Tuesday, September 1, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిబతుకులు మారని రజకులు

బతుకులు మారని రజకులు

- Advertisement -

తెలంగాణ ఏర్పడి పదమూడేండ్లు గడిచినా రజకుల బతుకుల్లో మాత్రం మార్పు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. రాష్ట్ర జనాభాలో 2.8 శాతం, బీసీ జనాభాలో సుమారు ఐదు శాతం ఉన్న ఈ వర్గంలో 75 శాతానికి పైగా ఇప్పటికీ సంప్రదాయ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వ సర్వేల్లో అత్యంత వెనుకబడిన వర్గంగా గుర్తించినప్పటికీ, బడ్జెట్‌ కేటాయింపులు, సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలు, సామాజిక భద్రతలో మాత్రం తగిన ప్రాధాన్యం దక్కడం లేదు. ఎన్నికల హామీలు అమలుకాకపోవడం, వృత్తి స్థలాలు కబ్జాలకు గురవడం, విద్యుత్‌ సబ్సిడీ బకాయిలు పేరుకుపోవడం ఈ వర్గం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు పది లక్షల మంది రజకులు ఉన్నారు. వీరిలో అత్యధికులు బట్టలు ఉతకడం, ఇస్త్రీ, డ్రైక్లీనింగ్‌, లాండ్రీ వంటి వృత్తులపైనే ఆధారపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శుభ, శుభకార్యాలు, గ్రామ దేవతల పండుగలు, బోనాలు, దేవాలయాలకు సున్నాలు వేయడం వంటి సంప్రదాయ సేవలను కూడా రజకులే నిర్వహిస్తున్నారు. అయితే గ్రామాల్లో వారికి గతంలో జీవనాధారంగా ఉన్న ఇనాం, మాన్య భూములు అన్యాక్రాంతం కావడం, చాకిరేవు, దోబీఘాట్‌ స్థలాలు కబ్జాలకు గురికావడం వారి ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వృత్తి గ్రామాల నుంచి పట్టణాలకు విస్తరిస్తున్నప్పటికీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడి, మౌలిక వసతులు లేక రజక వృత్తిదారులు పోటీని ఎదుర్కోలేకపోతున్నారు.

అమలుకు నోచని బీసీ డిక్లరేషన్‌
33 జిల్లాల్లో సుమారు 4,300 రజక సహకార సంఘాలుండగా, సుమారు 500 దోబీఘాట్లు, మెకనైజ్డ్‌ లాండ్రీలు, రెండు లక్షలకు పైగా ఇస్త్రీ షాపులు ఉన్నాయి. 74 వేల మందికి ఉచిత విద్యుత్‌ పథకం అమలవుతున్న ప్పటికీ గత మూడేండ్లకు సంబంధించిన సుమారు రూ.370 కోట్ల సబ్సిడీ బకాయిలు పేరుకుపోయాయి. దీంతో వృత్తిదారులపై రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఈ విద్యుత్‌ బిల్లుల భారం పడుతోంది. సబ్సిడీ బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. 2026-27లో రూ.3 లక్షల కోట్లకు పైగా రాష్ట్ర బడ్జెట్‌ ఉన్నప్పటికీ రజకుల సంక్షేమానికి కేవలం రూ.200 కోట్లు కేటాయించడం వారి జనాభా, వెనుకబాటుతనంతో పోలిస్తే సరిపోదు. మరోవైపు ఎన్నికల సందర్భంగా ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో ఆధునిక లాండ్రీల ఏర్పాటుకు రూ.10 లక్షలు, ప్రతి జిల్లాకు దోబీఘాట్ల ఆధునికీకరణకు రూ.10 కోట్లు అమలే కాలేదు. అలాగే లాండ్రీ షాపులకు స్థలాలు, వృత్తిదారులకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు, ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ, 42 శాతం బీసీ రిజర్వేషన్లు వంటి హామీలు ఇంకా పూర్తిస్థాయిలో అమలుకు నోచు కోలేదు. ఇక రజకులపై సామాజిక దాడులు, సాంఘిక బహిష్కరణలు, కుల వివక్ష, మహిళలు, బాలికలపై దాడులు కొనసాగుతుండటం మరింత ఆందోళనకరం. తెలంగాణలో కుల వివక్షను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం అవసరం. ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన 102, 9, 18, 19, 116, 178, 27, 343 జీవోలను అమలు చేయాలి. ప్రతి జిల్లాలో రజక సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేయాలి. సాంఘిక బహిష్కరణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.

బడ్జెట్‌ కేటాయింపులు సరే..నిధులేవి?
రజకుల పరిస్థితిలో మార్పు రావాలంటే కేవలం హామీలు, బడ్జెట్‌ ప్రకటనలు సరిపోవు. కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేసి, 2025-26, 2026-27 బడ్జెట్లలోని రూ.375 కోట్లను వినియోగించాలి. ఆధునిక మెకనైజ్డ్‌ దోబీఘాట్లు నిర్మించి, 141 మున్సిపాలిటీల్లో ఆధునిక సౌకర్యాలు కల్పించాలి. లాండ్రీ షాపులకు గ్రామ, మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో స్థలాలు కేటాయించాలి. కబ్జాకు గురైన దోబీఘాట్‌ స్థలాలను స్వాధీనం చేసుకుని రక్షణ గోడలు, ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసి రజక సొసైటీలకు పట్టాలివ్వాలి. కొత్త రజక సహకార సంఘాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చి, సభ్యులకు షేర్‌ సర్టిఫికెట్లు అందించాలి. వృత్తిదారులకు గీత, చేనేత కార్మికుల తరహాలో పెన్షన్‌ సౌకర్యం కల్పించాలి. పేద రజక కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లలో ప్రాధాన్యం ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల దుస్తుల శుభ్రతకు రజక వృత్తిదారులను నియమించడం ద్వారా వారికి స్థిరమైన ఉపాధి కల్పించాలి.

ప్రభుత్వ సంస్థల వృత్తి కాంట్రాక్టులను జీవో 102 ప్రకారం రజక సొసైటీలకే ఇవ్వాలి. రజకుల ఆత్మగౌరవ భవనానికి స్థలం కాపాడి, భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలి. వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయడం ద్వారా ఆమె పోరాట స్ఫూర్తికి తగిన గౌరవం ఇవ్వాలి. రజకుల సమస్యను ఒక కుల వృత్తి సమస్యగా కాకుండా ఉపాధి, సామాజిక భద్రత, ఆత్మగౌరవం, హక్కుల సమస్యగా ప్రభుత్వం చూడాలి. బడ్జెట్‌ కేటాయింపులు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా పర్యవేక్షణ ఉండాలి. వృత్తిని ఆధునీకరిం చడంతోపాటు రజక యువతకు శిక్షణ, ఆర్థిక సహాయం, మార్కెట్‌ సదుపాయాలు కల్పించాలి. మహిళా వృత్తిదారులకు ప్రత్యేక ఆర్థిక, సామాజిక భద్రతా కార్యక్రమాలు చేపట్టాలి. అప్పుడే రాష్ట్ర ప్రగతిలో రజకులకు కూడా సమాన భాగస్వామ్యం లభిస్తుంది.

పైళ్ల ఆశయ్య, 9490098052

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -