నవతెలంగాణ-హైదరాబాద్: ప్రత్యేక వివాహ చట్టం కింద బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ , గౌరీ స్ప్రాట్ అధికారికంగా పెండ్లి చేసుకున్నారు. ఈ మేరకు ఆమీర్ ఖాన్ పీఆర్ బృందం ‘స్పైస్’ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ కొత్త జంట ఫొటోలను పంచుకున్నారు. 61 ఏళ్ల ఆమిర్ , 47 ఏళ్ల గౌరీ.. ఆదివారం నాడు పెండ్లికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లాంఛనాలను పూర్తి చేస్తూ కనిపించారు. సన్నిహిత కుటుంబ సభ్యులు,స్నేహితుల సమక్షంలో వారిద్దరూ తమ వివాహ పత్రాలపై సంతకాలు చేస్తూ కనిపించారు.
అమీర్ ఖాన్ మొదట 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వారికి జునైద్ ఖాన్ – ఇరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ జంట 2002లో విడిపోయింది. ఆ తర్వాత 2005లో ఆయన చిత్రనిర్మాత కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. 16 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం, 2021లో వారు విడిపోతున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ, వారు తమ కుమారుడు ఆజాద్ రావు ఖాన్ పెంపక బాధ్యతలను కలిసి నిర్వహిస్తున్నారు. గత ఏడాది మార్చిలో జరిగిన తన 60వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా, అమీర్ గౌరీ స్ప్ర్యాట్‌తో తనకున్న బంధాన్ని బహిర్గతం చేస్తూ ఆమెను మీడియాకు పరిచయం చేశారు. తాజాగా ఇరువురు ఒకటైయ్యారు.



