భారత స్వాతంత్ర్యోద్యమంలో లక్షలాది మంది పాల్గొన్నారు. గాంధీజీ స్ఫూర్తితో జాతీయోద్యమంలో మమేకమయ్యారు. దేశం నుండి బ్రిటిష్ వారిని తరికొట్టేందుకు జైళ్లకు సైతం వెళ్లారు. మరీ ముఖ్యంగా క్విట్ ఇండియా ఆందోళన సమయంలో మహిళలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. సంపూర్ణ స్వాతంత్ర్యం అనే నినాదం ఎంతో మందిని చైతన్య పరిచింది. బ్రిటిష్ వాళ్లను వ్యతిరేకిస్తూనే దేశంలో మహిళలు, దళితులు, పేదలపై కొనసాగుతున్న వివక్షను ప్రశ్నిస్తున్న కమ్యూనిస్టు సిద్ధాంతం వారిని ఆకర్షించింది. ఆ సమయంలో జరిగిన పోరాటాల్లో అత్యధిక సంఖ్యలో మహిళలు భాగస్వాములయ్యారు. గతంలో ఏనాడు ఇళ్ల నుండి బయటకు రాని స్ర్తీలు జాతీయోద్యమంలో పాలుపంచుకున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలకు సిద్ధపడ్డారు. ధైర్యంగా ముందడుగు వేశారు. ఈరోజు ఆగస్టు 15 సందర్భంగా ఆ విప్లవ వనితల్లో కొందరిని మననం చేసుకుందాం…
అహల్యా రంగ్నేకర్
అహల్య 1922న పూణేలో జన్మించారు. తండ్రి త్రయంబక్ రణదివె. తల్లిదండ్రులిద్దరూ ప్రగతిశీల భావాలు కలిగినవారు. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ నాయకులు గోపాల్ గణేష్ అగార్కర్, జ్యోతిబపూలే, డాక్టర్ డి.డి.కార్వె వంటి మహానుభావుల భావాలకు ప్రభావితమైన కుటుంబంలో అహల్య పెరిగారు. ఆ ఇంట్లో మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు కూడా అన్ని రకాల విద్యల్లో ప్రావీణ్యం సంపాదించారు. అలాంటి కుటుంబంలో పుట్టిన అహల్య విద్యార్థి దశలోనే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో కాలేజీలో చదువుతున్న అహల్య 20 మంది విద్యార్థులతో కలిసి మౌన ప్రదర్శన చేశారు. జైలుకు కూడా వెళ్లారు. జైల్లోనే మూడు రంగుల జెండా ఎగురవేసిన ధైర్యం ఆమెది. ఆరునెలలు జైలు శిక్ష అనుభవించారు. తర్వాత కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. విమల రణదివె, మాలతి సగార్కర్‌తో కలిసి ప్రగతిశీల మహిళా ఉద్యమానికి ఆయువు పోశారు. స్వాతంత్ర్యోద్యమంలో పని చేస్తూనే స్ర్తీల ప్రత్యేక సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్మించారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత కూడా వివక్షలేని సమాజం కోసం అహర్నిశలూ కృషి చేశారు.
కనక ముఖర్జి
నేటి బంగ్లాదేశ్‌లో ఉన్న బెంద అనే చిన్న గ్రామంలో కనక పాఠశాల విద్యనభ్యసిస్తూ దేశభక్తి రాజకీయాలని ఊపిరిగా పీలుస్తూ పెరిగారు. ఆమె తండ్రి సతీష్‌చంద్రదాస్ గుప్త. తల్లి నళినీదేవి. ఆ దంపతుల మూడో బిడ్డ కనక. తల్లి మరణించడంతో అమ్మమ్మ సౌదామినీదేవి దగ్గర పెరిగారు. ఆ రోజుల్లో చదువు విషయంలో పోరాటం చేసి మరీ కనక తన విద్యాభ్యాసం కొనసాగించారు. మాథ్యమిక పాఠశాలలో చదువుతున్నపుడు ఆమె జాతీయోద్యమాన భాగస్వాములయ్యారు. మిత్రులతో కలిసి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆ పార్టీలో ఉంటూనే ఆమె రహస్యంగా కమ్యూనిస్టు అధ్యయన తరగతుల్లో పాలుపంచుకునేవారు. గాంధీజీ నిరసనదీక్షలకు కూర్చున్నప్పుడల్లా వీరు కూడా ఆహారం తీసుకోకుండా ఆయనకు సంఘీభావం ప్రకటించేవారు. కాలేజీలో జరిగే స్వాతంత్ర్యోద్యమ కార్యక్రమాల్లో పాలుపంచుకునేవారు. ఆ రోజుల్లో విద్యార్థి ఉద్యమాల్లో అమ్మాయిలపై చూపుతున్న వివక్షను ఆమె ప్రశ్నించేవారు. 1939లో అమ్మాయిల కోసం ప్రత్యేకంగా సంఘాన్ని ఏర్పాటు చేశారు. దాంతో అమ్మాయిలు కూడా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనగలిగారు. కమ్యూనిస్టు ఉద్యమ కారులతో కలిసి దేశ స్వాతంత్ర్యోద్యమం కోసం జరిగిన అనేక పోరాటాల్లో కనక పాలుపంచుకున్నారు.
లక్ష్మీసెహగెల్
ప్రముఖ న్యాయవాది ఎస్.స్వామినాథన్, స్వాతంత్ర్య సమరయోధురాలు, సామాజిక కార్యకర్త ఎ.వి.అమ్ముకుట్టి దంపతులకు 1914, సెప్టెంబర్ 24న జన్మించారు. బాల్యం నుండి లక్ష్మికి పుస్తకపఠనమంటే ఆసక్తి. చిన్నతనంలో కేరళలో పెరిగారు. లక్ష్మి మామయ్య గాంధేయవాది. అప్పట్లో లక్ష్మి ఇల్లు స్వాతంత్ర్యోద్యమ భావాలకు నిలయంగా ఉండేది. తల్లితో కలిసి అనేక సమావేశాలకు వెళుతుండేవారు. కాలేజీలో చేరాక ఆమె జాతీయోద్యమంలో మరింత చురుగ్గా పాలుపంచుకున్నారు. దక్షిణ భారత దేశ సంస్కరణోద్యమాలతో కలగలిపి స్వాతంత్ర్యోద్యమం నడుస్తుండేది. డాక్టర్ కావాలన్నది లక్ష్మి సంకల్పం. 1932లో మెడికల్ కాలేజీలో చేరారు. 1931-32 కాలంలో భగత్‌సింగ్‌కు మద్దతుగా ఆమె విద్యార్ధుల సమావేశాల్ని ఏర్పాటు చేశారు. వైద్య కళాకాలలోనే ఆమెకు కమ్యూనిస్టు సిద్ధాంతం పరిచయమయింది. చదువు పూర్తి చేసిన తర్వాత సింగపూర్‌లో కొంత కాలం డాక్టర్‌గా పని చేశారు. తర్వాతి కాలంలో సుభాష్ చంద్రబోస్ ‘అజాద్ హింద్ పౌజ్’లో చేరారు. వైద్య వృత్తిని వదిలేసి ఐ.ఎస్.ఎ. మహిళా రెజిమెంటు నిర్మాణ బాధ్యతల్లో మునిగిపోయారు. దీని ఆధ్వర్యంలో దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన అనేక పోరాటాల్లో పాలుపంచుకున్నారు. అనేక నిర్బంధాలను సైతం ఎదుర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కమ్యూనిస్టు పార్టీలో చేరి సమసమాజం కోసం కృషి చేశారు.
మల్లు స్వరాజ్యం
చాలా చిన్న వయసులోనే జాతీయోద్యమాన భాగస్వాములయ్యారు. 1940లలో తెలంగాణా ప్రాంతంలో నిజాంకు వ్యతిరేకంగా మహోన్నతంగా సాగుతున్న పోరాటంలో ఆమె మమేకమయ్యారు. అన్నయ్య స్ఫూర్తితో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా పేదల కోసం అహర్నిశలూ పని చేశారు. 1942లో తొలిసారి ఆంధ్రమహిళా సభ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. అక్కడే ఆరుట్ల కమలాదేవిని కలిశారు. పాటలు పాడుతూ ప్రజల్లో చైతన్యం నింపేవారు. భూస్వాములకు వ్యతిరేకంగా అత్యంత చిన్న వయసులోనే గెరిల్లా దళంలో చేరారు. దళ కమాండర్‌గా పని చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆమె కమ్యూనిస్టు పార్టీలో చేరి అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. మహిళా సంఘం ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. సీపీ(ఐ)ఎం తరపున ప్రజాసమస్యలపై అసెంబ్లీలో గర్జించారు.
పాపా ఉమానాథ్
స్కూల్ విద్యార్థిగా ఈమె భారత స్వాతంత్ర్యపోరాటం, కార్మికోద్యమాల గురించి తొలి పాఠాలు విన్నారు. 1942లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశంలో ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. ఆ సమయంలో పాప జాతీయ, అంతర్జాతీయ పరిణామాల్ని జాగ్రత్తగా గమనిస్తుండేవారు. ఈ ఉద్యమంలో తానూ భాగస్వామ్యం కావాలని కోరుకునేవారు. తర్వాత బాలల సంఘంలో చేరి చురుగ్గా పని చేశారు. 1943లో జరిగిన సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొని అరెస్టయ్యారు. అప్పుడు ఆమెకు 12 ఏండ్లు. ఆ కాలంలో ఆమె దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన అనేక ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. 1945లో ఆమె కమ్యూనిస్టు పార్టీలో చేరారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా వ్యవసాయ కార్మికుల సమస్యలపై, మహిళా సమస్యలపై అనేక పోరాటాలు చేశారు.
విమల రణదివె
గాంధీజీ స్ఫూర్తితో 14 ఏండ్ల విమల భారత స్వాతంత్ర్యోద్యమంలోకి అడుగుపెట్టారు. స్కూల్లో ఉన్నప్పటి నుండే జాతీయోద్యమంలో పాలుపంచుకోవాలని ఆమె అభిలషించేవారు. కాంగ్రెస్ సేవాదళ్ కార్యకర్తగా చేరారు. జాతీయోద్యమానికి మద్దతుగా స్నేహితులతో కలిసి తెల్లని చీరలు ధరించేవారు. బ్రిటిష్ విధానాలకు నిరసనగా తరగతులను బహిష్కరించేవారు. 15 ఏండ్ల వయసులోనే ఆమె అరెస్టు అయ్యారు. న్యాయస్థానం ఆమెకు కఠిన కారాగార శిక్ష విధించింది. తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ ఉపసంహరించటంతో కాంగ్రెస్-గాంధీయిజం పట్ల విమల అసంతృప్తి చెందారు. స్వాతంత్ర్యోద్యమంలో మరింత సమరశీలంగా పనిచేసేందుకు ఇతర మార్గాల్ని అన్వేషించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కార్మికులు, దళితులు, పేదల పరిస్థితి ఏంటీ, వారి ఉన్నతికి ఎవరు కృషి చేస్తారు అనే ఆలోచనలు ఆమెలో మెదిలాయి. అప్పుడే ఆమె కమ్యూనిస్టు సిద్ధాంతానికి ఆకర్షితులయ్యారు. అప్పటి నుండి ఆమె కమ్యూనిస్టులతో మమేకమై పని చేశారు.



