పాలకుల తప్పులను ఎండగట్టడం, ప్రజల పక్షాన నిలబడి నిలదీయడం జర్నలిజం ప్రాథమిక ధర్మం. కానీ నేడు ఆ ధర్మాన్ని నిర్వర్తించడమే అతిపెద్ద నేరంగా మారిపోయింది. స్వతంత్రంగా వ్యవహరిస్తూ, పాలకులకు నచ్చని నిజాలను రాసే జర్నలిస్టులను టార్గెట్ చేస్తూ ప్రభుత్వాలు సాగిస్తున్న నిర్బంధకాండ ప్రజాస్వామ్య వ్యవస్థలనే ప్రమాదంలోకి నెడుతోంది. ఇటీవలి కాలంలో దేశంలో జర్నలిస్టులపై, సామాజిక కార్యకర్తలపై యథేచ్ఛగా ‘ఉపా’ వంటి కఠిన చట్టాలను ప్రయోగించడం ఈ ధోరణికి పరాకాష్ట. విమర్శిస్తే చాలు… అక్రమ కేసులు, అర్ధరాత్రి అరెస్టులు, నిరంతర వేధింపులతో జర్నలిస్టులను లొంగదీసుకునే ప్రయత్నాలు కోకొల్లలు. దీనివెనుక స్పష్టమైన రాజకీయ కోణం దాగుంది. ప్రశ్నకోసమే పార్టీ పెడుతున్న అన్న ఏపీ ఉపముఖ్యమంత్రి ఆ ప్రశ్ననే తట్టుకోలేకపోతే ఎలా? మొన్నటికి మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్, ఇప్పుడూ తెలంగాణకు చెందిన జర్నలిస్టులు, కేవీఆర్, ప్రశ్న రావణ్ వంటి వారిపై ఏపీలో ‘ఉపా’ కేసులు బనాయిం చడం ఈ అణచివేత ధోరణికి ప్రత్యక్ష ఉదాహరణలు. ఇది కేవలం ఒక వ్యక్తిని జైల్లో పెట్టడం మాత్రమే కాదు, ప్రశ్నించే ప్రతి గొంతుకను భయభ్రాంతులకు గురిచేసే ఒక వ్యవస్థీకృత కుట్ర.
ఏపీలో సాయికృష్ణ హత్య, క్రాంతికుమార్ ఆత్మహత్య, ఆడపిల్లలపై లైంగికదాడుల వంటి అనేక ఘటనలు జరుగుతుంటే వాటి చర్యలకు ఉపక్రమించ కుండా… గతంలో ఎన్నడూ లేని విధంగా, కేవలం వార్తలు రాసి నందుకు, సోషల్ మీడియాలో అభిప్రాయాలు పంచుకున్నందుకు జర్నలిస్టులపై దేశద్రోహం వంటి అత్యంత కఠినమైన చట్టాలను ప్రయోగించడం నిత్యకృత్యమై పోయింది. అదే సందర్భంలో రావణ్ విమర్శను తప్పుపట్టిన పవన్ కళ్యాణ్, కేసుపెట్టిన రాధామనోహర్‌లు వాడిన భాష సంగతేంటి? ఒక్కరిని కఠినంగా శిక్షిస్తే, మిగతా వంద మంది భయపడి పాలకుల తప్పులను రాయడం మానేస్తారనేది ప్రభుత్వాల దుష్ట ఆలోచన. అందుకే, పెద్ద మీడియా సంస్థలు చాలావరకు పాలకుల భజన బృందాలలో చేరిపోయా యి. క్షేత్రస్థాయిలో నిజాయితీగా పనిచేసే స్వతంత్ర జర్నలిస్టులు, యూట్యూబ్ జర్నలిస్టులు, చిన్న పత్రికల ప్రతినిధులు తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారు. కార్మిక, శ్రామిక వర్గాల సమస్యలను, రైతుల, గ్రామీణ ప్రజల ఆవేదనను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టు లను ఉగ్ర వాదులుగా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే శక్తులుగా చిత్రీకరిం చడం పాలకుల ఫాసిస్టు ధోరణికి అద్దం పడుతోంది. నిజాలు మాట్లాడే నోళ్లను నొక్కే యడం ద్వారా తాము చేసే ప్రతి అక్రమాన్ని చట్టబద్ధం చేసుకోవచ్చని పాలకులు భావిస్తున్నా రు. అయితే, చరిత్రలో ఏ శక్తీ నిర్బంధం ద్వారా సత్యాన్ని శాశ్వతంగా దాచలేకపోయింది.
స్వేచ్ఛ అనేది అపరిమిత హక్కు కాదు. అదే సమయంలో చట్టాల పేరుతో ప్రజాస్వామ్య విమర్శలను అణచివేయడం కూడా సమర్థనీ యం కాదు. అసత్య ప్రచారాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొనే మార్గాలు అనేకం. వాస్తవాలను ప్రశ్నించే స్వరాలను కూడా అదే గాటన కట్టేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బ తింటుంది. ప్రశ్నించిన ప్రతి ఒక్కరినీ ప్రత్యర్థిగా చూడడం, ప్రతి విమర్శను కుట్రగా చిత్రీకరించడం ప్రజాస్వామ్య సంస్కృతిని బలహీనపరుస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రశ్న శత్రువు కాదు, అదొక అద్దం. అందులో కనిపించే లోపాలను సరిదిద్దు కోవడం పాలకుల పరిణతి. అలా కాకుండా ఆ అద్దాన్నే పగలగొట్టాలని ప్రయత్నించడం బలానికి కాదు, అసహనానికి సంకేతం. ప్రస్తుతం దేశంలో జరుగుతోందిదే.
నిన్నటికి నిన్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు తెలపడం లేదా ధర్నాలు చేయడం అనేది పౌరుల ప్రాథమిక హక్కు అని ముంబై హైకోర్టు స్పష్టం చేసింది. అంతకు ముందు ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక ఆందోళన వార్తలను, రైతుల ఉద్యమం విశేషాలను ‘న్యూస్‌క్లిక్’ నిరంతరంగా ప్రచురించింది. అధికార శ్రేణులకు మింగుడుపడని మరెన్నో అంశాల్ని వెలుగులోకి తెచ్చింది. దీంతో అధికారపార్టీ ప్రబీర్ పురకాయస్థపై కక్ష కట్టింది. ఢిల్లీ ప్రత్యేక పోలీసు విభాగాన్ని సోదాలకు పంపింది. ఆయనపై ‘ఉపా’ కేసు పెట్టింది. ఆధారాలు చూపడంలో విఫలమ య్యారంటూ పోలీసులకు సర్వోన్నత న్యాయస్థానం తలంటు పోసింది. అరెస్టు చెల్లదని స్పష్టమైన తీర్పునిచ్చింది. ఢిల్లీకి చెందిన విద్యార్థి నాయకుడు, సామాజిక కార్యకర్త ఉమర్ ఖలీద్‌పై ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి, విచారణ పేరుతో ఆరేండ్లుగా జైల్లో ఉంచడం దేశ వ్యాప్తంగా ఇప్పటికీ చర్చ నీయాంశమే. నిర్దిష్టమైన ఆధారాలు లేకుండా, కేవలం భిన్నాభిప్రాయాలను వ్యక్త పరిచినందుకు ఇలాంటి క్రూరమైన చట్టాలను ప్రయోగించడం పౌర హక్కుల హరణమే అవుతుంది. ఇక్కడ శిక్ష కంటే విచారణే ఒక పెద్ద శిక్షగా మారుతున్న దుస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే జర్నలిస్టులపై డజన్ల కొద్దీ కేసులను ఉదహరించవచ్చు. అసలు అభియోగాలే లేకుండా ఇప్పటికీ ఎందరో జైళ్లలో మగ్గుతున్నారు. ప్రజాపక్షం వహించే జర్నలిజాన్ని నియంత్రించడానికే ప్రభుత్వాలు ఈ చట్టాలను ఉపయోగిస్తున్నాయని ఇది స్పష్టంగా సూచిస్తోంది. ఈ నేపథ్యంలో పత్రికా స్వేచ్ఛ కోసం, నిజమైన జర్నలిజం కోసం పాత్రికేయ సమాజం మాత్రమే కాదు, పౌరసమాజమూ సమాయత్తం కావాలి. లేకపోతే ప్రజాస్వామ్య సౌధమైన నాలుగోస్తంభం కూలిపోతుంది.
ప్రశ్నపై ‘ఉపా’ ఉచ్చు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



