Monday, July 6, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిపాఠశాలలు మూసేస్తే ప్రభుత్వవిద్య బాగుపడుతుందా?

పాఠశాలలు మూసేస్తే ప్రభుత్వవిద్య బాగుపడుతుందా?

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ సంక్షోభంలో పడిందనడానికి ప్రభుత్వం ఇటీవల విద్యారంగంలో మార్పులు తీసుకురావడానికి చేపడుతున్న నిర్ణయాలే నిదర్శనం. 1,441 పాఠశాలలను మూసివేసి 2026 – 27 యూడైన్ లెక్కల నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో 640 పాఠశాలల్లో కేవలం ఉపాధ్యాయులు మాత్రమే ఉండి, ఒక్క విద్యార్థి కూడా లేకపోవడంతో అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయలను వేరే పాఠశాలలకు డిప్యుటేషన్‌‌పై పంపించి వాటిని కూడా త్వరలో మూసివేయాలని నిర్ణయించింది. దీన్నిబట్టి ప్రభుత్వ విద్య పట్ల పాలక వర్గాలకు ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో 26 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో 2,081 జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలు ఉన్నట్టు తేలగా, ప్రస్తుతానికి 1,441 స్కూళ్లను మూసివేయడంతో పాటు, మిగిలిన 640 పాఠశాలలను మూసివేస్తే ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 24 వేల లోపే పరిమితం కానుంది. గ్రామాలలో పాఠశాలలు మూతపడటం వల్ల పేద, దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల పిల్లలు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం కంటే వాటిని పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి.

తెలంగాణ సర్కార్ ఏడాదిన్నర క్రితం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అకునూరి మురళి ఆధ్వర్యంలో తెలంగాణ విద్యా కమిషన్‌‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ తన అధ్యయనంలో రాష్ట్రంలో విద్యా వెనుకబాటును స్పష్టంగా గుర్తిస్తూ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. అదే సమయంలో ప్రస్తుతం విద్యారంగం ఎదుర్కొంటున్న సవాళ్లను, సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి విద్యారంగం వెనుకబాటు నుంచి బాగు చేయడానికి పలు సిఫార్సులు కూడా చేసింది. కేంద్రంలో ఎన్డీయే సర్కార్ రూపొందించిన నూతన విద్యా విధానం-(ఎన్‌ఈపి 2020)లోని అశాస్త్రీయ విధానాలను తిరస్కరించాలని, ఉచిత నిర్బంధ విద్య బోధనను 18 ఏళ్ల వరకు పెంచాలనే సిఫార్సులు వీటిలో అత్యంత అవసరమైనవి. కానీ, ఎఈపికి అనుగుణంగానే కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ‌నడుస్తున్నది. రాష్ట్రంలో నేడు అమలవుతున్న విద్యావిధానం విషయంలో కఠోర వాస్తవాలను ఈ నివేదిక అందజేసింది. బడి బయట ఉన్న పిల్లల నుండి అసలు బడి అంటే ఏంటో తెలియని వారి సంఖ్యను కూడా వాస్తవాల రూపంలో వెలుగులో తెచ్చింది. ఈ వాస్తవాలే ఇప్పటి ప్రభుత్వానికి కంటగింపుగా మారాయి. వంద మంది విద్యార్థులలో 26 మంది మాత్రమే ప్రభుత్వ బడులలో చేరుతున్నారని సగానికి ఎక్కువ మంది ప్రైవేట్ పాఠశాలల్లో చేరుతున్నారని, ప్రభుత్వ రంగంలో 36 శాతం ఏకోపాధ్యాయ బడులు కాగా, 86శాతం బడులలో అన్ని తరగతుల విద్యార్థులను ఒకే గదిలో కూర్చోబెట్టి విద్యా బోధన చేస్తున్నారని పేర్కొంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేరని, కనీస సౌకర్యాలు లేవని కూడా తేల్చింది. నాణ్యమైన విద్యాబోధనలో మన స్థానం 26 అని, మూడవ తరగతి విద్యార్థులకు వారి కింది తరగతి పుస్తకం కూడా చదవలేని వెనుకబాటు తనం ఉందని, ఇంకా ఉన్నత విద్యా సంస్థలకు 77 శాతం కళాశాలకు న్యాక్ గుర్తింపు లేకపోవడం, యూనివర్సిటీల్లో 80 శాతం ఖాళీలతో భ్రష్టు పట్టించిన విషయాన్ని కుండ బద్దలు కొట్టి తెలియజెప్పింది.

ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు నాణ్యమైన విద్య కోసం సమగ్ర రోడ్ మ్యాప్ రూపొందించాలన్న తెలంగాణ విద్యా కమిషన్ లక్ష్యం విస్తృత ఆశయాన్ని ప్రతిబింబించింది. దీనితో కొత్త ఆశలు రెక్కలు తొడిగాయి, విద్యా కమిషన్ చాలా శ్రమకోర్చి పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి ప్లస్ టు స్థాయి వరకు శ్రేష్టమైన విద్యకోసం తీసుకురావాల్సిన మార్పులను సూచించింది. ఫీజుల నియంత్రణ, ఐదేండ్ల ప్రణాళికను కచ్చితమైన బడ్జెట్ అంచనాలతో నివేదికను రూపొందించింది. కానీ ప్రభుత్వం ఆ నివేదికతో నంబంధం లేకుండానే ఇంటిగ్రేటెడ్ న్కూళ్లను ప్రారంభించింది. విద్యా కమిషన్ ఇంకా ఉన్నత విద్య, ఒకేషనల్, టెక్నికల్ విద్యకు సంబందించిన అంశాలపై చర్చలు, నివేదికలు పూర్తి చేయలేదు. అన్ని విషయాలతో సమగ్ర నివేదిక కూడా తయారుకాలేదు. ఈ లోపే ప్రభుత్వం గత నెలలో తెలంగాణ విద్యా విధానం(టిఈపి) రూపొందించడానికి ప్రాజెక్ట్ మేనెజ్‌మెంట్ యూనిట్‌‌ని రూపొందించింది. ఈ ప్రక్రియను అంతా పరిశీలిస్తే విద్యా కమిషన్‌లో నిర్మాణ సంబంధ లోపాలు, విద్యా విధాన రూపకల్పన ప్రక్రియకు సంబంధించిన లోపాలు స్పష్టం. దీంతో ఈ సంస్కరణల లక్ష్యం నెరవేరుతుందా? అనే అనుమానం కూడా కలుగుతుంది. నేటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదిక అమలుపై స్పష్టత ఇవ్వకపోగా కొత్తగా రిక్రూట్మెంట్ అయ్యే ఉపాధ్యాయుల వేతనాల విషయంలో మురళి కమిషన్ సిఫార్సులను పక్కనపెట్టి, ఉపాధ్యాయుల పదోన్నతుల అంశం ముందుకు తెచ్చి మెజార్టీ ప్రజలకు ఉపయోగకరమైన సిఫార్సులు అమలు చేయకుండా తొక్కి పెట్టిందనేది వాస్తవం.

నిజానికి దేశంలోని అన్ని రంగాలలో ప్రయివేటీకరణ వేళ్లూనుకున్న నేపథ్యంలో విద్యా కమిషన్ తనకున్న పరిమితులతో ఆచరణలో సాధ్యాసాధ్యాలు పరీశీలించి నివేదికను విడుదల చేసింది. అందుకే ప్రయివేటు విద్యా వ్యవస్థను ఒకేసారి రద్దు చేయాలనే డిమాండ్ నుంచి పక్కకు జరిగి ప్రభుత్వరంగ విద్యలో నాణ్యత పెంచి బాగు చేయడమే లక్ష్యంగా తన నివేదికను ఇచ్చింది. ఇకపోతే తెలంగాణలో పాఠశాల విద్య అంటే ప్రయివేటు విద్య మాత్రమే అనే భావన నెలకొని ఉంది. అందులోనూ ముఖ్యంగా తల్లిదండ్రులకు టక్కున గుర్తొచ్చేది నర్సరీ, ఎల్.కె.జి, యుకెజి భోధన, ఇంగ్లీష్ మీడియం బోధన చేసే ప్రయివేటు పాఠశాలలే. ఈ రకమైన ప్రైవేట్ బోధన మాత్రమే నిజమైన, నాణ్యమైన చదువుగా తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మురళి కమిషన్ ప్రభుత్వ రంగంలో కూడా నర్సరీ, ఎల్.కె.జి, యుకెజి లను బోధించే పూర్వ ప్రాథమిక విద్యను తీసుకు రావాల నడం, నర్సరీ నుండి పి.జి వరకు ఇంగ్లీష్ మీడియంలోనే విద్య బోధన జరపాలనడం మంచి అంశాలు. అలాగే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, సౌకర్యాలు కలిగినట్టి తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల్లో విస్తరించి ప్రభుత్వ విద్యలో నాణ్యత పెంచాలి అని చెప్పడం, ప్రతి తరగతికి ఒక గది నిర్మాణం చేయాలనడం ఇందులో ముఖ్యమైనవి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన, నిత్యం మానిటరింగ్ కోసం జిల్లా స్థాయి పర్యవేక్షణ బోర్డు ఏర్పాటు చేయాలనడం పేద, మధ్యతరగతి విద్యార్థులకు చాలా ఉపయోగకరమైనవి.

పాఠశాల విద్యలో మరో సిఫార్సు ఆయా సొసైటీలుగా కొనసాగుతున్న గురుకుల విద్య సంస్థలను ఒకటిగా కలపడం. కుల వ్యవస్థను సుస్థిరం చేస్తున్న ఆయా కులాల గురుకులాలను కలిపి ఇంటిగ్రేటెడ్ గురుకులాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ పౌరసమాజం నుంచి వచ్చినదే. ఇక ఇంటర్‌ విద్యలో చేసిన సిఫార్సులను పరిశీలిస్తే మెజారిటీ సిఫార్సులు ప్రయివేటు కళాశాలల, కోచింగ్ సెంటర్ల దోపిడీని అరికట్టడానికి వచ్చినవే. కానీ, ఫీజుల నియంత్రణ చట్టం రూపొందించాలనే కమిషన్ సిఫార్సులు ఈ విద్యా సంవత్సరం అమలు చేస్తామని నేటికీ చట్టం రూపొందించకుండా మళ్లీ ఈ అంశంపై మరో మంత్రుల కమిటీ వేసింది సర్కార్‌. ఇది ప్రయివేటు విద్యా దోపిడీని కొనసాగించడమే అవుతుంది. ఇక ఉన్నత విద్యలో లోపాభూయిష్టమైన విధానాలను, పాలకుల నిర్లక్ష్యాన్ని కండ్లకు కట్టినట్టు చూపుతున్న ఈ నివేదిక విద్యార్థులకు భారంగా మారిన సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు రద్దు చేసి, విద్యార్థి సంఘాలు ఎన్నికలు జరిపి, ప్రొఫెసర్ల నియా మకాలు జరపాలి అని చెప్పడం, ఎయిడెడ్ కళాశాలలను ప్రభుత్వ కళాశాలలుగా మార్చడం, ఐటిఐలను అఫ్‌ గ్రేడ్ చేయడం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అనుబంధంగా హాస్టళ్ల ఏర్పాటు చేయాలని చెప్పడం వంటి సిఫార్సులు విద్యార్థులకు ఉపయోగకరమైనవే.

ఈ నివేదిక అమలైతే గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నివేదికను ప్రజల మధ్య చర్చకు ఉంచి ఉపయోగకరమైన సిఫార్సులు అమలు చేయాలని అడగడంతో పాటు సమాన శాస్త్రీయ విద్య సాధన దీర్ఘకాలికంగా ప్రజలు, విద్యార్థులు ఉద్యమించాలి. అందులో భాగంగా తక్షణమే మురళి కమిషన్ చెప్పినట్లు విద్యారంగానికి 18శాతం నిధులను మంజూరు చేయాలి. ఈ నిధులు ప్రతీ ఏడాది పెంచుతూ వార్షిక బడ్జెట్‌‌లో 30శాతానికి పెంచాలి. పాఠ శాలలను మూసివేయడం సమస్యకు ముగింపు కాదు. వాటికి పూర్వ వైభవం తీసుకురావడమే ఈ సమస్యకు పరిష్కారం.

నాదెండ్ల శ్రీనివాస్, 96764071400

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -