Saturday, August 15, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిస్వేచ్ఛ కోసం

స్వేచ్ఛ కోసం

- Advertisement -

ఎక్కడైనా, ఎప్పుడైనా తిరుగుబాటు మీదటే స్వాతంత్ర్యం. ప్రాణ త్యాగాలతోనే స్వేచ్ఛ పొందగలిగామని చరిత్ర చెబుతున్న సత్యం. ఎందరో త్యాగధనులు జీవితాలను అర్పించి, పోరాటంలో బలిదానాలు చేసి సంపాదించినదే మన దేశ స్వాతంత్ర్యం. బ్రిటీష్‌ వారిని తరిమికొట్టిన ఆ సమరం, మనందరికి స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని అందించిందా! అనుభవించటానికి అవకాశమిస్తున్నదా! అంటే, అందుకోసం నిరంతరంగా పోరుసల్పవలసే వస్తున్నది. ఎనభై ఏండ్లలోకి అడుగిడుతున్న స్వాతంత్ర్య దినోత్సవ ప్రకటన ఆనంద ప్రతీకగా ఎగురవేస్తున్న త్రివర్ణ పతాక సాక్ష‍ిగా మరో మారు స్వేచ్ఛ కోసం ప్రతినబూనాల్సి వస్తున్నది. ‘క్విట్‌ ఇండియా’ పిలుపుతో నాడు ఉద్యమించిన సమరవీరుల స్ఫూర్తితో కార్మిక, కర్షక జనం హక్కులకై జైళ్ళకు తరలాల్సి వస్తూనే ఉన్నది. ఎన్నో ఆశలతో ఆకాంక్ష‍లతో సాధించుకున్న స్వరాజ్యాన సామాన్యుని జీవనం, ఇంకాదరిచేరని నావలాగే లాగబడుతున్నది. ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అటుంచి, దేశ సార్వభౌమత్వము, స్వతంత్రత కూడా కోల్పోతున్న ఛాయలు కనపడుతున్నాయి. నాడు ప్రత్యక్ష‍ంగా ఆంగ్లేయులు మనపై ఆధిపత్యం వహించి దోచుకుంటే, నేడు మన పాలకులు అమెరికా కనుసన్నలలో మెలుగు తూ ఏది చెబితే అది విని దాసోహమంటున్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పేరుతో అగ్ర రాజ్యానికి దేశ సంపదను దోచిపెడుతున్నారు.

సామ్రాజ్యవాద దురాక్రమణలకు వ్యతిరేకంగా నిలిచిన పోరాడిన స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తికి భిన్నంగా అమెరికా దౌర్జన్య యుద్ధానికి, దాని మిత్ర నియంత రాజ్యాలకు మద్దతు తెలపటం ఎంత దిగజారుడుతనం. ఎక్కడ మనం చమురు కొనాలో, ఎంత పన్ను కట్టాలో, ఏమి కొనాలో కూడా వాళ్లు చెబుతుంటే, జీ హుజూర్‌ అంటూ వింటున్నాం. తలలూపుతున్నాం. ఇంతకన్న బానిసత్వమేమున్నది! ఇదంతా స్వాతంత్ర్య సమరంలో ఏ సంబంధంలేని వారసత్వం సాగిస్తున్న పాలనలో జరుగుతున్నది. అంతేకాదు, స్వాతంత్ర్య పోరాటానికి వ్యతిరేకంగా నిలబడ్డ వాళ్ల వారసులు వెలగబెడుతున్న పాలన ఇది. మొన్న మొన్నటి వరకు వీళ్లకు త్రివర్ణ పతాకంపై నమ్మకం లేదు. ఎగరవేయనూలేదు. స్వతంత్ర రాజ్యాంగముపై కూడా విశ్వాసంలేదు. అట్లాంటి వాళ్లు దేశభక్తులమని చెబుతున్నారు. నిలదీసి, ప్రశ్నించి పోరాడి సాధించిన స్వాతంత్ర్య దేశాన, ప్రశ్నించడం నేరంగా దేశద్రోహంగా చూడబడుతున్నది. ఎన్ని నిర్బంధాలు, నిరంకుశత్వాలు ఎదురైనా ప్రశ్నించే స్వేచ్ఛను వదలుకోమని ఇటీవలి జెన్‌జీ ఉద్యమం నిరూపించింది. ఎనభై ఏండ్ల తర్వాత కూడా మన పిల్లలకు సరైన విద్యను ఇవ్వలేకపోయామన్న పరిశీలనే పాలకులకు లేకపోయింది. స్వాతంత్యం ఏమిచ్చిందిమనకు అంటే, భావితరాలకు చదువుకునే సరైన బడిని ఇవ్వలేకపోయింది.

చదివిన వాళ్లకు కొలువును ఇవ్వలేకపోతున్నది. విశ్వగురుత్వాన్ని నిర్వహిస్తున్నాననుకుంటున్న వారి పాలనలోనే 97 వేల పాఠశాలలు మూసివేసారు. వేలాది పాఠశాలలకు భవనాలే లేవు కానీ వేల కోట్లు ఖర్చు చేసి విగ్రహాలు పెడతారు. అందుకే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశానికి అన్నం పెడుతున్న రైతు ఇన్నేండ్లుగా అగచాట్లు పడుతూనే ఉన్నాడు. మరింత వారికి ఉరిబిగించే ప్రయత్నం చేస్తూనే ఉన్నది. ప్రభుత్వం నిత్యం చెమటను చిందించే కార్మికునికి కనీస భద్రత లేకుండా కొత్త చట్టాలను తెచ్చి మరింత అణచివేస్తున్నారు. వాళ్లు సృష్టించే సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారు. సమాజాన సగభాగంగా ఉన్న మహిళ వివక్ష‍ కొనసాగుతూనే ఉన్నది. దాడులు హింస మరింత పెరిగింది. ఆడవారిని బలహీనులుగా చూసే మనువాద ఆలోచనలు విస్తరిస్తున్నాయి. ఆదివాసీల సాంస్కృతిక జీవనాన్ని విధ్వంసమొనరించే చర్యలు ప్రభుత్వాలే చేపడుతున్నాయి. దళితులపై దాష్టీకాలు రోజురోజూకూ పెరుగుతున్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కులు హరించబడుతున్నాయి.

పత్రికా స్వేచ్ఛ పాతాళానికి పడిపోయింది. పార్లమెంటులో చర్చలు లేవు. సమాధానాలు రావు. జవాబుదారీతనం లేదు. పేదలు మరింత పేదలవుతున్నారు. రెండు పూటలా తిండి దొరకడం లేదు. ఆరోగ్య భద్రతలేదు. ఆవాసాలు లేవు. ధరలు పెరుగుతున్నాయి. ఆదాయం తరుగుతోంది. రూపాయి విలువ పడిపోయింది. ఇన్ని అనర్థాలనటుంచి మధ్యయుగాల ఆలోచనలతో దశాబ్దాల వెనక్కి జారిపోతాం. ఇదా మన వీరుల త్యాగఫలం! ఇన్ని బాధలు, ఇన్నిన్ని సవాళ్లు దేశం, ప్రజలు ఎదుర్కొంటుంటే, పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు మత విద్వేషా లను రెచ్చగొడుతున్నాయి. మనిషికీ మనిషికీ మధ్య మత గోడలు నిర్మిస్తున్నాయి. ఉన్మాదాన్ని ఉసిగొల్పుతున్నాయి. జనమిప్పుడు ఆలోచించాలి. మన అభివృద్ధికి మార్గమేమిటో, ఎలా ముందడుగేయాలో చైతన్యయుతంగా పరామర్శించుకోవాలి. ప్రశ్నను బలోపేతం చేయాలి. స్వేచ్ఛ కోసం, స్వాతంత్ర్యం కోసం నిరంతరం పోరాడాలి. అప్పుడే స్వాతంత్ర్య ఉత్సవానికి సార్థకత.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -