అక్షరాలతో ఆలోచనలు పోగేసుకుంటున్న ఆ యువ మనసులపై మతోన్మాదం విరుచుకుపడింది. జాతీయ గీతం పాడుతున్నా దాడులు ఆగలేదు. ఇంతకీ వాళ్ళు చేసిన నేరమేమిటి? పుస్తకాలు పట్టుకోవడమేనా వాళ్లు చేసిన పాపం. అహ్మదాబాద్ నగరంలోని సైలెంట్ పార్కులో ఇటీవల ప్రశాంతంగా పుస్తకాలు చదువుకుంటున్న స్టూడెంట్స్ అండ్ యూత్ కలెక్టివ్, గుజరాత్ రీడ్స్ ఎనీవే ప్రతినిధులపై విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ మూక దాడులకు తెగబడ్డాయి. ఇది కేవలం కొందరు విద్యార్థులపై జరిగిన దాడి కాదు.. చదువుకునే హక్కుపై, ఆలోచించే స్వేచ్ఛపై, భిన్న ఆలోచనలపై జరిగిన దాడి. బేస్బాల్ బ్యాట్లు, పెద్దకర్రలు, కాషాయ జెండాల్లో చుట్టిన ఇనుప రాడ్లతో విరుచుకుపడ్డాయి ఆ మూకలు. అంతటితో ఆగకుండా అక్కడున్న ముగ్గురు ముస్లిం విద్యా ర్థులను ప్రత్యేకంగా పక్కకు లాక్కెళ్లి ‘‘మీ బట్టలు విప్పి చూపించండి.. ’’ అంటూ చితకబాదారు. ‘‘మేం భారతీ యులమే’’ అని ఎంత మొరపెట్టు కున్నా వారు కనికరించ లేదు. చివరకు వారు తమ దేశభక్తిని నిరూపించుకునేందుకు జాతీయ గీతాన్ని ఆలపించారు. కానీ, కసాయి గుండెలు కరగలేదు. ఆ కఠిన హృదయాలకు ఆ గీతంలోని పవిత్రత గానీ, కళ్లలోని భయంగానీ కనపడలేదు.
ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలనే అక్షర దాహం ఆ యువకులది. అది వారికి భిన్న ఆలోచనలను పంచుకునే వేదిక. ఆ సాయంత్రం అహ్మదాబాద్ సైలెంట్ పార్కులో కనిపించిన దృశ్యం ఇదే. అక్కడ విద్యార్థులు, యువత కలిసి పుస్తకాలు చదువుకుంటున్నారు. వారి చేతుల్లో ఉన్నది కూడా నోబెల్ పురస్కారం పొందిన మలాలా జీవిత జ్ఞాపకం ‘ఐ యామ్ మలాలా’.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ నెత్తుటి అక్షరాలు.. రాజ్యాంగ శిల్పి బి.ఆర్. అంబేడ్కర్ సమతా భావాలు.. భారతదేశ తొలి ప్రధాని నెహ్రూ స్వప్నాలు.. నాజీల క్రూరత్వం మధ్య సైతం మానవత్వంపై ఆశను వదలని యాన్ ఫ్రాంక్ ‘ది డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్’.. ఆ గొప్ప పుస్తకాల పేజీలను తిరగేస్తూ ఒకరికొకరు ఆలోచనలు పంచుకుం టున్నారు. ఆ ఆలోచనలు సంఘర్షణే ఇప్పుడు మతోన్మాదాన్ని భయపెట్టింది. పుస్తకం ప్రశ్నించ డం నేర్పుతుంది. ప్రశ్నించే మనిషి మూఢ నమ్మకాలను, విద్వేషాన్ని, అసమానతను అంగీకరించదు. అందుకే ఆలోచ నలపై దాడి చేసే శక్తులు ముందుగా పుస్తకాన్నే లక్ష్యంగా చేసు కుంటాయి. అందుకే ప్రశాంతంగా చదువుకుంటున్న ఆ యువతపై ‘కాశ్మీర్ వ్యతిరేకులు’, ‘తీవ్రవాదులు’ అంటూ ముద్రలువేస్తూ దండెత్తారు. ‘జై శ్రీరామ్’ నినాదాన్ని సైతం బెదిరింపు ఆయుధంగా మార్చేశారు.
ఈ దారుణ దుశ్చర్య వెనుక స్పష్టమైన సంఘ్ పరివార్ కుట్ర కోణం దాగి ఉంది. భిన్నత్వాన్ని, సత్యాన్ని మోసే ఈ పుస్తకాలు వారి విద్వేష రాజ్యానికి ఏనాడూ మింగుడుపడవు. అందుకే పథకం ప్రకారమే దాడులకు తెగబడ్డారు. నోబెల్ పురస్కారం పొందిన మలాలాను ‘పాకి స్థానీ అమ్మాయి’ అంటూ ఎద్దేవా చేయడం. కానీ ఆమె నిలబడింది మత ఛాందసత్వానికి ఎదురొడ్డి. ఆ ఛాందసవాదాన్ని వ్యతిరేకించే స్వరం ముస్లిం అమ్మాయిది కావడం, ఆ పేరు వినపడటమే సంఘ్ మూకలలో కడుపుమంటను రేపింది. ఎన్నికల లాభాల కోసం బీజేపీ తరచూ అంబేడ్కర్ పేరును జపిస్తున్నప్పటికీ, సామాజిక న్యాయాన్ని కోరే అంబేడ్కర్ సిద్ధాంతాల పట్ల వారికి ఏనాడూ ఆత్మీయత లేదు. ఇక నెహ్రూ అంటే దాదాపు పన్నెండేండ్లుగా విష ప్రచారాన్ని నింపిన అధికార పీఠానికి, ఆయన పట్ల పెరిగిన అసూయ స్పష్టంగానే ఉంది. భగత్ సింగ్ నేర్పిన విప్లవం వారి హిందూత్వ ఎజెండాకు శత్రువు. అందుకే ఆలోచనలు వికసించే ఏ పుస్తకాన్నీ వాళ్లు భరించలేక పోతున్నారు.
నిన్నటిదాకా మనం ఏం తినాలో, ఏం తాగాలో, ఎలా ఉండాలో నిర్దేశించాలనుకున్న నిరంకుశత్వం.. ఇప్పుడు మనం ఏం చదవాలో, ఏం ఆలోచించాలో, ఎలాంటి భావాలను గుండెల్లో దాచుకోవాలో కూడా శాసించాలను కుంటోంది. పుస్తకం చదివే పిల్లలను కొట్టడం అంటే రేపటి సమాజాన్ని కొట్టడం. జాతీయ గీతం పాడుతున్నా ఆగని కర్ర దెబ్బలు.. ఈ దేశంలో మతోన్మాదానికి అండగా రాజకీయ, అధికార రక్షణ ఎంత ప్రమాదకర స్థాయికి చేరిందో చెప్పకనే చెబుతోంది. ఆ దాడుల్లో దెబ్బతిన్నది ఆ పిల్లల శరీరాలు మాత్రమే కాదు.. ఈ దేశ ప్రజాస్వామ్య ఆత్మ కూడా. రక్తం కారింది వారి శరీరాల నుంచే కాదు.. రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛా భావాల నుంచీ. పుస్తకాలు పట్టిన ప్రతి చేతికి అండగా నిలవాల్సిన సమాజం, ఆ చేతులపై విరిగిన కర్రలను చూస్తూ మౌనంగా ఉండకూడదు. ఆలోచించే హక్కును, చదివే స్వేచ్ఛను, రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటన స్వాతంత్ర్యాన్ని మతోన్మాద రాడ్లతో అణచివేయాలని చూస్తున్న ఈ ప్రమాదకర ధోరణిపై ఆలోచించే ప్రతి గుండె గళమెత్తుంది. స్పందించే ప్రతి అక్షరం తిరగబడుతుంది. జెన్ జీ ఉద్యమం దాన్ని నిరూపించింది.
భయమెందుకు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



