Sunday, July 5, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిపాటకు ప్రాణం పోసిన ‘‘నాగన్న’’

పాటకు ప్రాణం పోసిన ‘‘నాగన్న’’

- Advertisement -

పాటకు ప్రాణం పోస్తూ నలభై సంవత్సరాలు పైన ప్రజా పోరాటాలకు, పీడిత వర్గ ప్రజల హక్కుల కోసం , అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తను గజ్జెకట్టాడు. ఆట ఆడాడు,పాట పాడాడు. ఆ గొంతు వింటే భూస్వాముల వెన్నులో వణుకు పుట్టేది, ఆ స్వరగానానికి పుట్టిన బిడ్డ కూడా పెత్తందారులకు సవాలు విసిరేది. ఉద్య మాల ఖిల్లా ఖమ్మం జిల్లాలో గీత కార్మికుని ఇంట్లో పుట్టి పేదరికం రుచి చూసిన నాగన్న విప్లవోద్యమం వైపు మళ్లటానికి ఎన్నో కారణాలు. పెత్తందార్లు , భూస్వాములు , రజాకార్ల దోపిడీ దగ్గరగా చూసిన కామ్రేడ్ నాగన్న పేద ప్రజ కోసం సమ సమాజం కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాడు. ఆ పోరాటాలు విప్లవ ఉద్యమం ద్వారానే సాధ్యమని నమ్మి విప్లవబాట పట్టాడు.

పోరాటాలకు పుట్టుక ఇల్లుగా ఉన్న తెలంగాణకు పాట నూతన ఉత్తేజం తెచ్చేది, అటు ఉద్యమం ఎందుకు అవసరమో వివరిస్తూనే ప్రతి మనిషిలోనూ, వారి మెదడులో విప్లవం అనే మొక్కను నాటేది పాట.అలాంటి పాటకు నాలుగు దశాబ్దాల పాటు ప్రాణం పోశాడు నాగన్న. ఆయన పాట వింటే కాటికి కాలు జాపిక వారు కూడా ఎగిరి గంతు వేసేవారు అంటే అతిశయోక్తి కాదు, అటువంటి స్వరం నాగన్నది, ఆయన పాడుతుంటే అమ్మ లాలా పాట అర్ధమైనట్లు వివరంగా సగర్వంగా ఉండేది. ఆయన గజ్జె కట్టి పాట పాడి పాలక నియంతృత్వ ధోరణలని ప్రజలకు చెపుతూ, వివరిస్తూ తెలంగాణలో ఎన్నో ప్రజా ఉద్యమాలకు ఊపిరూదాడు, నిర్మించాడు. ఆయన కాళ్ల దగ్గరకు ఎన్ని పదవులొచ్చినా గడ్డిపోసల విసిరేసి తన జీవితం ప్రజలు కు, ప్రజా పోరాటాలకు అంకితం అని చెపుతూ ఉండేవాడు. నక్సల్‌బరి ఉద్యమాలు , గోదావరి లోయ పోరాటాలకు ఆయన పాట నాయకత్వం వహించి ముందుకు కదిలేలా చేసింది. ఇప్పుడున్న తెలంగాణ గాయకులకు నాగన్న ఆదర్శంగా నిలిచి వారిలో ఉద్యమ స్ఫూర్తి నింపాడు. తెలంగాణ సంస్కృతికి ఒక నాయకుడిగా, ఒక సేనానిగా ఆయన నిలిచి తెలంగాణ గొంతుకుగా నిలిచారు …

తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాట మాట ఎందరో యువకులను కదిలించింది. ఉద్యమం వైపు నడిపించింది. ఆయన స్ఫూర్తితోనే మలి దశ ఉద్యమంలో తెలంగాణలో ఎందరో యువతీ యువకులు పోరుబాట ఎంచుకుని ప్రత్యేక రాష్టం సాధించుకున్నారు. రూపాయి ఇస్తేనే పాట పాడే ఈ రోజులో నాలుగు దశాబ్దాలపాటు నిర్విరామంగా ఒక పూట పస్తులుంటూ పాట పాడుతూ విప్లవోద్యమాన్ని బతికించాడు
నింగిలో నెలవంకలా నూటికో కోటికో ఒక్కరు పుడతారు. ఒక్కరు జీవిస్తారు నాగన్నలా … విప్లవ భావాలు, విప్లవ ఉద్యమం అనేది తెలంగాణ తల్లి బిడ్డలు. ఈ నేలపై పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకు ఆ భావాలు ఉంటాయి.
అలాంటి ఉద్యమాలను భావాలను ప్రాణంగా ప్రేమిస్తూ , ఆరాధిస్తూ తన ప్రాణం కంటే ఎక్కువగా వాటిని అనుసరిస్తూ త్యాగాల నిచ్చెనేసిన నాగన్నకు ఈ నెల ఏమిచ్చీ రుణం తీసుకుంటుంది? తెలంగాణ నేల ఉన్నంత కాలం నాగన్న చిరస్థాయిగా బతికే ఉంటాడు, అమరుడై ప్రతి ఒక్కరి గుండెల్లో గూడు కట్టుకొని జీవిస్తాడు.
నాగన్న..నువ్వు ఎత్తిన ఎర్రజెండా విడవం మేము..
నువ్వు చూపిన సమ సమాజం మార్గాన్ని మరువం మేము …

అమరుడా అందుకో..
మా తెలంగాణ ప్రజల విప్లవ జేజేలు…
జోహార్…లాల్ సలామ్‌.
(03 జూలై 2026, అరుణోదయ నాగన్న మృతికి సంతాపంగా)
– బిచ్చాల అన్వేష్ , 9666917596

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -