విస్తృత ధర్మాసనానికి పంపడంపై
ఇద్దరు న్యాయమూర్తుల మధ్య విభేదం
రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుపై సీజేఐకి సిఫారసు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్ల (ఈసీలు) నియామకానికి సంబంధించిన 2023 చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం భిన్న తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీంతో కేసును తగిన సంఖ్యలో న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ముందుంచాలని ఇద్దరు న్యాయమూర్తులు ఏకాభిప్రాయానికి వచ్చారు.
2023లో పార్లమెంట్ ఆమోదించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్ల (నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలం) చట్టంలో సీఈసీ, ఈసీల నియామక కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ప్రధానమంత్రి నామినేట్ చేసే కేంద్ర మంత్రిని చేర్చారు. ప్రస్తుతం ఈ కమిటీలో ప్రధానమంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నేత, ప్రధానమంత్రి నామినేట్ చేసిన కేంద్ర మంత్రి సభ్యులుగా ఉంటారు. ఈ మార్పునే పిటిషనర్లు సవాల్ చేశారు.
స్వతంత్రతపై జస్టిస్ దత్తా అభిప్రాయం
కేంద్రం కోరిన విధంగా కేసును పెద్ద ధర్మాసనానికి పంపాల్సిన అవసరం లేదని జస్టిస్ దీపాంకర్ దత్తా అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా పని చేయడం మాత్రమే కాకుండా, అది స్వతంత్రంగా పని చేస్తుందనే నమ్మకం ప్రజల్లో కనిపించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నామినేట్ చేసే కేంద్ర మంత్రి అదే ప్రభుత్వంలో భాగంగా ఉన్నందున ప్రధానమంత్రికి వ్యతిరేకంగా స్వతంత్రంగా వ్యవహరిస్తారని ఆశించడం కష్టమని జస్టిస్ దత్తా వ్యాఖ్యానించారు. అటువంటి వ్యవస్థలో తటస్థ సభ్యుడు అందించే స్వతంత్ర ప్రతిస్పందనకు సమానమైన సమతుల్యత ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా ఉండటమే కాకుండా, అది స్వతంత్రంగా ఉందనే భావన కూడా ప్రజల్లో ఉండాలని స్పష్టం చేశారు.
పెద్ద ధర్మాసనం అవసరమన్న జస్టిస్ శర్మ
మరోవైపు జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ పిటిషన్లలో గణనీయమైన రాజ్యాంగపరమైన ప్రశ్నలు ఉన్నందున వాటిని పెద్ద ధర్మాసనం తేల్చాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 145(3) ప్రకారం కనీసం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇద్దరు న్యాయమూర్తుల మధ్య అభిప్రాయ భేదం ఉన్నప్పటికీ, ఈ వ్యవహారాన్ని మరో చిన్న ధర్మాసనం వద్దకు పంపి, ఆ తర్వాత మళ్లీ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే ప్రక్రియ వల్ల మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. అందువల్ల నేరుగా సీజేఐ వద్దకు పంపి తగిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించింది.
‘అనూప్ బరన్వాల్’ తీర్పు నేపథ్యంలో
ఈ వివాదానికి 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పు కీలక నేపథ్యంగా ఉంది. పార్లమెంట్ చట్టం చేసే వరకు సీఈసీ, ఈసీల నియామకానికి ప్రధానమంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నేత, సీజేఐలతో కూడిన కమిటీని సుప్రీంకోర్టు సూచించింది. అయితే అనంతరం పార్లమెంట్ 2023లో కొత్త చట్టం తీసుకువచ్చి సీజేఐ స్థానంలో ప్రధానమంత్రి నామినేట్ చేసే కేంద్ర మంత్రిని నియామక కమిటీలో చేర్చింది. ఈ మార్పుతో నియామ క కమిటీలో ప్రభుత్వానికి చెందిన ఇద్దరు సభ్యులు, ప్రతిపక్షానికి చెందిన ఒక సభ్యుడు ఉండే పరిస్థితి ఏర్పడిందని పిటిషనర్లు వాదిస్తున్నారు. మరోవైపు, పార్ల మెంట్ తన శాసనాధికార పరిధిలోనే కొత్త నియామక వ్యవస్థను రూపొందించిందని కేంద్ర ప్రభుత్వం వాదించింది. అనూప్ బరన్వాల్ తీర్పు శాసనపరమైన ఖాళీని భర్తీ చేయడానికి మాత్రమే తాత్కాలిక వ్యవస్థను ఏర్పాటు చేసిందని కేంద్రం పేర్కొంది.
రాజ్యాంగ కేసుల జాప్యంపై సుప్రీం ఆందోళన
పెద్ద ధర్మాసనాలకు పంపుతున్న రాజ్యాంగపరమైన కేసుల విచారణలో జాప్యం జరుగుతున్న అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. కొన్ని రాజ్యాంగపరమైన అంశాలు ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయన్న ఆందోళనను ధర్మాసనం వ్యక్తం చేసింది. రాజ్యాంగ కేసుల విచారణ కోసం శాశ్వతంగా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేసే అంశాన్ని సీజేఐ పరిశీలించాలని కోరింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం చెల్లుబాటు, ఎన్నికల సంఘం స్వతంత్రతకు రాజ్యాంగపరమైన రక్షణ, నియామక ప్రక్రియలో ప్రభుత్వ–ప్రతిపక్షాల పాత్ర వంటి కీలక అంశాలపై తుది నిర్ణయం ఇక రాజ్యాంగ ధర్మాసనం పరిధిలోకి వెళ్లనుంది.
ఈసీల నియామకంపై సుప్రీం భిన్న తీర్పు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



