Tuesday, September 1, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమృత్యుముఖంలో పెట్టుబడిదారీ వ్యవస్థ

మృత్యుముఖంలో పెట్టుబడిదారీ వ్యవస్థ

- Advertisement -

ప్రస్తుతం పెట్టుబడిదారీ వ్యవస్థ బలహీన పడుతూ క్షీణిస్తున్న లక్షణాలు మనకి బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి లక్షణాలు వ్యక్తం కావడం అనేది మాత్రం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు ఇటువంటి లక్షణాలే 1914-1945 మధ్య కాలంలో కూడా కనిపించాయి. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ జబ్బుపడ్డ వ్యవస్థ అని లెనిన్‌ ‌చేసిన రోగ నిర్ధారణ సరైనదే అని అప్పుడే రుజువైంది. అప్పటికి, ఇప్పటికి తేడా అంతా వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిన ప్పుడు అది స్పందించిన తీరులోనే ఉంది.
అప్పుడు ఈ వ్యవస్థ ఒక పథకం ప్రకారం కాని, లేక అనివార్యం అయినందువలన కాని తనను తాను ‘‘సంస్కరించు కోవడానికి’’ సిద్ధపడింది. కనీసం మూడు ప్రత్యేక విధాలుగా ఈ సంస్కరణ జరిగింది. మొదటిది- రాజకీయంగా వలస విధానానికి తెర దించడం. విన్‌‌స్టన్‌ ‌చర్చిల్‌ ‌వంటి బూర్జువా నాయకులు అప్పుడు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. వలసల మీద పెత్తనాన్ని వదులుకున్నా, మూడవ ప్రపంచ దేశాల వనరుల మీద పెత్తనాన్ని వేరే పద్ధతుల ద్వారా చెలాయించడానికి పూనుకున్నారు. రెండవది- ప్రపంచం లోని ప్రధాన పెట్టుబడిదారీ దేశాలలో ఎన్నికల ప్రజా స్వామ్యాన్ని ఒక వ్యక్తి-ఒక ఓటు సూత్రం ప్రాతిపదికన అమలు చేయడం, మూడవది- నిరుద్యోగాన్ని తగ్గించి తద్వారా స్థూల డిమాండ్‌ను పెంచడానికి వీలుగా రాజ్యం జోక్యం చేసుకోవడం. యూరప్‌లో ఈ చర్యల వలన భారీగా సంక్షేమ ఖర్చు పెరిగింది. అదే అమెరికాలోనైతే భారీ సైనిక వ్యయం ద్వారా రాజ్యం జోక్యం చేసుకుంది. మొదటి రెండు చర్యల వలన పెట్టుబడిదారీ వ్యవస్థ కు ఎటువంటి సవాలైనా ఎదురైతే దానిని తట్టుకుని నిలబడడానికి మూడవ చర్య తోడ్పడింది. ఆ విధంగా ఇది ముఖ్యమైనది.

పెట్టుబడిదారీ వ్యవస్థ ‘‘మానవీయ’’మైనదని, ‘‘ప్రజాస్వామ్య యుత’’మైనదని, దాదాపు పూర్తి స్థాయిలో ఉపాధి కల్పన చేయగలుగుతుందని ఆ విధంగా అది సోషలిజం కన్నా ఉన్నతమైనదని చెప్పుకుని తన ఉనికికి ఎదురైన సవాలుని తట్టుకుని సంక్షోభాన్ని అధిగమించగలిగింది. తన కొత్త రూపాన్ని చూపి ప్రపంచాన్ని చాలా బలంగా నమ్మించగలిగింది కూడా. మరోవైపు మూడవ ప్రపంచ దేశాలలోని వివిధ అధినేతలను హత్యలు గావించడం, మరికొన్ని దేశాల్లో కుట్రల ద్వారా ప్రభుత్వాలను కూలదోసి తన తొత్తులను గద్దెనెక్కించడం వంటివి కొనసాగిస్తూనేవచ్చింది. మొస్సాదెహ్‌ ‌నుంచి ఆర్బెంజ్‌ ‌వరకు, లుముంబా నుండి అలెండీ వరకు జరిగినవి మాత్రమే కాదు, కొరియాలో, వియత్నాంలో అది సాగించిన దురాగతాల గురించి వేరే చెప్పనక్కర్లేదు.
తన ఉనికికి సంక్షోభం నుంచి ఎదురైన సవాలును తట్టుకోడానికి అది ప్రారంభించిన పెట్టుబడిదారీ దశను ‘‘పెట్టుబడి దారీ విధానపు స్వర్ణయుగం’’ అని పిలుస్తారు. అంతకు మునుపటి పరిస్థితితో పోల్చితే ఇది సాపేక్షంగా కొత్తది, విభిన్న మైనది. అప్పటికి, ఇప్పటికి తేడా ఏమంటే అప్పటి మాదిరిగా మార్కెట్లో డిమాండ్‌ ‌ను పెంచడం కోసం ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఇప్పుడు ఇంకెంత మాత్రమూ సాధ్యం కాదు. ఇప్పుడు డిమాండ్‌ ‌ను పెంచడానికి వీలుగా ప్రభుత్వ వ్యయం పెంచాలంటే అందుకు ద్రవ్యలోటును పెంచడం కాని, లేదా ధనవంతుల మీద పన్నులను పెంచడం కాని చేయాలి. కార్మికవర్గం మీద పన్నులు పెంచడం వలన డిమాండ్‌ ‌పెరుగుదల ఉండదు. వారి ఆదాయాలను కార్మికులు ఎటుతిరిగీ ఖర్చు చేసేస్తారు. పన్నులను వారిమీద అదనంగా వేస్తే అప్పుడు ఆ ఖర్చు తగ్గిపోయి డిమాండ్‌ ‌తగ్గిపోతుంది. అప్పుడు ప్రభుత్వానికి వచ్చిన పన్ను రాబడిని ఖర్చు చేసినా మొత్తంగా చూసినప్పుడు డిమాండ్‌ ‌పెరుగుదల ఏమీ ఉండదు. దానిని పక్కన పెడితే మిగిలినవి రెండు- ద్రవ్యలోటును పెంచడం లేదా ధనవంతుల మీద పన్ను పెంచడం. ఈ రెండు చర్యలనీ ద్రవ్య పెట్టుబడి అంగీకరించదు (ఎందుకంటే అత్యంత సంపన్నుల దగ్గరే ద్రవ్య పెట్టుబడి ఎక్కువగా పోగుబడి వుంటుంది). పైగా ఇప్పుడు ద్రవ్య పెట్టుబడి అంతర్జాతీయ స్వభావాన్ని సంతరించుకుంది. కానీ, రాజ్యాలు ఇంకా జాతి రాజ్యాలుగానే కొనసాగుతున్నాయి. పెట్టుబడి దేశం నుండి పలాయనం చిత్తగించకుండా ఉండాలంటే అప్పుడు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది.
అందుచేత ఇప్పుడు నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థ ఆర్థిక మాంద్యం రూపంలో ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి ఉపశమనం పొందే దారి ఏదీ లేదు. ఆదాయాల్లో విపరీతంగా పెరిగిపోయిన అసమానతలే ఈ మాంద్యానికి దారి తీశాయి. దాంతో నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థ ముందు దారి మూసుకుపోయింది. వ్యవస్థ ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయిన ప్పటికీ, దానిని అధిగమించడానికి అది ఏమీ చేయలేని స్థితిలో ఉంది. ఇన్నాళ్లూ పెట్టుబడిదారీ వ్యవస్థ తనను గురించి తాను చిత్రించిన రూపానికి పూర్తి విరుద్ధమైన లక్షణాలను మనం ఇప్పుడు చూస్తున్నాం.

అన్నింటికన్నా ముందు ప్రజాస్వామ్యం మీద వాస్తవమైన దాడి జరుగుతోంది. పెట్టుబడిదారీ ప్రపంచం మొత్తంగా ఇప్పుడు పచ్చి నయా ఫాసిస్టు ప్రభుత్వాలైనా నడుస్తున్నాయి, లేదా ప్రజాస్వామ్యం ముసుగులో నిరంకుశ ప్రభుత్వాలైనా నడుస్తున్నాయి. అన్ని చోట్లా ప్రభుత్వ విధానాల మీద ప్రజాగ్రహం పెరుగుతోంది. దానిని వ్యక్తం చేసినవారిమీద మెకార్థీయిస్టు పద్ధతుల్లో వేధింపులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక పెట్టుబడిదారీ దేశాల్లో పాలస్తీనా మీద ఇజ్రాయిల్‌ ‌సాగిస్తున్న జాతి హననం పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొంది. కాని ఆ దేశాల ప్రభుత్వాలు మాత్రం ఇజ్రాయిల్‌ ‌కి మద్దతుగా వ్యవహరిస్తున్నాయి (ఒక్క స్పెయిన్‌ ‌మాత్రమే మినహాయింపు). అంతేగాక, పాలస్తీనా మద్దతు దారులకు అనుకూలంగా ప్రజలు చేపట్టిన కార్యక్రమాలను తీవ్రంగా అణచి వేస్తున్నాయి. తన దేశం ఎటువంటి అసమ్మతినైనా అనుమతిస్తుందని గర్వంగా చెప్పుకునే బ్రిటన్‌ ఇప్పుడు పాలస్తీనాకు అనుకూలంగా ప్రసంగించిన విద్యార్థులను ‘‘ఉగ్రవాదులు’’ అంటూ వారిపై కేసులు పెట్టి విచారిస్తోంది. అలా కేసులను ఎదుర్కొంటున్న వారిలో మెజారిటీ మీద ఇంతవరకూ ఛార్జిషీట్లు కూడా దాఖలు చేయలేదు. ఇటువంటి పరిస్థితే తక్కిన సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో కూడా ఉంది. జర్మనీ వంటి దేశాల్లో పాలస్తీనాకు సంఘీభావంగా కార్యక్రమాలు చేయడాన్ని నిషేధించారు. జాతి హననాన్ని సైతం బలపరచడమే కాకుండా, రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో ముందెన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ మానవ హక్కులను పరిరక్షిస్తుందని చెప్పుకుంటూ వచ్చినదంతా బూటకం అని తేలిపోయింది.
నయా ఉదారవాద శకంలో పెరిగిన ఈ నిరంకుశ అణచివేత విధానాలకు తోడు ఇప్పుడు అమెరికా మూడవ ప్రపంచ దేశాలను తిరిగి తన వలసలుగా మార్చుకోడానికి పూనుకుంటోంది. డొనాల్డ్‌ ‌ట్రంప్‌ ఈ ఎజెండాను తన ప్రసంగాల్లో వ్యక్తీకరించడమే కాక, వెనిజులా లోకి చొరబడడం, ఇరాన్‌ ‌మీద సైనిక దాడులను కొనసాగించడం, గ్రీన్‌‌లాండ్‌ ‌మీద, తక్కిన దేశాల మీద దాడులకు పథకాలను రచించడం ద్వారా ఆచరణలోకి సైతం దిగిపోయాడు. ఈ ప్రయత్నంలో అమెరికా తక్కిన సంపన్న పెట్టుబడిదారీ దేశాల మద్దతును కోరుతోంది. ఆ విధంగా తాను స్వేచ్ఛకు మద్దతునిచ్చే వ్యవస్థనని యుద్ధానంతర కాలంలో చెప్పుకున్నదానికి పూర్తి విరుద్ధంగా ఇప్పుడు సామ్రాజ్యవాదం వ్యవహరిస్తోంది.

వలస వాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు ముందుకు తెచ్చిన వాదనల ప్రభావం ఇంకా యూరప్‌లోని పెట్టుబడిదారీ దేశాల్లో ఏమైనా మిగిలి వుందేమోనననే అనుమానం అమెరికాకు ఉంది. అందుచేత ఇటీవల మ్యూనిచ్‌లో జరిగిన భద్రతా సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రసంగిస్తూ ఐదు వందల సంవత్సరాల వలస విధానం గురించి చాలా గొప్పగా ప్రశంసించాడు. మళ్ళీ ఆనాటి పరిస్థితులకు మళ్ళాలని పిలుపునిచ్చాడు. ఎటువంటి జంకు గాని, సిగ్గూఎగ్గూ గాని లేకుండా అతడు మాట్లాడినదానిని బట్టి పరిశీలకులు అది మళ్ళీ వలస విధానాన్ని అమలు చేయడానికి ఇచ్చిన పిలుపు అని నిర్ధారిస్తున్నారు. వలస పాలకులుగా ఉండిన యూరోపియన్‌ ‌దేశాలు తమ గతాన్ని గురించి సిగ్గుపడవలసినది ఏమీ లేదని రూబియో మాట్లాడినప్పుడు ఆ సమావేశంలో ఉన్న యూరోపియన్‌ ‌ప్రభుత్వాల అధినేతలందరూ నిస్సిగ్గుగా కరతాళ ధ్వనులతో స్వాగతించారు.
ఫాసిజానికి, వలస విధానానికి చాలా దగ్గర సంబంధమే ఉంది. ఫాసిజం తలెత్తే నేపథ్యాలు వేరువేరుగా ఉండవచ్చు కాని సంక్షోభ సమయంలో గుత్త పెట్టుబడిదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించే ప్రత్యామ్నాయ చర్చలను లేవనెత్తగలిగేది ఫాసిజమే. ఫాసిజం అమలు చేసే హింసాత్మక పద్ధతులన్నీ మొదట వలస దేశాల్లోనే ప్రయోగించి చూశారు. యూరప్‌లో ఫాసిజాన్ని అమలు చేయడానికి ముందు…నమీబియాలో నామా, హెర్రెరో తెగల ప్రజల మీద…జర్మనీ అమానవీయంగా క్రూరత్వాన్ని ప్రయోగించింది. బెల్జియం రాజు లియోపాల్డ్‌ ‌కాంగోలో పది లక్షల మంది ప్రజానీకాన్ని ఊచకోత కోశాడు. మొత్తం ప్రజానీకంలో వాళ్లు మూడవ వంతు. ఈ నమూనాలే తర్వాత యూరప్‌లో ఫాసిజాన్ని ఆచరించడానికి ఉపయోగపడ్డాయి.
ప్రస్తుతం నయా ఫాసిజం విస్తరిస్తోంది. గత కాలపు వలసాధిపత్యాన్ని అది నెమరువేసుకుంటోంది. మళ్ళీ వలస పాలనకు పూనుకోవాలనే దాని ప్రయత్నాలు కానవస్తున్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ తన కోరలను బహిర్గతపరచడాన్ని మనం మళ్ళీ చూస్తున్నాం. యుద్ధానంతర కాలంలో వాటిని చాలావరకు దాచిపెట్టగలిగింది. కాని ఇప్పుడు అవి బహిర్గతమయ్యాయి. ‘‘సంక్షేమ రాజ్యం’’ అని, ‘‘పెట్టుబడిదారీ వ్యవస్థ స్వభావం మారిపోయింది’’ అని, ‘‘మానవీయ పెట్టుబడిదారీ వ్యవస్థ ’’ అని ఇంతకాలమూ కొనసాగిన ప్రచారపు బూటకం వెల్లడౌతోంది. దాని బరితెగించిన స్వభావం, అడ్డగోలు ప్రవర్తన- వాటితోబాటు దాని క్షీణత అన్నీ బైటపడుతున్నాయి. దాని ముందు దారి మూసుకుపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థ మృత్యు ముఖంలో ఉంది.
ఎంత దూకుడుగా వ్యవహరించినా, ఎంతగా అణచివేతలకు పూనుకున్నా అవేవీ పెట్టుబడిదారీ వ్యవస్థను కాపాడలేవు. ప్రజా స్వామ్యాన్ని అణగదొక్కినా, మళ్లీ వలసాధిపత్యానికి ప్రయత్నిం చినా చావుకు దగ్గర్లో ఉన్న పెట్టుబడిదారీ విధానాన్ని నయా ఫాసిజం కాపాడజాలదు. అమెరికా-ఇజ్రాయిల్‌ ఇరాన్‌ ‌మీద సాగిస్తున్న దాడుల పర్యవసానం ఈ వాస్తవాన్నే స్పష్టం చేస్తోంది.

(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ ‌పట్నాయక్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -