ఈ రోజు మన దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవం. స్వాతంత్య్రం అంటే కేవలం విదేశీ పాలన నుంచి విముక్తి కాదు. ప్రతీ మనిషికీ గౌరవప్రదమైన జీవితం కల్పించే విధంగా సామాజిక, ఆర్థిక వ్యవస్థను నిర్మించటమే నిజమైన స్వాతంత్య్రం. కానీ, 79సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ మనం అలాంటి వ్యవస్థను నిర్మించుకోలేక పోయాం. మన రాజ్యాంగం ప్రజలం దరికీ ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం అందిస్తామని హామీ ఇచ్చింది. కానీ, అవేవీ నెరవేరలేదు. స్వాతంత్య్రపోరాట యోధులు ఆనాడు కలలుగన్న సౌభాగ్య భారతంగా మనదేశం లేదు. ఇప్పటికీ తొలగని పేదరికం, అందరికీ అందని విద్యా, వైద్యం, రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తులు, పట్టణ కార్మికులు సకల శ్రామిక వర్గాలూ నిరంతరం దోపిడీకి గురవుతున్న స్థితిని మనం చూస్తున్నాం. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉందని చెప్పుకుంటున్న మనదేశంలో వారికి తగిన ఉపాధి లభించటం లేదు. గొప్ప ప్రజాస్వామ్యంగా చెప్పుకుంటున్న మన దేశంలో ఎన్నికలు జరగటం, పార్టీలు, ప్రభుత్వాలు మారటం తప్ప మన బతుకులు మాత్రం మారటం లేదు. 193 దేశాలున్న ప్రపంచంలో మన దేశ అభివృద్ధి సూచిక 130వ స్థానంలో ఉందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఆర్థికంగా ఈ దుస్థితికి తోడు నేడు బీజేపీ పాలనలో మతోన్మాదం అనే మహమ్మారి అదనంగా చేరింది.
చైనా -ఇండియాల సారూప్యం
మన దేశ జనాభా చాలా ఎక్కువనీ, స్వాతంత్య్రం వచ్చేనాటికి మన ఆర్థిక వ్యవస్థ చాలా వెనకబడి ఉందనీ అందువల్ల అభివృద్ధి సాధించటం అంత తేలిక కాదనీ వాదించే వారున్నారు. కానీ అలాంటి వారికి మన పొరుగుదేశం చైనా సాధించిన అభివృద్ధి చూస్తే కనువిప్పు కలుగుతుంది. మనకు 1947లో స్వాతంత్యం వస్తే, చైనాలో మరో రెండేండ్లు ఆలస్యంగా 1949లో ఫ్యూడల్ పాలకుల నుంచి విముక్తి కలిగింది.
రెండు అభివృద్ధి మార్గాలు : ఈ విధంగా అన్ని అభివృద్ధి సూచికల్లోనూ చైనా మనకంటే ఎంతో ముందున్నది. మన కంటే జనాభా ఎక్కువైనా, మనకన్నా రెండేండ్ల తర్వాత విముక్తి జరిగినా చైనా ఇలాంటి అభివృద్ధిని ఎలా సాధించగలిగింది? ఒకప్పుడు దాదాపు సమానంగా ఉన్న రెండు ఆర్థిక వ్యవస్థల్లో ఈ రోజు భారత్ కంటే ఐదు రెట్లు పెద్ద ఆర్థికశక్తిగా చైనా ఎలా ఎదగగలిగింది? ఇందుకు ముఖ్యమైన కారణమేమంటే మనదేశం స్వాతంత్య్రం తర్వాత ‘పెట్టుబడిదారీ అభివృద్ధి’ పంథాను ఎంచుకున్నది. దీనికి భిన్నంగా చైనా పెట్టుబడిదారీ పద్ధతులను ఉపయో గించుకుంటూనే ‘సోషలిస్టు అభివృద్ధి’ పంథాను అనుసరించింది. అక్కడ అమలు చేసిన భూసంస్కరణలు, ప్రభుత్వ రంగంలో భారీ పరిశ్రమల స్థాపన, మౌలిక సదుపాయాల కల్పన, ప్రపంచీకరణను తనకనుకూలంగా మల్చుకున్న తీరు ఈ అసాధారణ అభివృద్ధిని సాధ్యం చేసాయి. నేడు శాస్త్ర, సాంకేతిక రంగాలలో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చైనా ఎదిగింది. చైనాలో ‘ప్రజల’ కేంద్రంగా అభివృద్ధి సాగితే, ఇండియాలో ‘పెట్టుబడి’ కేంద్రంగా అభివృద్ధి సాగింది. అంటే మనం సంపద పెరగటంపైనే దృష్టి సారించాము తప్ప ఆ సంపదలో ప్రజల వాటా గురించి పట్టించుకోలేదు. ఏ దేశమైనా అభివృద్ధిలో ఎక్కడ ఉన్నది చూడాలంటే జీడీపీ సంఖ్యలు చూస్తేనే సరిపోదు. తలసరి ఆదాయం చూస్తే వాస్తవానికి కాస్త దగ్గరగా ఉంటుంది. ఆ విధంగా చూస్తే ఇండియా కంటే చైనాలో తలసరి ఆదాయం ఐదు రెట్లు అధికంగా ఉంది. పేదరికమే లేని దేశంగా చైనా నేడు ప్రపంచం ముందు నిలిచిఉంది.
ప్రపంచ యుద్ధాలు- మనపై ప్రభావం
మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యాలో అంతర్యుద్దం ద్వారా సోషలిస్టు విప్లవం జయప్రదమైంది. దాని ప్రభావం అనేక దేశాలపైన పడింది. వామపక్ష ఉద్యమాలు, స్వాతంత్రోద్యమాలు ఉవ్వెత్తుగా సాగాయి. ఇండియాతో సహా అనేక దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడ్డాయి. రెండవ ప్రపంచయుద్ధం తర్వాత ప్రపంచ బలా,బలాల్లో మరింత మార్పు వచ్చింది. సోవియట్ యూనియన్ నాయకత్వంలో సామ్రాజ్యవాదానికి దీటుగా సోషలిస్టు శిబిరం ఏర్పడింది. కార్మికవర్గం పెద్ద యెత్తున కమ్యూనిస్టులవైపు ఆకర్షించబడ్డారు. అనేక దేశాలలో జాతీయ విముక్తి ఉద్యమాలలో కలిసి కమ్యూనిస్టులు పనిజేయటం ప్రారంభించారు. ఈ కొత్త పరిస్థితిని ఎదుర్కోవటానికి పెట్టుబడిదారీ విధానం కమ్యూనిస్టులను బలహీనం చేసే లక్ష్యంతో ముఖ్యమైన రెండు ఎత్తుగడలతో ముందుకు వచ్చింది. మొదటిది శ్రామికవర్గాలను కమ్యూనిస్టులకు దూరం చేసేందుకు ‘సంక్షేమ రాజ్యం’ మార్గాలను అనుసరించింది. దీని ఫలితంగా ప్రభుత్వఖర్చును పెంచి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం, కార్మిక చట్టాలు తెచ్చి అమలు చేయడం, వ్యవసాయం అభివృద్ధికి ‘పచ్చవిప్లవం’ పథకాల్లాంటివి అమలు జరపటం చేసారు.
రెండవది జాతీయ విముక్తి పోరాటాలు కమ్యూనిస్టుల వైపు ఆకర్షించబడకుండా అనేక దేశాల్లో వాటికి ‘స్వాతంత్య్రం’ ప్రసాదించటం. మనం సాధించుకున్న స్వాతంత్య్రంలో మన యోధుల పోరాట కృషి, ఉద్యమాలతోబాటు ఈ ప్రపంచ పరిస్థితులు కూడా కారణమయ్యాయి. పెట్టుబడిదారుల ఈ ఎత్తుగడలు బాగా పనిచేసాయి. కమ్యూనిస్టులు బలహీన పడ్డారు. ప్రపంచవ్యాపితంగా పెట్టుబడిదారీ విధానం వేగంగా అభివృద్ధి సాధించింది. ఈ అభివృద్ధి ఎంతగా సాగిందంటే ‘పెట్టుబడిదారీ విధానంలోనే ప్రజల సౌకర్యాలను, అభివృద్ధిని సాధించవచ్చు’ అనే భ్రమలకు అది దారి తీసింది. ఫలితంగా అనేక కమ్యూనిస్టు పార్టీలు సోషలిజం లక్ష్యాన్నే వదిలివేసాయి. అందుకే ఈ కాలాన్ని ‘పెట్టుబడిదారీ అభివృద్ధిలో స్వర్ణయుగం’ అంటున్నాం. జపాన్ ఆర్ధికవేత్త ‘పుకు యామా’ మానవ పరిణామంలో ఇక పెట్టుబడిదారీ విధానమే చివరిదనీ, చరిత్ర అంతమైపోయిందనే సూత్రీకరణలు చేసేంతగా మత్తులో మునిగి పోయారు. అయితే ఈ భ్రమలు ఎంతోకాలం నిలవలేదు.
ప్రపంచీకరణకు చివరి ఘడియలు
పెట్టుబడిదారీ విధానమే చివరిదిగా చరిత్ర అంతమైపోలేదు. దానికి భిన్నంగా సరళీకరణ విధానాలు, ప్రపంచీకరణ ప్రక్రియే అంతమయ్యే పరిస్థితి దాపురించింది. సోషలిస్టు శిబిరం, కమ్యూనిస్టులు బలహీనపడ్డాక ‘పెట్టుబడి దారీ విధానం తన మేకతోలును విప్పుకొని’ ఇపుడు తన నిజమైన దోపిడీ స్వభావాన్ని సంతరించుకొంది. 1990ల్లో సోవియట్ సోషలిస్టు శిబిరం విఛ్చిన్నమైంది. సామ్రాజ్యవాదం పైచేయి సాధించింది. అమెరికా నాయకత్వంలో ‘ఏకధృవ ప్రపంచం’ ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా 800కు పైగా అమెరికా సైనిక శిబిరాలు వివిధ దేశాల్లో ఏర్పడ్డాయి. ‘ప్రపంచ ద్రవ్యపెట్టుబడి’ ఏర్పడి దాని కనుసన్నల్లో అన్ని జాతీయ ప్రభుత్వాలు నడుచుకునే దైన్యస్థితి ఏర్పడింది. దీన్నే ప్రపంచీకరణ అంటున్నాం. అంటే ‘పెట్టుబడి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే స్వేచ్ఛ’, ‘తయారైన సరుకును ఎక్కడికైనా తరలించి అమ్ముకునే స్వేచ్ఛ’ ఏర్పడింది. వీటినే సరళీకరణ విధానాలంటున్నాం. ప్రపంచ రాజకీయాల్లో ‘అమెరికా చెప్పిందే వేదం’ అన్నరీతిలో వారి పెత్తనం సాగింది. ఈ కాలంలో ఏ దేశంలోనైనా అంతర్జాతీయ పెట్టుబడి స్థిరంగా ఉండాలంటే ఆ దేశ ప్రభుత్వాలు దాని (ప్రపంచ బ్యాంకు వగైరా) ఆదేశాలు పాటించాల్సిందే. దీని ప్రకారం ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలి. అంటే ఇక సంక్షేమ రాజ్యాలకు కాలం చెల్లిపోతుంది. కార్మికుల హక్కులు, చట్టాలు, రైతుల సబ్సిడీలు, వివిధ తరగతుల ప్రజలకు అమలు చేసిన ఆర్థిక చేయూత పథకాలు, పేదరిక నిర్మూలన పథకాలు వీటన్నింటినీ వదులుకోవాలి. ఇపుడు ప్రపంచ వ్యాప్తంగానూ, మన దేశంలోనూ జరుగుతున్నది ఇదే. ఈ విధానాల ఫలితంగా పేదరికం పెరుగుతోంది. ధరలు పెరుగుతాయి. నిరుద్యోగం పెరుగుతుంది. వ్యవసాయరంగం నాశనమౌతుంది. చిన్న పరిశ్రమలు దివాలా తీస్తాయి. అంతిమంగా ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయి అధికోత్పత్తి సంక్షోభానికి దారితీస్తుంది.
అనైక్యత సృష్టిస్తున్న మతోన్మాదం
ఈ పరిస్థితుల ఫలితంగా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెల్లుబుకుతుంది. సామాజిక అస్థిరత ఏర్పడుతుంది. ప్రజల తిరుగుబాట్లు ప్రారంభమై తాయి. ప్రపంచీకరణ అమలు కష్టమయ్యే పరిస్థితులు దాపురిస్తాయి. పెట్టుబడిదారీ వర్గం ‘ఈ ప్రమాదాలకు కనిపెట్టిన విరుగుడే మతోన్మాద ఉద్యమాలు’. ఆర్థిక కష్టాలకు వ్యతిరేకంగా ఏకమయ్యే ప్రజల్లో ‘అనైక్యత’ సృష్టించటానికి మతం, కులం, ప్రాంతం, జాతి ప్రాతిపదికగా ఉద్యమాలు ముందుకొస్తున్నాయి. ఇలాంటి ఉద్యమాలకు మన దేశంలో మతోన్మాద బీజేపీ నాయకత్వం వహిస్తోంది. అందుకే సరళీకరణ ఆర్థిక విధానాలకు, మతోన్మాదానికి మన దేశంలో ‘లంకె’ కుదిరింది. కార్పొరేట్ శక్తులు, మతోన్మాదులు ఒక్కటయ్యారు. దీని ఫలితంగానే మనం సాధించుకున్న స్వాతంత్య్రం ‘నేతిబీరకాయలో నెయ్యి’గా మారుతోంది. ఈ పరిణామాన్ని అడ్డుకోవాలి. కార్పొరేట్ శక్తుల దోపిడీకి వ్యతిరేకంగా ‘సోషలిస్టు భావజాలాన్ని, మతోన్మాదానికి వ్యతిరేకంగా సెక్యులర్ భావాలను ప్రజల్లోకి జొప్పించి రాజకీయ ఉద్యమాలు నిర్మించగలగాలి.
బీజేపీ కుట్రలు-మన కర్తవ్యం
తమ కార్పొరేట్‘మతోన్మాద ప్రాజెక్టుకు ఆటంకంగాబట్టే మన రాజ్యాంగంలో పొందుపర్చిన ‘సోషలిజం-సెక్యులరిజం’ పదాలను రాజ్యాంగంలో నుంచి తీసివేయాలని బీజేపీ పట్టుబడుతోంది. మన ప్రజలను బీజేపీ ఎక్కువ కాలం తన మతం మత్తులో ఉంచలేదు. అందుకు ఇటీవల జెన్ జీ ఉద్యమంగానీ, రైతాంగ ఉద్యమాలు గానీ, పౌరసత్వం సమస్యపై సాగిన ఉద్యమం గానీ ప్రత్యక్ష నిదర్శనలుగా ఉన్నాయి. ఈ ఉద్యమాలకు తక్షణ కారణాలుగా కొన్ని సమస్యలు ముందుకు రావచ్చు. కానీ అంతర్లీనంగా బీజేపీ పాలన పట్ల పెరుగుతున్న వ్యతిరేకతే అసలు కారణం. గత పదమూడేండ్లుగా మాటలు తప్ప చేతలు లేని ప్రభుత్వంగా బీజేపీ ప్రజల ముందు దోషిగా నిలబడి ఉంది. ఈ ఉద్యమాలన్నీ రాజకీయాలకతీతంగా జరిగినట్లు పైకి కనపడినా వీటిని బలపరుస్తూ కమ్యూనిస్టులు ముఖ్యపాత్ర వహించారు. ఇంకా చెప్పాలంటే కమ్యూనిస్టుల కంటేకూడా కమ్యూనిస్టుల ఎజెండా మరింత ముఖ్యమైన పాత్ర నిర్వహించింది. మత ప్రాతిపదికన ప్రజల్ని విభజించే కుట్రలకు వ్యతిరేకంగా పౌరసత్వం సమస్యలపై సెక్యులర్ ఉద్యమం సాగింది. రైతాంగానికి గిట్టుబాటు ధరలకు చట్టం చేయాలని, రైతాంగ వ్యతిరేక కార్పొరేట్ చట్టాల రద్దు చేయాలనే, వ్యవసాయరంగాన్ని సంస్కరించాలనే ఆర్థిక డిమాండ్లతో రైతాంగ ఉద్యమం సాగింది.
విద్యావ్యవస్థలో సాగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనీ, విద్యను ప్రజలందరికీ అందు బాటులోకి తేవాలనే ఎజెండాతో జెన్‌జీ ఉద్యమం సాగింది. భవిష్యత్తులో ‘అందరికీ విద్య, ఆరోగ్యం, నిరుద్యోగ భృతి’ లాంటి నినాదాలతో ఉద్యమాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల కమ్యూనిస్టులు బలహీనంగా ఉన్నా, కమ్యూనిస్టుల ఎజెండా బలహీనంగా లేదు. ఆ ఎజెండా చుట్టూనే ఉద్యమాలు అంకురిస్తున్నాయి. పార్టీలను మార్చటం, ప్రభుత్వాలను కూల్చటం వెనక సాగుతున్న బీజేపీ అవినీతి బాగోతం, గొప్పగా చెప్పిన రామమందిర నిర్మాణంలో జరిగిన ఆర్థిక కుంభకోణాలు ‘బీజేపీ అవినీతి రహిత పార్టీ’ అనే డాంబికాలతో యువతలో ఏర్పడిన భ్రమలు పటా పంచలవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇలాంటి ఉద్యమాలే మరిన్ని ముందుకు రాబోతున్నాయి. ఈ ఉద్యమాలు అలలు, అలలుగా పెరిగి రాజకీయ ప్రభంజనాలుగా మారటమే మనం సాధించుకున్న స్వాతంత్య్రాన్ని ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక న్యాయం అందించగలిగే ఏకైక మార్గం. అందుకు అవిశ్రాంతంగా ప్రయత్నించటమే ఈనాటి మన కర్తవ్యం.
తమ్మినేని వీరభద్రం



