‘నువు కులుకుతు తిరిగెద వెవరబ్బసొమ్మని రామచంద్రా’ అని తన ఆరాధ్య దైవమైన శ్రీరాముడిని ప్రశ్నించాడు రామదాసు అనే కంచర్ల గోపన్న, ఒకనాడు. ‘నా పేరిట గుడి కట్టి కొట్టుకుతిందురా’ అని సాక్షాత్తూ శ్రీరామచంద్రమూర్తి ఘోషించవలసిన పరిస్థితి ఇప్పుడు అయోధ్యలో. ‘వందేమాతరం’ అనేగీత చరణంతో భారతీయులు స్వాతంత్ర్య పోరాటం జరిపితే దానిలోని రెండు చరణాలు జాతీయ గీతంలా నిర్ణయించారు రాజ్యాంగ పెద్దలు. ఇప్పుడు ఆ రెండు చరణాలు కాదు, మరిన్ని తెచ్చిపెట్టి కొత్త వివాదాలకు కారణమవుతున్నది కేంద్రం. ‘దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్’ అంటూ ‘వెనక పడితే వెనకేనోయ్’ అని హెచ్చరించారు గురజాడ. కాగా ‘పదండి ముందుకు’ అన్న శ్రీశ్రీకి ప్యారడీలాగా పదండి వెనక్కు అన్నవారికే గురజాడ అవార్డు కట్టబెట్టారు వరుసగా రెండు మూడుసార్లు. ‘తీగలను తెంచి అగ్నిలో వైచినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని దాశరథి పాడితే ఒక నాయకుడు ఆయన పార్టీ కేవలం రెండో భాగమే తీసుకుని పైన తీగలను తెంచిన నిజాంను కీర్తిస్తుంటుంది. ‘మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము’ అని ఎన్టీఆర్ వర్ణాశ్రమ ధర్మాలను ఆక్షేపిస్తే ఆ సనాతన ధర్మమే శరణ్యమని బీజేపీని అనుసరిస్తున్నది మరో పార్టీ. చేతిలో దీపం లేదు చుట్టూ చీకటి’ అంటూ శేషేంద్రశర్మ కవితతో రాజకీయ యాత్ర ప్రారంభించిన నాయకుడు సనా తనమే దీపమంటూ ఆయన కోరుకున్న సామ్యవాద భావధార విదేశీయమని తోసిపారేస్తున్నారు ఇప్పుడు. ‘ప్రశ్నిస్తూనే వుంటాం’ అని ప్రకంపనల స్థాయిలో ప్రకటించిన వారు ఇప్పుడు ప్రశ్న మహాపరాధమైనట్టు వేటాడుతున్నారు. మీడియా అరచేతిలోకి వచ్చేసిందని ఆర్భాటాలు చేసిన డోనాల్డ్ ట్రంప్ నుంచి నరేంద్ర మోడీ సర్కారు వరకూ సోషల్ మీడియా హద్దుమీరవద్దని హుంకరిస్తున్నారు. అక్షరాలకూ భావాలకూ గల శక్తి ఏమిటో, వాటిపై తిరోగాములకు ఎంత భయమో చెప్పే ఉదాహరణలే ఇవన్నీ.
నిరసన గళాలు..నిషేదాలు
అప్పటి సాహిత్య వారసత్వంపైన ఇంత ఉలికిపాటు వ్యూహాలు వుంటే ఇప్పుడు ఏం జరుగుతుందో ఊహిం చడం పెద్ద కష్టమేమీ కాదు. ‘రచయిత మరణించాడు’ అని పెరుమాల్ మురుగన్ వంటి అవార్డు గ్రహీత ప్రకటించాల్సి రావడం ఈ దుర్భర పరిస్థితికి ఒక నిదర్శనం, ఘర్ వాపసీ అంటూ ఒకవైపున మతపరమైన దాడులు పెరుగుతుంటే రచయితలు అవార్డు వాపసీ అంటూ తమకు వచ్చిన అవార్డులను తిరస్కరించడం పెద్ద సంచలనమే అయింది. ద్రవ్య పెట్టుబడి విజృంభణతో కార్పొరేట్ ప్రయివేటీకరణ నమూనాలో ప్రతీదీ మార్కెటైజేషన్, మానిటైజేషన్ అంటూ లెక్కలు కడుతున్న వేళ ప్రజావరణాన్ని కుదించే ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి. కృత్రిమ మేథ అనే ఎఐ వచ్చాక సృజన రచన వంటివాటికి గతంలో వున్న ప్రాధాన్యత లేదని చెప్పడం పరిపాటి అయింది. కేంద్రం అనుసరిస్తున్న ఏకపక్ష భాషా విద్యా విధానాల వల్ల మాతృభాష అయిన తెలుగు వికాసానికి కూడా అవరోధాలు ఎదురవుతున్నాయి. ఇన్ని భాషా సాంస్కృతిక సామాజిక రాజకీయ సవాళ్ల మధ్యనా ప్రజాశ్రేయస్సు ప్రజాస్వామ్య వికాసం, ప్రజాసంస్కృతీ వికాసం కోరే కవులు, రచయితలు, విమర్శకులు, సాహిత్యాభిమానుల కృషి మరెన్నో రెట్లు పెరగాల్సిన ఆవశ్యకత పెరుగుతున్నది. ఇరాన్‌పై అమెరికా దాడి నుంచి ఇంధన పర్యావరణంపై వేటుదాకా.. సార్వత్రిక ఓటు హక్కు నుంచి భావ ప్రకటనా స్వేచ్ఛ దాకా దాడికి గురవుతున్న పరిస్థితుల్లో ప్రజాపక్ష రచయితల కలాలు గళాలు పదునెక్కాల్సిన అవసరం స్పష్టమవుతున్నది.
విశాల కోణంలో ముందుకు…
సవాళ్లు తీవ్రమైనప్పుడు సంఘర్షణా తీవ్రం కాకతప్పదు. కాలం లాగే సామాజిక, సాంస్కృతిక పోరాటం ముందుకే పోతుంది గాని వెనక్కు నడవదు. అవరోధాలనూ, అభివృద్ధి నిరోధక ధోరణులను, అవకాశ వాదాలను ఛేదిస్తూ ముందుకు సాగుతుంది. విశాల ప్రజాస్వామిక స్పృహ, ప్రజా జీవిత వైవిధ్య వాస్తవిక పార్శ్యాలు స్పశిస్తూ కార్యోన్ముఖం చేసే ఏ రచనైనా మంచిదే. సామాజిక న్యాయం, సమానతా కోణం, మాన వీయ పార్శ్యాలు, పోరాటశీలత, వైజ్ఞానిక సహ పెంచేదేదైనా మంచిదే. గతంలోని గొప్ప వారసత్వాన్ని స్వీకరిస్తూ వర్తమాన కర్తవ్యాలను సూచిస్తూ భవిష్యత్ దిశా నిర్దేశం చేసేదై వుండాలి. కొత్త తరాలను, స్వరాలను మరీ ముఖ్యంగా పీడిత బాధిత జనకోటి గొంతులను వినడం, వినిపించడం నేర్చుకోవాలి. భావంలోనే గాక రూపంలోనూ వైవిధ్యాన్ని తీసుకువస్తే పాఠకులూ వీక్షకులూ కావ్యకర్తలూ కూడా పెరుగుతారు. పుస్తక ప్రదర్శనలు, చిత్రాల ప్రదర్శనలు, కవితాపఠనం సాహిత్య చర్చ, విద్యాలయాల్లో సాహిత్య సభలు వంటివన్నీ ఈ దిశలో జరిగే ప్రయత్నాలే. పాటను కూడా కలుపుకోవాలి. సోషల్ మీడియా వల్ల వచ్చిన అవకాశాలను కూడా సాహిత్య వేదికవడం చూస్తున్నాం, ఎఐ కూడా ప్రాథమికంగా ప్రాంప్ట్ ఇవ్వవలసింది మనుషులే. సరైన దిశలో సాధ్యమైనవన్నీ విస్తార ప్రజానీకంలోకి తీసుకువెళ్లే వేదికలుగా మలుచు కోవాలి. పరిమితులు ఛేదించుకుంటూ. ప్రతి బంధకాలపై పోరాడాలి. సంకుచిత ధోరణులను వ్యర్థ వివాదాలను తోసిపుచ్చుతూ, రచయితల ప్రతిభ పదును పెంచుకుంటూ దృష్టికోణాన్ని వేదికలనూ కూడా విశాల పర్చుకోవాలి. ఇటీవలి దశాబ్ది తెలంగాణ సాహితి ఉత్సవాల్లోనూ అంతకుముందు కూడా జరిగిన ప్రయత్నాలు ఇలాంటి కృషికి దోహదపడుతున్నాయి. దేశవ్యాపితంగా కూడా ఇలాంటి ప్రయత్నాలు పెరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లోనూ ఈ తరహా చర్చలు సమాలో చనలు వేగం పుంజుకున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఉపన్యాసాలు పరిమితంగానూ చర్చ అనుభవాల కలబోత అధికంగానూ ఉంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ప్రత్యేకంగా కొత్తతరం కవులు రచయితలు సాహిత్యా భిమానులు పాలుపంచుకోవడం జరుగుతుంది.
ఇప్పుడు కార్పొరేట్ మతతత్వ దాడి తాకిడి, అంతర్జాతీయంగా ఆధిపత్య శక్తుల దాడి తీవ్రమైన పరిస్థితిలో ఈ కృషి మరింత ప్రత్యేకత సంతరించుకుంటున్నది. పాలకుల అసహనం, అప్రజాస్వామిక శాసనాలు, విమర్శను సహించలేని లక్షణం భావ ప్రకటనా స్వేచ్చకు ఆటంకాలుగా మారడమే గాక రచయితలు, వ్యాఖ్యాతలు, మీడియా గొంతులను నొక్కేసే ప్రయత్నాలు నిత్యకత్యమైనాయి. మీడియా, సోషల్ మీడియా, పుస్తకాలు, సినిమాలు ఎక్కడ ఏ కాస్త విమర్శ, ఆక్షేపణ వినిపించినా ఉలిక్కిపడు తున్నారు. మరోవంక కీలక స్థానాల్లో వున్న నాయకులే బూతులు తిట్టుకుంటూ ఒకరినొకరు దూషించుకుంటూ వాతావరణం కలుషితం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సహనం, సంయమనం, సదవగాహన సాంస్కృతిక విలువలు నేర్పేందుకు సాహిత్యం వేదిక కాగలదు. అందులోనూ లాభాల దాహం లేని ప్రజాసాహిత్యం ఈ జాడ్యాలకూ కొరడాలకు విరుగుడుగా పనిచేయగలదు. సాహిత్యం ఎప్పుడూ సమాజపు సొత్తు తప్ప ప్రయివేటు ఆస్తి కాదు. ఇప్పటి వరకూ తెలుగు సాహిత్యంలో వాణిజ్య పోకడలు ఉన్నా ప్రజాస్వామ్య లౌకిక విలువలదే పెద్దపీటగా వుంది. ఇప్పుడిప్పుడే యువతను సనాతనవాద ప్రచారంతో రెచ్చగొట్టేందుకు ప్రభుత్వ వనరులు గుమ్మరించి ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలైనాయి. ఆ విధమైన రచయితలనూ రచనలనూ కావాలని ప్రోత్సహిస్తూ పెద్ద ఆకర్షణలుగా చిత్రించడం కనిపిస్తుంది. ఇది గతంలో లేని బెడద. అప్పట్లో వాణిజ్య నవలల వంటివి మాత్రమే వుంటే ఇప్పుడు ఏకంగా చాందసం చొరబడుతున్నది. ప్రగతిశీల ఉద్యమాలకు పెట్టింది పేరైన తెలుగునాట ఈ ధోరణిని సుతరామూ ఆదరించదు. కానీ రకరకాల ముసుగులతో వారిని జొప్పించడం విస్మరించరాని విషయం. ప్రవచనాల పేరిట కాలం చెల్లిన మనుధర్మ, మతధర్మ శాస్త్రాలు వల్లె వేయడమే గాక వారిని తెచ్చి యువతకు బోధనలు చేసే సలహాదారులగా నియమించడం ఎలాంటి ఫలితాలకు దారితీస్తుంది? అర్థవంతమైన చైతన్య స్పోరకమైన సాహిత్యంతో కళారూపాలతోనే ఇలాటి వాటికి సమాధానం సులభసాధ్యం.
చైతన్యమే విరుగుడు
జీవితపు వడికి, ఒడిదుడుకులకు పఠనమే తగ్గుముఖం పట్టిన స్థితిలో సాహిత్యం గురించే చదివేవారు ఎందరుంటారనే అని సందేహాలు రావడం సహజం. వేమన నుంచి నాజర్, గద్దర్ వరకూ శక్తివంతమైన ఏ గీతానికైనా జన బాహుళ్యం ఉర్రూతలూగడం ఆగలేదు. వీధినాటికల ప్రేక్షకులూ తగ్గలేదు. ఏ తెలుగు పత్రికా సాహిత్య పరిమళాలు లేకుండా, కవితా చరణాలు ఉపయోగించకుండా వెలువడ్డం లేదు. సభల్లో వక్తృత్వానికి సాహిత్యం అదనపు అర్హతగానే వుంటున్నది. ఆఖరుకు తిట్టుకునే నేతలు కూడా నాలుగు పద్యాలు, గేయాలు రాసుకొచ్చి చదువుతున్నారు. డైలాగులు జోడిస్తున్నారు. ఇంటర్నెట్ వెబ్‌సైట్‌లో సాహిత్య సందర్శకుల సంఖ్య గణనీయంగా వుంటున్నది. స్టాండప్ కమెడియన్లను పెనుభూతాలుగా చూస్తున్నారు. ఇవన్నీ సాహిత్య రూపాల శక్తిని చెబుతున్నాయి. ఈ క్రమంలో ఎఐ వంటివి కూడా సాహిత్య కారుల పదును పెంచేవే తప్ప ప్రతికూల మైనవి కాబోవు. పాతవారితో పోలిస్తే కొత్తతరాలకు అవి మరింత దగ్గరగా సులభంగా వుంటాయి కూడా.
ఊహించలేని స్థాయిలో ఇప్పుడు స్కూలు పిల్లలు కూడా పుస్తకాలు రాసి ప్రచురిస్తున్నారు, ప్రదర్శిస్తున్నారు. అవి పురోగామి దిశలో ఉండాలంటే తరాల మధ్య స్వరాల మధ్య చర్చ జరగాలి. వారికి నా ఆహ్వానం అని మహాకవి అన్నట్టు స్వాగతం పలకాలి. మీడియా సోషల్ మీడియాలను గుప్పిటపెట్టుకోవాలనే పాలకవర్గాలు, వాణిజ్య ధోరణులు గమనంలో పెట్టుకుని ఆరోగ్యకరమైన అవసరమైన అంశాలను ఎంచుకోవడం కూడా పెద్ద సవాలే. ఎందుకంటే టీవీలలో, రేటింగులలో సోషల్‌మీడియాలో లైకులు, సబ్‌స్క్రైబర్లు, ఆదాయం వంటి అంశాలు పక్కదోవ పట్టిస్తాయి, అవి రావడానికి అనేక చిట్కాలు వాడుతుంటారనే సత్యం అందరికీ తెలియదు. గనక చూసిందంతా నిజమనుకునే ప్రమాదం వుంటుంది. ఈ పరిస్థితుల్లో ప్రజల తరపున అక్షర సృజన చేయాలను కునేవారు, మీడియాను వినియోగించుకోవాలను కునేవారు వారికి అవసరమైన సమాచారం విషయంలో చాలా అప్రమత్తంగా వుండాలి. కీలకాంశాలు పక్కకు నెట్టి సంకుచిత వివాదాలతోనూ, దుర్భాషతోనూ వ్యక్తిగత ఎజెండాలతోనూ దారితప్పించే ధోరణులను పసిగట్టగలగాలి. విశాల ప్రజారాశులకూ ప్రజాస్వామ్య లౌకిక విలువలు మరీ ముఖ్యంగా దళితులు, మహిళలు, గిరిజనులు, మతపరమైన మైనార్టీలకు హానిచేసే శక్తుల పట్ల, నిర్ణయాల పట్ల తమ అవగాహనకు పదును పెట్టుకొంటూ ముందుకు సాగాలి.
తెలకపల్లి రవి
కాలం సవాలు…కదిలే గళాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



