బొగ్గు కొరతతో
థర్మల్ విద్యుత్ ప్లాంట్ల మూత
జెన్‌కోకు నాసిరకం బొగ్గు సరఫరాతో రూ.2,900 కోట్ల నష్టం
నేడు పవర్‌ప్లాంట్ల సందర్శన : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యం వల్లే కరెంటు కోతలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. బొగ్గు కొరత కారణంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో
విద్యుత్ ఉత్పత్తి నిలిపేస్తున్నారని అన్నారు. నీటి కొరత వల్ల జల విద్యుత్ కేంద్రాలు కూడా విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోతున్నాయని చెప్పారు. ఇప్పుడే విద్యుత్ కోతలు ఇలా ఉంటే వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ కేంద్రాల వద్ద వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు గురువారం ఆరు బీఆర్‌ఎస్ బృందాలు రాష్ట్రంలోని థర్మల్ పవర్ ప్లాంట్లు, సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్నాయని వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు కరెంట్ విలాస వస్తువు కాదనీ, జీవనరేఖ అని అన్నారు. వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, పరిశ్రమలు, ఐటీ రంగం, గృహ అవసరాలు అన్నింటికీ విద్యుత్ అత్యంత కీలకమని చెప్పారు. విద్యుత్ సమస్యపైనే తెలంగాణ మలిదశ ఉద్యమానికి పునాది పడిందని గుర్తుచేశారు.
‘ఎల్‌నినో కాదు.. ఎల్ కాంగో’
విద్యుత్ సంక్షోభానికి ఎల్‌నినో ప్రభావం కారణం కాదనీ, ఎల్ కాంగో (కాంగ్రెస్) ప్రధాన కారణమని కేటీఆర్ విమర్శించారు. విద్యుత్ సంక్షోభానికి సింగరేణి బొగ్గు సరఫరా వ్యవస్థ కూడా ఒకటని అన్నారు.
సింగరేణితో సర్కార్ ఫుట్‌బాల్
సింగరేణి సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఫుట్‌బాల్ ఆట ఆడుతున్నదని కేటీఆర్ అన్నారు. సింగరేణితో కార్మికులు, రైతులు, ప్రజలు ఆటలాడే పరిస్థితి రావొద్దని కోరారు. సింగరేణిలో సైట్ విజిటేషన్ సర్టిఫికెట్ల పేరుతో అక్రమాలు, సోలార్ పవర్ టెండర్లలో అవకతవకలు జరిగాయని విమర్శించారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి 2023-24లో 70 మిలియన్ టన్నుల నుంచి 2025-26లో 58 మిలియన్ టన్నులకు ఎందుకు పడిపోయిందని ప్రశ్నించారు.
వ్యవసాయానికి ఆరు గంటల కరెంటు
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయానికి ఆరు గంటలకు మించి కరెంట్ సరఫరా కావడం లేదని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదు
‘కాంగ్రెస్ అధికారంలో ఉంటే కరెంటు ఉండదని కేటీఆర్ అన్నారు. అదే ఇప్పుడు నిజమైందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలోనూ రైతులు విద్యుత్ కోతలపై రోడ్డెక్కారని గుర్తు చేశారు. విద్యుత్ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఆరు బీఆర్‌ఎస్ బృందాలు గురువారం పవర్ స్టేషన్లను సందర్శిస్తాయని చెప్పారు.
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్‌ను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ను మాజీ మంత్రి పువ్వాడ అజయ్, భూపాలపల్లిలోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి,చెన్నూరు నియోజకవర్గం జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, అనిల్ జాదవ్‌ల బృందం సందర్శిస్తుందని వివరించారు. హైదరాబాద్‌లోని సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే వివేకానందగౌడ్ పరిశీలిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రులు తాటికొండ రాజయ్య, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, ఎల్ రమణ, ఎమ్మెల్యేలు కెపి వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు ఎ జీవన్‌రెడ్డి, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ వైఫల్యం వల్లే కరెంటు కోతలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



