Sunday, July 5, 2026
E-PAPER
Homeకవర్ స్టోరీవయసు పై విజయం

వయసు పై విజయం

- Advertisement -

‘సూపర్‌ ఏజర్స్‌'(SuperAgers) అనేది ఒక ఆసక్తికరమైన శాస్త్రీయ పదం. సాధారణంగా వయసు పెరిగేకొద్దీ జ్ఞాపకశక్తి, శారీరక సామర్థ్యం తగ్గుతుంటాయి. కానీ, 80 ఏండేకల పైబడినప్పటికీ వారి మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి 50-60 ఏండ్ల వారి స్థాయిలో ఉంటే… అటువంటి వారిని శాస్త్రవేత్తలు ‘సూపర్‌ ఏజర్స్‌’ అని పిలుస్తారు. ‘వయసు కేవలం అంకె మాత్రమే’ అని నిరూపిస్తూ, మానసికంగా ఎప్పుడూ యవ్వనంగా ఉండే అద్భుతమైన వ్యక్తులే ఈ సూపర్‌ ఏజర్స్‌.

ఈ సూపర్‌ ఏజర్స్‌ తమ మెదడుకు ఎప్పుడూ పదును పెడుతూనే ఉంటారు. కేవలం తెలిసిన పనులు చేయడం కాకుండా, కొత్త భాషలు నేర్చుకోవడం, క్లిష్టమైన పజిల్స్‌ పూర్తి చేయడం లేదా కొత్త విషయాల గురించి చదవడం వంటి అలవాట్లు వీరికి ఉంటాయి. మెదడును చురుగ్గా ఉంచడం వల్ల న్యూరాన్ల మధ్య సంబంధాలు బలంగా ఉంటాయి. సూపర్‌ ఏజర్స్‌కు స్నేహితులు, కుటుంబ సభ్యులతో బలమైన సంబంధాలు ఉంటాయి. ఒంటరితనం మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వీరు తరచుగా ఇతరులతో గడపడం, చర్చలు చేయడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందుతారు.

వృద్ధాప్యం నెమ్మదిస్తుంది
నార్త్‌ వెస్టర్న్‌ యూనివర్సిటీ పరిశోధకులు చేస్తున్న ‘సూపర్‌ ఏజింగ్‌ స్టడీ’లో దీర్ఘాయుష్కులు చాలామందికి వయసు తొంభై దాటినా జ్ఞాపకశక్తి మాత్రం 50 ఏండ్ల వారితో సమానంగా ఉన్నట్లు గమనించారు. భౌతికంగానే కాక మానసికంగానూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు వద్ధాప్యం చాలా నెమ్మదిగా వస్తుందట. సాధారణంగా అరవైలూ డెబ్భైల్లో మొదలయ్యే మతిమరుపు లాంటి సమస్యలూ క్యాన్సర్‌, గుండెజబ్బుల్లాంటి రోగాలూ సూపర్‌ఏజర్స్‌లో ఓ పాతికేళ్లు ఆలస్యంగా మొదలవుతున్నాయి. అందుకే వాళ్లు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవిస్తున్నారట. వాళ్ల పిల్లలకు కూడా వయసుతో పాటు వచ్చే సమస్యలు తక్కువేనట.

అధ్యయనాలు ఏం చెబుతున్నాయి
శాకాహారం, మాంసాహారంలో చేపలూ ఎక్కువ తీసుకునేవారిలో వద్ధాప్య ఛాయలు చాలా నిదానంగా కన్పిస్తున్నాయి. ఒకినావా ప్రజలు ఒక్కొక్కరూ రోజుకు 300 గ్రాముల పైనే కూరగాయలూ, వారంలో మూడు రోజులు చేపలూ తింటారట. దాంతో షుగరు, క్యాన్సర్లు, గుండెజబ్బుల వంటి రోగాలు రావు. వారి రక్తంలో వద్ధాప్య చిహ్నాలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ చాలా తక్కువ. ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో చేసిన 35 అధ్యయనాలను క్రోడీకరించగా తేలిందేమిటంటే.. మనసులో ఏ అసంతప్తీ లేకుండా సంతోషంగా జీవితం గడిపేవారి ఆయుర్దాయం ఇతరులకన్నా 18శాతం ఎక్కువని. అలాగూ కంటినిండా నిద్ర పూర్ణాయుష్షుకు పరమౌషధమట. అరగంటకు మించకుండా పగటిపూట తీసే కునుకు దానికి బోనస్‌ అవుతుందట. రోజుకు 8-9 గంటలపాటు నిద్ర పోగలిగితే ఆయుష్షు 38 శాతం పెరుగుతుందనీ, మంచి నిద్ర ముసలితనాన్ని దరికి రానివ్వదని తేల్చారు పరిశోధకులు.

మెదడు సామర్ధ్యాన్ని పెంచే ఆటలతో…
కండరాల మాదిరిగానే మెదడుకు కూడా దాని పనితీరును కొనసాగించడానికి క్రమం తప్పకుండా ప్రేరణ అవసరం. మనసును ఉత్తేజపరచడం వలన ఆ సినాప్సెస్‌ చురుకుగా ఉంటాయి. అవి మానసిక సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి సహాయ పడతాయి. కొత్త నాడీ కనెక్షన్‌లను ఏర్పరచుకునే మెదడు సామర్థ్యాన్ని పెంచుతాయి. కార్యాచరణ రకం కూడా ముఖ్యం. కాబట్టి సవాలు చేసే ఆటలను ఎంచుకోవడం ఉత్తమం. క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌, సుడోకు, సాలిటైర్‌ వంటి ఆటలు వీటికి మంచి ఉదాహరణలు. ఆధునిక సాంకేతికత అభివద్ధి చెందుతున్న ఈ కాలంలో ఈ కార్యకలాపాలు చాలా అందుబాటులో ఉంటాయి. స్మార్ట్‌ ఫోన్‌, టాబ్లెట్‌ లేదా కంప్యూటర్‌ తప్ప మరేమీ అవసరం లేదు. మరికొన్ని ఆచరణాత్మక ఎంపికలలో వాయిద్యం వాయించడం, కుట్టుపని, పెయింటింగ్‌, మోడల్‌ విమానాలను నిర్మించడం, తోటపని ఉన్నాయి.

మూడు కోణాల్లో పనిచేయాలి
క్లుప్తంగా చెప్పాలంటే అలాంటి జీవనశైలికోసం ముఖ్యంగా మూడు కోణాల్లో పనిచేయాలి. దినచర్యలో ఆరోగ్యకరమైన అలవాట్లు ఉండాలి. శరీరానికి అవసరమైన పోషకాల్ని వ్యాయామాన్ని అందించాలి. మానసికంగా సంతోషంగా ఉండాలి. అలా ఉండగలిగితే ప్రతి ఒక్కరూ సూపర్‌ ఏజర్‌ కావచ్చట. తొంభై ఏండ్లు పైబడి ఆరోగ్యంగా జీవిస్తున్నవారిని ‘సూపర్‌ ఏజర్స్‌’ అంటున్నారు. ‘అమెరికన్‌ అసోసియేషన్‌ ఫర్‌ ద అడ్వాన్స్మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌’తో పాటు పలు యూనివర్సిటీలు వీరిపై ఎన్నో పరిశోధనలు చేస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఏం తేల్చాయంటే… ప్రియమైన వ్యక్తులతో గాఢమైన అనుబంధం ఆయుష్షును పెంచుతోందంటోంది. పదిహేనేండ్ల పాటు సూపర్‌ ఏజర్స్‌ అలవాట్లను నిశితంగా పరిశీలించిన ‘ద 90ప్లస్‌’ అనే అధ్యయనం ప్రకారం తోబుట్టువులు, స్నేహితులు, భాగస్వామి- ఎవరైనా సరే వారితో రోజూ కాసేపు ఆనందంగా గడిపేవారి ఆయుష్షు 50శాతం పెరుగుతుందట. రోజుకు పావుగంటైనా వ్యాయామం చేసేవారు అసలు చేయని వారికన్నా ఎక్కువ కాలం జీవిస్తారనీ, క్రమం తప్పకుండా ప్రతిరోజూ 45 నిమిషాలపాటు వ్యాయామం చేస్తే తిరుగులేని ఫలితం ఉంటుందని మరో పరిశోధన తేల్చింది.

కెలొరీలు తగ్గిస్తే…
బ్లూజోన్స్‌లో ఉండేవారు ప్రత్యేకంగా వ్యాయామం చేయకపోయినా వారి దినచర్యలో నడక ముఖ్యమైన భాగం. పొద్దున్నే లేచి ఓ అరగంట నడవకుండా వారు ఏ పనీ చేయరట. తిండి తగ్గించినా ఆయుష్షు పెరుగుతుందట. 10 నుంచి 30శాతం కెలొరీలను తగ్గించడం వల్ల జీవితకాలం బాగా పెరిగినట్లు గుర్తించారు. ఒకినావా ప్రజలు రోజుకు 1800-1900 కెలొరీల ఆహారం మాత్రమే తీసుకుంటున్నారనీ (ఇతర దేశాల్లో 2200- 3300 కెలొరీలు) అందుకే వాళ్లు సన్నగా ఉంటున్నారని (బీఎంఐ 18-22 మధ్య) నిపుణులు తేల్చారు. వ్యసనాలు చాలావరకు అకాల మరణాలకు కారణాలన్నది తెలిసిన విషయమే. బ్లూజోన్స్‌లో నివసించేవారిలో ఏ వ్యసనాలూ లేకపోవడం వల్ల ఆరోగ్యం నిలకడగా ఉండి ఆయుర్దాయాన్ని పెంచుతోంది.

మరిన్ని పరిశోధనలు
ముసలితనంతో వచ్చే రోగాలూ రొష్టులతో వందేండ్లు బతకడం మనిషికే కాదు, సమాజానికీ భారమే. అందుకే దీర్ఘాయుష్షుకు మార్గాలు కనిపెట్టి ఊరుకోవడం లేదు శాస్త్రవేత్తలు. బతికినంత కాలం ఆరోగ్యంగా బతికేలా చూడడానికీ పరిశోధనలు చేస్తున్నారు. పెరుగుతున్న ఆయుష్షు ఆస్పత్రుల చుట్టూ తిరగడానికి కాకుండా జీవితాన్ని ఆస్వాదించడానికి ఉపయోగపడాలన్నదే ఈ పరిశోధకుల ఆకాంక్ష. వద్ధాప్యంతో పాటు వచ్చే జబ్బుల్ని ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ వెళ్లాలంటే చాలా కాలం పడుతుంది. అలా కాకుండా మొత్తంగా వద్ధాప్యాన్నే కాస్త నెమ్మదిగా వచ్చేలా చూడాలన్నది శాస్త్రవేత్తల లక్ష్యం. అందుకే వారు జన్యువులను ఇంకా ఇంకా శోధిస్తూనే ఉన్నారు. అయితే మనిషి శరీరంలో ఉండే దాదాపు లక్ష జన్యువుల్లో ఒక్కో జన్యువు ఆనుపానుల్నీ పట్టుకుని ఈ పరిశోధనలన్నీ ఒక కొలిక్కి తేవటానికీ, ఆ ఫలితాలు అందుబాటులోకి రావటానికీ ఇంకెన్ని తరాలు పడుతుందో చెప్పలేం. అందుకని మందులో మరొకటో వచ్చేస్తాయని ఆశపడి ఎదురు చూస్తూ కూర్చోకుండా మన జాగ్రత్తలో మనం ఉండటమే మంచిది. జాగ్రత్త అంటే ఏమీ లేదు. ఆరోగ్య కరమైన జీవనశైలితో ప్రస్తుతానికి సెంచరీ కొట్టడం మీద దష్టి పెడితే చాలు. అప్పుడు పిల్లలకు ఆస్తులతో పాటు ఆయుష్షునీ వారసత్వంగా అందించవచ్చు. ఎందుకంటే.. దీర్ఘాయుష్కుల పిల్లలకూ వద్ధాప్యం ఆలస్యంగానే వస్తుందట మరి!

జన్యువులో మార్పులే కారణం
జీవనశైలి మార్చుకుని మంచి అలవాట్లతో ఆయుర్దాయాన్ని పెంచుకుంటాం సరే… అసలు మనిషి జీవితకాలం ఎంత… శరీరం ఎన్నేండ్లు మనగలుగుతుంది… అన్న సందేహాలు పరిశోధకులను ఎప్పటినుంచో వేధిస్తున్నాయి. దాంతో దీర్ఘాయుష్షుకు కారణమైన జన్యువులపై పరిశోధన ఊపందుకుంది. గూగుల్‌ లాంటి పలు టెక్‌ సంస్థలు ఇప్పుడు దీనిపై పెట్టుబడి పెడుతున్నాయి. ఇప్పటి వరకూ ఏం కనిపెట్టారంటే… దీర్ఘాయుష్షుకి కారణమైన జన్యువుని 1990వ దశకంలోనే కనిపెట్టారు. ఎఫ్‌ ఒఎక్స్‌ ఓ3ఎ (FOXO3a – – జన్యువు ద్వారా ఎన్కోడ్‌ చేయబడిన మానవ ప్రోటీన్‌) అనే జన్యువులో చోటు చేసుకుంటున్న మార్పులే వందేండ్లు నిండినవారి ఆయుష్షుకు కారణమని యూరప్‌లో జరిగిన పరిశోధనలు తేల్చాయి. ఆ తర్వాత పలుచోట్ల జరిగిన పరిశోధనలు దానిని నిర్ధారించినా, అదొక్కటే కాదనీ మరికొన్ని జన్యువులూ అందుకు కారణమవుతున్నాయనీ తెలిసింది.

ఐదు తేడాలు కన్పించాయి
ఇటీవల జరిగిన మరో పరిశోధన దీర్ఘాయుష్కుల జన్యువులను మొదటిసారి వివరంగా డీకోడ్‌ చేసి చూసింది. 105 ఏండ్లు దాటినా ఆ వద్ధుల్లో సాధారణంగా వద్ధాప్యంతో వచ్చే అనారోగ్యాలేవీ లేక పోవడానికి కారణం సిఓఎ1, ఎస్‌టికె17ఎ అనే రెండు జన్యువుల్లో జరిగిన మార్పులనీ, ఆ మార్పుల వల్ల డీఎన్‌ఏ మరమ్మతు జరుగుతోందనీ ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్‌ బొలోనా ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనలు తేల్చాయి. పలువురు శతాధిక వద్ధులనుంచీ, యువకులనుంచీ రక్తనమూనాలను తీసుకుని జన్యుపటాలను తయారుచేసి తేడాలను పరిశీలించగా వద్ధుల జన్యువుల్లో ఐదు తేడాలు కన్పించాయి. పైన చెప్పిన రెండు జన్యువులే ఆ తేడాలకు కారణమని తెలిసింది. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ డీఎన్‌ఏ దెబ్బతింటుంది. కణాల్లోనూ మరికొన్ని మార్పులు జరిగి, క్యాన్సర్‌లాంటి వ్యాధులు వస్తాయి. ఈ రెండు జన్యువుల చర్యలు వాటిని అడ్డుకుంటున్నాయని తేల్చారు. ఇలా ఒక్కో జన్యువుని విశ్లేషిస్తూ వెళ్తాం సరే, అసలు అవయవాలు ఎన్నేండ్లు మనగలుగుతాయో అదీ చూడాలనుకున్నారు కొందరు శాస్త్రవేత్తలు. ఆ దిశగా సాగిన చాలా పరిశోధనలు మనిషి శరీర అవయవాలు 120 ఏండ్ల వరకు మాత్రమే పనిచేస్తాయని చెప్పాయి. అయితే అదీ అందరిలో ఒకేలా ఉండదనీ, మనిషిని బట్టి మారుతుంటుందనీ తెలిసింది.

ఏకంగా ఐదు రెట్లు
తాజాగా రష్యా, సింగపూర్‌, అమెరికాలకు చెందిన పరిశోధకులు కంప్యూటర్‌ మోడల్‌ సహాయంతో వివిధ అంశాలను విశ్లేషించి మనిషి జీవితకాలం 150 ఏండ్లని తేల్చారు. 70 వేల మంది రక్త నమూనాలను పరీక్షించి సేకరించిన డేటా ఆధారంగా ఈ విషయాన్ని నిర్ధారించిన వారు బహుశా మరో మూడు శతాబ్దాల నాటికి ఇది సాధ్యం కావచ్చంటున్నారు. మౌంట్‌ డిజర్ట్‌ ఐలాండ్‌ బయోలాజికల్‌ లేబొరేటరీ ఆధ్వర్యంలో సాగిన మరో పరిశోధన మనిషి జీవిత కాలాన్ని ఏకంగా ఐదు రెట్లు పెంచొచ్చంటోంది. దీర్ఘాయుష్షుకు దోహదం చేసే సినర్జిస్టిక్‌ సెల్యులర్‌ పాత్‌ వేస్‌ని కనుక్కున్నామనీ, దీనివల్ల జీవిత కాలం 400-500 ఏండ్లు అవుతుందని ఆ పరిశోధకులు చెబుతున్నారు.

దీర్ఘాయుష్షుకు పర్యాయపదం జపాన్‌
1800లో ప్రపంచదేశాల్లో ప్రజల సగటు ఆయుర్దాయం 32 ఏండ్లు మాత్రమే ఉండేదట. 1950 నాటికి అది 48కి పెరిగింది. ఇప్పుడది దాదాపు డెబ్భై మూడేండ్లు. ఇక ముందు ఇది ఇంకా వేగంగా పెరుగుతుందని 2000లో పుట్టిన పిల్లల్లో సగం మంది నూరేండ్లపైనే జీవిస్తారనీ అంటున్నాయి అమెరికాలో జరుగుతున్న పరిశోధనలు. కొన్ని శతాబ్దాలుగా దీర్ఘాయుష్షుకు పర్యాయపదంలా ఉంటోంది జపాన్‌. అక్కడే కాదు, బ్లూజోన్స్‌ అన్నిట్లో నివసించేవారి జీవనవిధానం దాదాపు ఒకేలా ఉంటుంది. వయసుకి సంబంధించి జరుగుతున్న పరిశోధనలన్నిటికీ ప్రేరణ ఆ జీవనవిధానాలే. జీవితానికి ఒక ప్రయోజనం, పరమార్థం ఉండాలి. దాన్నే జపాన్‌ వాళ్లు ‘ఇకిగారు’ అంటారు. పొద్దున్నే ఉత్సాహంగా నిద్రలేవగలిగినంత కాలం జీవితానికి ప్రయోజనం ఉన్నట్లేనట. ‘పొట్టలో కాస్త ఖాళీ ఉంచు’ చిన్నప్పటి నుంచీ జపాను వాళ్లు పిల్లలకు చెప్పే మాట. అలా తక్కువ తినడం అలవాటై పోతుంది కాబట్టే వారిలో స్థూలకాయులు అరుదు. తక్కువ పరిమాణంలో ఎక్కువ రుచుల్ని ఇష్టపడతారు. పండ్లూ కూరగాయలూ కలిపి రోజూ కనీసం ఏడు రంగులు తినాలన్నది వారి నియమం.

ప్రపంచ సగటుకన్నా ఉప్పు తక్కువ తినేది ఇక్కడివారే. చెరకు పండించి రసం తాగుతారు కానీ చక్కెర వాడరు. జపాను భాషలో రిటైర్మెంట్‌ అన్న అర్థం వచ్చే పదమే లేదు. ఉద్యోగ జీవితం ముగియగానే మరో ఉద్యోగంలో చేరతారు. తమకు నచ్చిన పని ఎంచుకుంటారు. ఎనభై, తొంభై ఏండ్ల వారూ సాధ్యమైనంత కాలం పిల్లల మీద ఆధారపడకుండా జీవిస్తారు. సంఘజీవనాన్ని ఇష్టపడతారు. గ్రామాల్లో ప్రజలంతా అభిరుచులను బట్టి చిన్న చిన్న బృందాలుగా ఏర్పడతారు. నెల నెలా కొద్ది మొత్తం డబ్బు జమ చేసుకుని సంగీతం, నత్యం, ఆటల పోటీల్లాంటివి పెట్టుకుని ఆనందిస్తారు. ఒత్తిడి అసలు ఉండదు. బృందంలో ఎవరికైనా ఆర్థిక అవసరాలు ఉంటే ఆ డబ్బు వారికిస్తారు. ఇల్లు కట్టుకోవడమైనా, పొలంపని అయినా బృందం అంతా కలిసికట్టుగా సాయం చేసుకుంటారు. దాంతో అక్కడివారికి ఆర్థిక అభద్రత ఉండదు, రేపటి గురించి చింత ఉండదు. ప్రతి ఇంటికీ పెరటితోట ఉంటుంది. వారి ఆహారంలో మూడోవంతు ఆ పెరటితోటల నుంచే వస్తుంది. నూటపదేండ్ల వారు కూడా ఎండలో తోటపని చేస్తారు. చురుగ్గా ఉంటారు కానీ ఉరుకులు పరుగులు పెట్టరు. ఎక్కడికైనా నడిచి వెళ్లడానికే ఇష్టపడతారు. దారిలో కనిపించిన వారందరినీ నవ్వుతూ పలకరిస్తారు.

– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి,
8008 577 834

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -