Thursday, September 24, 2026
E-PAPER
Homeజాతీయం​391కి చేరిన బిలియనీర్లు

​391కి చేరిన బిలియనీర్లు

- Advertisement -

కొత్తగా మరో 27 మంది కుబేరులు
దేశంలో పెరుగుతున్న శ్రీమంతుల సంపద
ఏడాదిలో 13 శాతం పెరుగుదల
అగ్రస్థానంలో అదానీ కుటుంబం : హురున్ ఇండియా రిచ్ లిస్ట్ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ:
దేశంలో అధిక ధరలు సామాన్య ప్రజల ఆదాయాలను హరించుకుపోతుంటే వారు మరింత కిందికి దిగజారుతుండగా, మరోవైపు ధనవంతులు మాత్రం కుబేరులుగా మారుతున్నారు. గతేడాదితో పోలిస్తే దేశంలో కొత్తగా 27 మంది డాలర్ బిలియనీర్లు పుట్టుకొచ్చారని ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026 నివేదిక వెల్లడించింది. దీంతో మొత్తం బిలియనీర్ల సంఖ్య 391కి చేరింది. ఐదేండ్ల క్రితం ఈ సంఖ్య కేవలం 237 గా ఉంది. కనీసం రూ. 1,000 కోట్ల సంపద కలిగిన 1,810 మంది వ్యక్తుల వివరాలను ఈ నివేదిక పరిగణనలోకి తీసుకుంది. వీరి మొత్తం సంపద గత ఏడాదితో పోలిస్తే 12.8 శాతం పెరిగి రూ.187.5 లక్షల కోట్లకు (సుమారు 1.96 ట్రిలియన్ డాలర్లు) చేరుకుందని తెలిపింది. స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వ్యాపార వాటాలు, పారిశ్రామిక రంగాల వృద్ధి ఆధారంగా దేశంలోని అత్యంత సంపన్నుల సంపద పెరిగినట్లు ఈ నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వ్యక్తుల సగటు సంపద గతంలో రూ. 9,874 కోట్లు ఉండగా.. అది ఇప్పుడు రూ.10,362 కోట్లకు పెరిగింది. జాబితాలోని సంపన్నులు సంయుక్తంగా రోజుకు సగటున రూ.5,833 కోట్ల చొప్పున సంపదను పోగు చేయడం విశేషం.

రెండో స్థానానికి ముకేష్‌ అంబానీ..
గౌతమ్ అదానీ కుటుంబం రూ.9.23 లక్షల కోట్ల సంపదతో దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబంగా అగ్రస్థానంలో ఉంది. గతేడాది అగ్రస్థానంలో ఉన్న ముకేష్ అంబానీ కుటుంబం రూ.8.63 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానానికి తగ్గింది. ఈ రెండు కుటుంబాల మధ్య సంపద వ్యత్యాసం రూ.59,400 కోట్లుగా ఉంది. ఎల్ఎన్ మిట్టల్ కుటుంబం రూ.3.39 లక్షల కోట్ల సంపదతో మూడో స్థానంలో నిలిచింది. ఏడాదిలో 93 శాతం సంపద పెరగడం మిట్టల్ కుటుంబాన్ని మూడో స్థానానికి చేర్చింది. సైరస్ ఎస్. పూనావాలా రూ.3.03 లక్షల కోట్లతో నాలుగో స్థానంలో, రోషిణి నాడర్ మల్హోత్రా రూ.2.79 లక్షల కోట్లతో ఐదో స్థానంలో ఉన్నారు. రోషిణి నాడర్ దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా కొనసాగుతున్నారు. కుమార మంగళం బిర్లా రూ.2.69 లక్షల కోట్ల సంపదతో ఆరో స్థానంలో ఉండగా, దిలీప్ సంఘ్వి రూ.2.65 లక్షల కోట్లు, అజీమ్ ప్రేమ్‌జీ రూ.2.63 లక్షల కోట్లు, అనిల్ అగర్వాల్ కుటుంబం రూ.2.08 లక్షల కోట్లు, సమీర్ మెహతా కుటుంబం రూ.1.89 లక్షల కోట్ల సంపదతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ఏఐ, రక్షణ రంగాల్లో కొత్త కుబేరులు
పెట్టుబడిదారుల సంపద నిర్మాణంలో కొత్త రంగాల వాటా పెరుగుతోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ), ఏరోస్పేస్, రక్షణ, గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు, తయారీ రంగాల నుంచి కొత్త సంపన్నులు వెలుగులోకి వస్తున్నారు. ఏఐ రంగానికి చెందిన 19 మంది ఈ ఏడాది జాబితాలో చోటు దక్కించుకోగా.. వారి ఉమ్మడి సంపద రూ.3.07 లక్షల కోట్లకు చేరింది. వీరిలో 15 మంది తొలిసారిగా జాబితాలోకి వచ్చారు. క్యూపీఎఐ సంస్థకు చెందిన నాగేంద్ర నాగరాజ్ రూ.1,700 కోట్ల సంపదతో దేశపు తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ రిచ్ లిస్టర్‌గా నిలిచారు.

​‌హైదరాబాద్‌‌లో 114 మంది..
భారత్‌లో సంపద కేంద్రీకరణ భౌగోళికంగా కూడా మారుతోంది. 465 మంది సంపన్నులతో ముంబయి అగ్రస్థానంలో ఉండగా, న్యూఢిల్లీ 236, బెంగళూరు 129, హైదరాబాద్ 114, చెన్నయ్‌ 96 మందితో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు బావ్‌కోట్, సోలన్, మండి గోవింద్‌గఢ్, మీర్జాపూర్‌ వంటి చిన్న పట్టణాల నుంచి కూడా కొత్త సంపన్నులు జాబితాలోకి రావడం విశేషం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -