Sunday, July 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర 4వ మహాసభలు..ఆహ్వాన సంఘం ఏర్పాటు

తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర 4వ మహాసభలు..ఆహ్వాన సంఘం ఏర్పాటు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఈ ఏడాది సెప్టెంబర్ 27, 28 తేదీలలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర 4వ మహాసభలతో పాటు ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలు హైదరాబాద్ సంతోష్ నగర్ లో పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆహ్వాన సంఘం సమావేశాన్ని ఎం ధర్మ నాయక్ అధ్యక్షతన మలక్ పేట్ లోని ఫెర్న్ హిల్స్ స్కూల్ లో ఆదివారం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి, ప్రొ. శంకర్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్, ఆవాజ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్, కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు,రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి శోభన్ నాయక్,పీర్యా నాయక్, ఎం బాలు నాయక్, రాంకుమార్ నాయక్, ఆంగోత్ కృష్ణా నాయక్,భూక్యా వీరభద్రం, గూగులోత్ భీమా సాహెబ్, ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘు, వివిధ జిల్లాల నుంచి నాయకులు,ఉద్యోగులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు అంతరిస్తున్న క్రమంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఠానూ నాయక్ పేరు మీద నంగారా ఉత్సవాలు నిర్వహించడం చాలా మంచి పరిణామన్నారు. లంబాడి గిరిజనుల సంస్కృతి ఎంతో ఉన్నతమైందని వాటిని చాటి చెప్పేలా జరపాలన్నారు. గిరిజన సంఘానికి ఎంతో చరిత్ర ఉన్నదని గిరిజన హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించిన ఘనత ఈ సంఘానికి ఉందని కొనియాడారు. భూమి కోసం భుక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లక్షల ఎకరాలు పేద ప్రజలకు పంపిణీ చేశారని అంతటి వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న ఠానూ నాయక్ త్యాగాలు భావితరాలకు స్పూర్తిదాయకమన్నారు.

కేంద్రంలో బిజెపి గిరిజన హక్కులను కాలరాస్తూ వారి సంస్కృతిపై దాడి చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేవెళ్ల డిక్లరేషన్ లో ఇచ్చిన 15 రకాల గిరిజన హామీలను అమలు చేస్తామని ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. ప్రతి గిరిజనకు కుటుంబానికి 12 లక్షలు ప్రతి గిరిజన తండా,గూడెం పంచాయతీలకు ప్రతి ఏటా 25 లక్షలు, మైదాన ప్రాంతంలో ఐటిడీఏలను ఏర్పాటు చేస్తామన్న హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.


ఆర్ శ్రీరాం నాయక్ మాట్లాడుతూ హైదరాబాద్ పాత నగరంలో గిరిజన సంఘం మహాసభలు ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలు జరపడం ఇదే మొదటి సారని అన్నారు. గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా జరిగే ఉత్సవాలను జయప్రదం కోసం రాష్ట్రంలోని గిరిజన కళాకారులు, కళాబృందాలను ఆహ్వానిస్తున్నామని అన్నారు. గిరిజనుల పండగలాగా జరపాలని లక్ష్యంతో జరుగుతున్న ఈ మహాసభల ఉత్సవాల జయప్రదానికి గిరిజన ఉద్యోగులు, మేధావులు, శ్రేయోభిలాషులు సహాయ సహకారాలు అందించాలని కోరారు.1999 లో ఆవిర్భవించిన గిరిజన సంఘం గత 27సంవత్సరాలుగా రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ అనేక విజయాలను సాధించిందన్నారు.

ఆహ్వాన సంఘం ఏర్పాటు..
చైర్మన్ గా – డోర్నకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డా.రామచందర్ నాయక్
కో-చైర్మన్ -డిప్యూటీ డిసిపి ట్రాఫిక్ రాందాస్ తేజా

అధ్యక్షులు– మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి
ప్రధాన కార్యదర్శిగా ఎం బాలు నాయక్, కోశాధికారి రాంకుమార్, ఉపాధ్యక్షులు ఆంగోత్ కృష్ణా నాయక్ లతో పాటు 250 మంది గిరిజన ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, మేధావులతో ఆహ్వాన సంఘం ఏర్పడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -