్ రీజియన్’ (ఆఫ్రికా మధ్యలోని 9 దేశాల్లో ఐదువేల కిలోమీటర్లు విస్తరించిన ప్రాంతం)లో 66,800 మంది వేడిమి కారణంగా.. అదనంగా చనిపోవచ్చని వెల్లడించింది. వీటిల్లో 31,400 మరణాలు నైజీరియాలో, 17,500 మరణాలు సుడాన్‌లో, 10,000 మరణాలు నైజెర్‌లో, 8,000 మరణాలు ఛాడ్‌లో నమోదు కావొచ్చని అంచనా వేసింది. ఇక ఆగ్నేయాసియాలో ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయ్‌ల్యాండ్, కంబోడియాలో కలిపి సంయుక్తంగా 19,400 అదనపు మరణాలు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఒక్క ఇండోనేసియాలోనే 19,300 మంది ప్రాణాలు కోల్పోతారని చెప్పింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు తట్టుకోలేక.. భారత్ లో 15,800, బ్రెజిల్‌లో 13,300 మరణాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. భారత్, పాకిస్తాన్ దేశాల్లో రానున్న వేసవిలో కూడా మరణాలు నిలకడగా పెరిగే ప్రమాదం ఉందని నివేదిక పేర్కొంది.
2027లో కూడా వదలని ఎల్‌నినో..!
ఇప్పటి వరకు ఎల్‌నినో పూర్తి స్థాయిలో ఏర్పడలేదు. సెప్టెంబర్ 3వ తేదీన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) స్పందిస్తూ భవిష్యత్తులో ఎల్‌నినో మరింత బలపడుతుందని పేర్కొంది. దీని తీవ్రత నవంబర్, డిసెంబర్ నెలల్లో తారస్థాయికి చేరుతుందని అంచనావేసింది. 2027 ఫిబ్రవరిలో కూడా ఇది కొనసాగుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ భావిస్తోంది. భూమధ్య రేఖ వద్ద పసిఫిక్ సముద్రంలో ఉష్ణోగ్రత కూడా 1.8 డిగ్రీల సెల్సియస్ పెరగొచ్చని ఇప్పటికే అమెరికా నేషనల్ ఓషన్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. భూ ఉత్తరార్ధగోళంలో ఎల్‌నినో చాలా బలంగా ఉంటుందని ఈ సంస్థ వెల్లడించింది. 1901లో రికార్డుల నమోదు మొదలైన నాటి నుంచి.. ఈ ఏడాది ఆగస్టు నెల ‘అత్యంత వేడిగా ఉన్న ఆగస్టు’గా నిలిచింది.
ముందస్తు ఏర్పాట్లపై దృష్టి పెట్టాలి
ప్రభుత్వాలు ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకునేలా తమ నివేదిక ఉపయోగపడుతుందని ది క్లైమెట్ ఇంపాక్ట్ ల్యాబ్ వెల్లడించింది. ముందస్తుగా హీట్ వార్నింగ్స్ జారీ చేయడం, కూలింగ్ సెంటర్లు నిర్వహించడం, తాగునీటి సౌకర్యాలను పెంచడం, ఆరుబయట పనిచేసే ఉద్యోగులకు రక్షణ ఏర్పాట్లు కల్పించడం, ఆరోగ్య వ్యవస్థను సిద్ధం చేయడానికి ఈ అంచనాలు ఉపయోగపడనున్నాయి.
ఇక మంటలే..
- Advertisement -
- Advertisement -



