భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో
ఎయిర్ పోర్టు స్థలాలు పరిశీలన
నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
కేంద్ర మంత్రితో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రతిపాదించిన ప్రాంతాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం ఈనెల 7న తెలంగాణలో పర్యటించనుంది. నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మంగళవారం నాడిక్కడ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో తుమ్మల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పరిశీలించిన రెండు స్థలాలు సాంకేతిక కారణాలతో విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా లేవని తేలిన నేపథ్యంలో కొత్తగా నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించినట్టు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో భౌగోళిక, వాతావరణ పరిస్థితులతో పాటు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సాధ్యాసాధ్యాలను కేంద్ర బృందం పరిశీలించనుందన్నారు. కేంద్ర సాంకేతిక బృందం నివేదిక అనుకూలంగా వచ్చిన అనంతరం కొత్తగూడెం విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన తదుపరి చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చినట్టు తుమ్మల తెలిపారు.
నేడు మామునూరు, ఆదిలాబాద్‌పై చర్చ
తెలంగాణలోని మామునూరు (వరంగల్), ఆదిలాబాద్ విమానా శ్రయాల ప్రతిపాదనలపైనా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఈ నెల 2న కేంద్ర ప్రభుత్వంతో చర్చించే అవకాశం ఉందని తుమ్మల పేర్కొన్నారు.
భద్రాద్రి ప్రాంత ప్రాధాన్యాన్ని కేంద్ర మంత్రికి వివరించిన తుమ్మల
కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు తండ్రి, దివంగత ఎర్రన్నాయుడు తన చిరకాల మిత్రుడని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుర్తుచేశారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం కారణంగా భద్రాద్రి ప్రాంతానికి ఉన్న ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాధాన్యంతో పాటు జిల్లా ప్రజల దీర్ఘకాలిక విమానాశ్రయ అవసరాన్ని కేంద్ర మంత్రికి వివరించినట్టు తెలిపారు. అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల దీర్ఘకాల ఆకాంక్షను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి వెంటనే కేంద్ర సాంకేతిక బృందాన్ని పంపేందుకు చర్యలు చేపట్టడం పట్ల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి, కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు.
7న రాష్ట్రంలో కేంద్ర సాంకేతిక బృందం పర్యటన
- Advertisement -
- Advertisement -



