Tuesday, September 1, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‘‘నిటి ఆయోగ్‌’’ నివేదికలో విద్యావైఫల్యాల బండారం!

‘‘నిటి ఆయోగ్‌’’ నివేదికలో విద్యావైఫల్యాల బండారం!

- Advertisement -

ప్రపంచంలో అతిపెద్ద విద్యావ్యవస్థ మనది. దాదాపుగా 25 కోట్ల మంది విద్యార్థులు 14.71 లక్షల విద్యాలయాలలో 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలన్నీ కలిపి 10,92,671 ఉన్నట్లుగా గణాంకాలు తెలుపుతున్నాయి. కానీ 65 శాతం మంది విద్యార్థులు ఇంకా ప్రైవేటు విద్యా వ్యవస్థనే నమ్ముకున్నారు. ఇదంతా పార్లమెంటరీ కమిటీ నివేదికలో పేర్కొన్న వాస్తవాలు. 73 శాతం విద్యార్థులు ఉన్నత విద్యా స్థాయికి చేరుకోకముందే డ్రాపౌట్లుగా మిగిలిపోతున్నారు. శారీరక వైకల్యం కల విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు మృగ్యం. అంటే కేటాయింపులన్నీ కాగితాలకే పరిమితం కానీ క్షేత్రస్థాయిలో వినియోగం జరగడం లేదు. పర్యవసానంగా కోట్లాదిమంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు. కనీస ఆర్థిక స్థోమత గలవారు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారంటే వారికి ప్రభుత్వ విద్యా వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లుతున్నదనే భావించాలి. 2005లో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ 71 శాతం ఉండగా 2024-25 నాటికి అది 49.24 శాతానికి పడిపోయింది. రెండు దశాబ్దాల కాలంలో ప్రభుత్వ విద్యావ్యవస్థలో అడ్మిషన్లు తగ్గిపోవడం అంటే అదే స్థాయిలో ప్రైవేట్ పాఠశాలలకు తల్లిదండ్రులు ఓటు వేసినట్లే. ప్రభుత్వ బడుల్లో సౌకర్యాల లేమి, కంప్యూటర్ శిక్షణ లేకపోవడం, ఫలితాలు, ప్రమాణాలు అడ్మిషన్లను ప్రభావితం చేశాయని చెప్పవచ్చు. భవనాలు, టాయిలెట్స్, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు ప్రభుత్వ విద్యాసంస్థల్లో లేవనే అభిప్రాయం తల్లిదండ్రుల్లో బలంగా నాటుకుపోయింది. సెకండరీ విద్య అందించే వాటిలో ప్రైవేటు స్కూళ్ల భాగం 44 శాతానికి పైగా ఉంది. దేశంలో లక్షకు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి.

చదువుకు ఉపాధికి మధ్య అంతరం
ఇక ఈ మే మాసంలో నిటి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక మరింత విస్తుపోయే అంశాలను పేర్కొన్నది. ఒకపక్క దేశంలో ఉపాధి కల్పనను పెంపొందించామని, నూతన విద్యా విధానం ద్వారా విద్యార్థులను స్వయం ఉపాధి దిశగా తయారు చేస్తున్నామని కేంద్రం చేసుకున్న ప్రచారం అంతా డొల్ల అని సదరు నివేదిక నిరూపిస్తున్నది. 15 నుంచి 29 ఏండ్ల మధ్యనున్న యువకులలో 8.7 కోట్ల మంది అటు విద్యకు, ఉపాధికి, శిక్షణకు అందకుండా ఉన్నారని చెప్పడం బాధాకరం. వీరు కాక మరో రెండు కోట్ల మంది యువత కూడా ఏ ఉద్యోగం చేయడం లేదని నివేదిక తెలుపుతున్నది. వారిని నీట్ (నాట్ ఇన్ ఎడ్యుకేషన్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్) కేటగిరీలో చేర్చారు.దేశంలో కేవలం 8.25 శాతం మంది పట్టభద్రులు మాత్రమే తమ డిగ్రీలకు తగిన ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పడం కూడా శోచనీయం. అంటే తొంభై శాతం మంది పైగా తాము చదివిన చదువుకు, చేస్తున్న పనికి సంబంధం లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు. మన చదువులు ఏ రకమైన ఉపాధిని, ఉద్యోగాలను కల్పించలేకపోతున్నాయని ఇది నిరూపిస్తున్నది. నైపుణ్యాలు కల్పించడంలో ప్రస్తుత విద్యా విధానం విఫలమైనట్లు స్పష్టమవుతున్నది.

డిగ్రీలు పెరుగుతున్నా నైపుణ్యాలు తగ్గుముఖం
దేశంలో ఇంకా రెండు కోట్ల మంది విద్యార్థినీ విద్యార్థులు వృత్తి విద్యా కోర్సులు కాకుండా బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సాంప్రదాయ కోర్సులనే అధ్యయనం చేస్తున్నారని నివేదిక తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత కోసం విద్యార్థులు ఈ డిగ్రీలు ఎంచుకుంటున్నారు. 2024 నవంబర్ నుంచి 2025 జూలై మధ్య కేవలం 55 వేల ఉద్యోగాల కోసం ఏకంగా 1.86 కోట్ల దరఖాస్తులు రావడం ఈ దుస్థితికి అద్దం పడుతున్నది. కానీ, వారికి వృత్తిపరంగా నైపుణ్యం నేర్పేవి కావు. వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో ఉన్న పాఠశాలలు కేవలం 12లో ఒకటి మాత్రమే. అంటే వందకు ఎనిమిది పాఠశాలల్లో మాత్రమే వృత్తి విద్య అందుబాటులో ఉంది. ఇంటర్మీడియట్ లేదా ప్లస్ టు స్థాయిలో కూడా వృత్తి విద్యా కోర్సులు చాలా తక్కువ సంస్థల్లోనే ఉన్నాయి. పర్యవసానంగా విద్యార్థి నైపుణ్యాలు నేర్చుకోకుండా కేవలం పుస్తక పరిజ్ఞానంతోనే చదువు పూర్తి చేస్తున్నాడు. తన స్వశక్తితో ఉపాధి కల్పించుకోలేని పరిస్థితిలో సమాజానికి భారం అవుతున్నాడు. ఈ రకంగా కొన్ని కోట్ల మంది వృత్తిపరమైన నైపుణ్యాలు నేర్చుకోకుండానే చదువు పూర్తి చేస్తున్నారు. కళాశాల పై స్థాయిలో ఈ కోర్సులు దాదాపుగా అందుబాటులో లేవనే చెప్పవచ్చు.

నూతన్య విద్యావిధానం వైఫల్యం
అంటే నూతన విద్యా విధానం నైపుణ్యాలు కల్పించడంలో విఫలమైనదని మనం బలంగా విశ్వసించవచ్చు. దేశం వ్యవసాయ ఆధారితం. దానికి కావలసిన కోర్సులు కానీ, పరిశ్రమలకు అవసరమైన విద్యార్థులను మన విద్య అందించలేకపోతున్నది. అందుకే వ్యవసాయం నానాటికి తీసికట్టు అవుతుండగా పరిశ్రమల్లో విదేశీ సాంకేతికత, మానవ వనరుల పాత్ర రోజురోజుకూ ఎక్కువవుతున్నది. ప్రస్తుత కోర్సుల స్థానంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రత్యేక కోర్సులను తీసుకురావాలని నిటి ఆయోగ్‌ సూచించింది. బీఏ హాస్పిటాలిటీ, బీకాం ఎనలిటిక్స్, బీఎస్సీ అప్లైడ్ టెక్నాలజీ వంటి కోర్సులను తేవాలని పేర్కొంది. చదువుతో పాటు పని అనుభవం వచ్చేలా అప్రెంటిస్‌షిప్ ఆధారిత డిగ్రీలను పెంచాలని తెలిపింది. మహిళల్లో నైపుణ్యాలు పెంచడానికి సాయంత్రం, వారాంతం, పార్ట్‌టైం, హైబ్రిడ్, మాడ్యులర్ కోర్సులను విస్తరించాలని సూచించింది.

సార్వజనీన విద్యే లక్ష్యం కావాలి
అసలు విద్య ప్రైవేటీకరణ కాకుండా తీసుకోవలసిన చర్యల గురించి నీతి ఆయోగ్ ఏమి పేర్కొనలేదు. బడుగు బలహీన వర్గాల వారు విద్యకు దూరం కావడం గురించి ఈ నివేదిక చర్చించకపోవడం దారుణం. ఇక బాలికల విషయంలో అది మరింత దారుణంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలను బాగుపరిచి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయవలసిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నాయి. అంత కేటాయించాం, ఇంత ఖర్చు పెడుతున్నామన్న ప్రకటనలే కానీ క్షేత్రస్థాయిలో అవి అబద్ధాలుగా తేలిపోయాయి. విద్య మనిషి జీవితాన్ని సమూలంగా మార్చివేసే ఆయుధం. దాన్ని అన్ని వర్గాల వారికి వైద్యంతో పాటుగా ఉచితంగా ఇవ్వాలన్న మౌలిక సూత్రాన్ని అన్ని ప్రభుత్వాలు విస్మరించడం శోచనీయం. ప్రైవేటీకరణ మూలంగా విద్య ఖరీదు అయిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంస్థలను మూసివేయడం లేదా సమీప పాఠశాలలో విలీనం చేయడం ద్వారా పేద వర్గాలకు విద్య మరింత దూరమైంది. మన ప్రభుత్వాలు క్రమంగా ప్రభుత్వ విద్యను సామాన్యుడికి అందకుండా చేస్తున్నాయి. పార్లమెంటు కమిటీలు, అసర్, నిటి ఆయోగ్ నివేదికలు సిఫార్సులు చేస్తూనే ఉన్నాయి. కానీ, అవి సంపూర్ణంగా అమలుకు నోచుకోవడం లేదు.

నిటి ఆయోగ్ ఒక విఫల సంస్థ
ఆరవ తరగతి నుంచే నైపుణ్యాలు నేర్పాలని, వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టాలని, చదవడం, రాయడం, గణితంపై దృష్టి సారిం చాలని, ఉపాధ్యాయులను శిక్షణ ద్వారా బలోపేతం చేయాలని, డ్రాపౌట్లు తగ్గించాలని, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని నివేదికలు సూచిస్తున్నాయి. 2015 జనవరి 1 నుంచి ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పరచబడిన నిటి ఆయోగ్‌కు నిధులు కేటాయించే అధికారం లేదు. ఇది కేవలం సలహాలు ఇచ్చే సంస్థ. అందుకే ఉపాధి, విద్యా విషయాలలో నిటి ఆయోగ్ ఒక విఫల సంస్థగా పేర్కొనవచ్చు. మొత్తంగా ఘనంగా ప్రకటించుకున్న నూతన విద్యా విధానం-2020 (ఎన్‌ఈపి) కూడా ప్రభుత్వ విద్యను మెరుగుపరచకపోగా మరింత నీరు కార్చిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కమిషన్ల సిఫార్సులు, కమిటీల నివేదికలు సంపూర్ణంగా అమలుకు నోచుకోలేదు. పాలకులు మారినప్పుడల్లా విధానాలు మారటం మన వ్యవస్థకు ఉన్న దుర్గుణం. విధానాలు కాదు ముఖ్యం. విద్య సార్వజనీనం కావాలి, గుణాత్మకం కావాలి. అది ఉపాధి కల్పించే దిశగా విద్యార్థిని తయారు చేయాలి. అప్పుడే విద్య పరిపూర్ణమైనట్లు, దేశం పరిపుష్టమైనట్లు భావించాలి.

శ్రీ శ్రీ కుమార్, 9440354092

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -