దశాబ్దాల పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోరాడి సాధించుకున్న పెన్షన్ హక్కును ఒక్క నిర్ణయంతో హరించి, వారి వృద్ధాప్య భద్రతను మార్కెట్ ఒడిదుడుకులకు అప్పగించిన రోజుగా సెప్టెంబర్ 1 ప్రభుత్వ ఉద్యోగుల చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. జీవితంలో అత్యంత విలువైన కాలాన్ని ప్రభుత్వ సేవకు అంకితం చేసిన ఉద్యోగికి, ఉద్యోగ విరమణ తర్వాత గౌరవంగా, ఆత్మగౌర వంతో జీవించే భరోసా కల్పించాల్సిన ప్రభుత్వమే ఆ బాధ్యత నుంచి తప్పుకోవడం ఎంతవరకు సమంజసం? ఉద్యోగంలో ఉన్నంతకాలం దేశానికి, ప్రజలకు సేవ చేసిన ఉద్యోగి తన మిగిలిన జీవితాన్ని మార్కెట్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి గడపాల్సిందేనా? అందుకే సెప్టెంబర్ 1 కేవలం క్యాలెండర్‌లోని మరో తేదీ కాదు.. ఉద్యోగి హక్కును, అతని భవిష్యత్తును, అతని కుటుంబ భద్రతను ప్రశ్నించే రోజు. పెన్షన్ హక్కు కోసం మరోసారి పోరాటానికి పిలుపునిచ్చే రోజు.
2004లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్/ఎన్‌పీఎస్) అమల్లోకి వచ్చినప్పుడు దేశంలో ఈ విధానంలో ఉన్న ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువ. కానీ ప్రతి ఏడాది ప్రభుత్వాలు కొత్త నియామకాలు చేపట్టడంతో సీపీఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఇదే విధానం కొనసాగింది. ప్రస్తుతం రాష్ట్రంలో సీపీఎస్/ఎన్‌పీఎస్ పరిధిలో ఉన్న ఉద్యోగుల సంఖ్య దాదాపు మూడు లక్షలకు చేరువైంది. ఇదే పరిస్థితి కొనసాగితే 2035 తర్వాత ప్రభుత్వ సర్వీసులో కొనసాగుతున్న ఉద్యోగుల్లో పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) పరిధిలో ఉన్న వారి సంఖ్య వందల్లోకి పడిపోయే ప్రమాదం ఉంది. అంటే ఇది కేవలం నేటి ఉద్యోగుల సమస్య కాదు. రేపటి తరాల ప్రభుత్వ ఉద్యోగుల సామాజిక భద్రతకు సంబంధించిన కీలకమైన సమస్య.
పెన్షన్ దానం కాదు.. ఉద్యోగి హక్కు
ప్రభుత్వ ఉద్యోగి తన యవ్వనాన్ని, శ్రమను, ప్రతిభను ప్రభుత్వ సేవకు అంకితం చేస్తాడు. ఉద్యోగ విరమణ అనంతరం గౌరవంగా జీవించడానికి ప్రభుత్వం అందించే పెన్షన్ అతనికి చేసే దానం కాదు. అది అతని దీర్ఘకాలిక సేవకు సంబం ధించిన సామాజిక భద్రత.ఓపీఎస్‌లో ఉద్యోగికి ఉద్యోగ విరమణ అనంతరం నిర్దిష్టమైన పెన్షన్ లభిస్తుంది. కానీ సీపీఎస్/ఎన్‌పీఎస్‌లో ఉద్యోగి భవిష్యత్తు మార్కెట్ పరిస్థితులు, పెట్టుబడుల రాబడి, ఫండ్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగి భద్రత ప్రభుత్వ బాధ్యత అయితే, ఉద్యోగ విరమణ తర్వాత అతని జీవిత భద్రత కూడా ప్రభుత్వ బాధ్యత కాదా? ఈ ప్రశ్నకు పాలకులు సమాధానం చెప్పాలి.
రాజకీయ పార్టీల వైఖరి
సీపీఎస్ విషయంలో దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల వైఖరిని కూడా ఉద్యోగులు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. 2004లో కేంద్ర ప్రభుత్వ కొత్త ఉద్యోగులకు ఎన్‌పీఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిం చాలనే ఉద్యోగుల డిమాండ్లు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్రంలో వివిధ ప్రభుత్వాల హయాంలో పెన్షన్ విధానంలో మార్పులపై చర్చలు, నిర్ణయాలు జరిగాయి. రాష్ట్రాలు తమ ఉద్యోగుల పెన్షన్ విధానంపై నిర్ణయాలు తీసుకునే సమయంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, రుణ పరిమితులు, భవిష్యత్ పెన్షన్ బాధ్యతలు వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఆర్థిక భారాన్ని పరిగణనలోకి తీసుకుంటూనే ఉద్యోగుల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ ఓపీఎస్‌ను తిరిగి అమలు చేశాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు పెన్షన్‌పై తమ విధానాన్ని స్పష్టంగా ప్రకటించడంతో పాటు, ఉద్యోగుల పెన్షన్ భద్రతను కాపాడుతూ ప్రభుత్వాలపై పడే దీర్ఘకాలిక ఆర్థిక భారాన్ని ఎలా నిర్వహిస్తాయో కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.
వామపక్ష ప్రభుత్వాలు చూపిన ప్రత్యామ్నాయం
త్రిపుర, పశ్చిమ బెంగాల్ వంటి వామపక్ష ప్రభుత్వాలు సీపీఎస్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరే కిస్తూ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాయి. అయితే త్రిపురలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీపీఎస్/ఎన్‌పీఎస్ విధానం అమల్లో కి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌తో పాటు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌లో మాత్రం ఓపీఎస్ కొనసాగు తోంది. దీనిని బట్టి స్పష్టమయ్యేది ఒక్కటే-పెన్షన్ విధానం కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదు.. అది రాజకీయ సంకల్పానికి సంబంధించిన అంశంకూడా.
తెలంగాణలో ఎందుకు అమలు చేయరు?
కాంగ్రెస్ పార్టీ దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత సీపీఎస్/ఎన్‌పీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేసింది. మరి తెలంగాణలో అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఓపీఎస్‌ను ఎందుకు అమలు చేయడం లేదు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యా యుల పాత్ర కీలకం. ఎన్నికల సమయంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని, పెన్షన్ సమస్యపై చర్యలు తీసుకుంటా మని హామీలు ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేసే విషయంలో మాత్రం నిశ్శబ్దం ఎందుకు? ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సాధ్యమైనది తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు? రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు దీనిపై స్పష్టమైన సమాధానం చెప్పాలి.
పెన్షన్ విషయంలో ఏపీ ప్రభుత్వం కూడా ఓపీఎస్, సీపీఎస్ మధ్య ప్రత్యామ్నాయ విధానాన్ని తీసుకువచ్చింది. అంటే సమస్యకు పరిష్కారం లేదని చెప్పడం సరైనది కాదు. కేంద్రం కూడా ఓపీఎస్ అమలు చేయాలని నిర్ణయించే రాష్ట్రాలకు, గతంలో ఉద్యోగుల నుంచి మినహాయించిన మొత్తాలకు సంబంధించిన నిధుల బదిలీ విషయంలో మార్గదర్శకాలు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రాలు తమ ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం కేవలం “ఆర్థిక భారం” అనే కారణంతో ఉద్యోగుల భవిష్యత్తును పక్కన పెట్టడం సమర్థనీయం కాదు.
2035 తర్వాత పరిస్థితి ఏమిటి?
నేడు సీపీఎస్ ఉద్యోగి తన జీతం నుంచి ప్రతి నెలా చెల్లిస్తున్న మొత్తాన్ని చూసి తన భవిష్యత్తును అంచనా వేయలేడు. మరోవైపు ఓపీఎస్ ఉద్యోగుల సంఖ్య ప్రతి ఏడాది తగ్గిపోతోంది. 2035 తర్వాత తెలంగాణ ప్రభుత్వ సర్వీసులో ఓపీఎస్ పరిధిలో మిగిలే ఉద్యోగుల సంఖ్య వందల్లోకి పడిపోతే, సీపీఎస్ ఉద్యోగులే దాదాపు మొత్తం ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థగా మారే ప్రమాదం ఉంది.అందుకే ఇది నేటి ఉద్యోగి సమస్య మాత్రమే కాదు.. రేపటి ఉద్యోగి సమస్య కూడా. నేడు తీసుకునే నిర్ణయమే భవిష్యత్ తరాల ఉద్యోగుల సామాజిక భద్రతను నిర్ణయిస్తుంది. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించే వరకు ఉద్యోగులకు పోరాటమే మార్గం కావాలి. రాబోయే సాధారణ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో దేశవ్యాప్తంగా సీపీఎస్ రద్దు అంశాన్ని చేర్చేలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి.ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న విద్యార్థుల ఉద్యమాల స్ఫూర్తితో సీపీఎస్ రద్దు కోసం ఉద్యమం మరింత ఉధృతం కావాలి. హామీ ఇచ్చి వేయి రోజులు దాటినా సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకోకుండా నాన్చివేత, నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రం లో ప్రశ్నించాలి. ఉద్యోగ సంఘాలతోపాటు, ప్రజా సంఘాలు సంఘ టితమై ఐక్యంగా పోరాడాలి. పెన్షన్ హక్కు పునరుద్ధరణ కోసం జరిగే పోరాటం నేటి ఉద్యోగుల కోసమే కాదు.. రేపటి తరాల సామాజిక భద్రత కోసం కూడా.
సెప్టెంబర్ 1ని నిరసన దినంగా మార్చాలి
ఉద్యోగుల పోరాటాల చరిత్రలో పెన్షన్ హక్కు సాధనకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ హక్కును కోల్పోయిన రోజును ఉద్యోగులు మరచిపో కూడదు. సెప్టెంబర్ 1న ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కొన్ని సూటి ప్రశ్నలు అడగాలి.
ఇతర రాష్ట్రాల్లో ఓపీఎస్ సాధ్యమైనప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు?
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఎప్పుడు అమలు చేస్తారు?
సీపీఎస్ ఉద్యోగుల భవిష్యత్తుకు ప్రభుత్వం ఎలాంటి భద్రత కల్పిస్తుంది?
ఉద్యోగుల నుంచి సంవత్సరాలుగా వసూలు చేసిన పెన్షన్ నిధుల విషయంలో ప్రభుత్వ విధానం ఏమిటి?
2035 తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల సామాజిక భద్రత ఎలా ఉంటుంది?
గుండవరం దేవి ప్రసాద్
9000633404
సెప్టెంబర్ 1: ఉద్యోగుల జీవితాల్లో చీకటి అధ్యాయం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



