Monday, July 6, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‘ఉపాధి’ పేరుతో ఉరితాడు

‘ఉపాధి’ పేరుతో ఉరితాడు

- Advertisement -

దేశవ్యాప్తంగా గ్రామీణ పేదలకు ఎంతో కొంత ఉపశమనంగా ఉన్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (ఎంజి నరేగా) వికసిత్ భారత్ గ్యారంటీ ఆఫ్ రోజ్‌‌గార్ అండ్ అజీవికా మిషన్ – గ్రామీణ్ (వి బి – జి రామ్ జి )గా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మార్చి వేసి ప్రజలకు ఆ కొద్దిపాటి ఉపశమ నాన్ని కూడా హరించింది. జులై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చిన ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోని రైతు,ప్రజా సంఘాలు ఆందోళనలు సాగిస్తున్నా కేంద్రానికి చీమకుట్టినట్టు కూడా లేదు.1990ల తర్వాత సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను చేపట్టిన అప్పటి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. వ్యవసాయరంగ సంక్షోభానికి, గ్రామీణ పేదల నిరుద్యోగానికి మూల కారణమైన భూమి సమస్యపైకి ప్రజల దృష్టి మళ్లకుండా గ్రామీణ పేదలకు ఉపాధిని గ్యారెంటీ చేస్తామని భ్రమలు కల్పిస్తూ ‘ఉపాధి’ని ముందుకు తెచ్చింది. 1980ల నుంచి ‘పనికి ఆహారం’ పేరుతో సాగిన ఈ చట్టం 2006లో కేంద్రం లోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకంగా అమలు చేసి 2009 నాటికి మహాత్మా గాంధీ పేరును పథకానికి ముందు చేర్చింది.ఈ పథకం అమలులో నిధుల దుర్వినియోగం, నకిలీ జాబ్ కార్డులు, నిధుల దారి మళ్లింపు విధానాల వలన వేల కోట్ల రూపాయల అవినీతి పెరిగిందని కాగ్ నివేదిక వెల్లడి చేసింది. అంతేకాకుండా ఈ పథకం ఆయా ప్రాంతాలలోని భూస్వామ్య పెత్తందారీ వర్గాల చేతిలో పనిముట్టుగా తయారయింది. ఆ విధంగా ఉపాధి హామీ పథకం పెత్తందార్ల ఫలహార పథకంగా మారిపోయింది. ఆచరణలో ఈ చట్టాన్ని అరకొరగా అమలు చేసిన ఫలితంగా గ్రామీణ ప్రాంతాలలోని పేద ప్రజలకు ఉపాధి హామీ లభించక కరువు ప్రాంతాల నుంచి వలసలు పెరుగుతూనే ఉన్నాయి.

2014లో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని మరింతగా నీరుగార్చేందుకు బడ్జెట్ కేటాయింపు ల్లో కోత విధించింది. ఈ పథకం కొన్ని ప్రాంతాలకే అమలు చేయాలని నిర్ణయిస్తూ, ఈ పథకంలో పూర్తిగా మానవ శ్రమనే ఉపయోగించటానికి బదులు అనధికారికంగా యంత్రాల వాడకాన్ని పెంచింది. ఇప్పటివరకు ఈ పథకం కింద తొంభై శాతం కేంద్రం, పది శాతం ఆయా రాష్ట్రాలు భరిస్తూ ఉండగా ప్రస్తుత నూతన చట్టం ప్రకారం అరవై శాతం ఖర్చులను మాత్రమే కేంద్రం భరిస్తుందని, మిగతా నలభై శాతం రాష్ట్రాలు భరించాలని నూతన చట్టంలో పేర్కొంది. 2024-25 లో పాత చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు రూ.7700 కోట్లు చెల్లిస్తే, ఇప్పుడు కొత్త చట్ట ప్రకారం 2026-27 సంవత్సరంలో రూ.51 వేల కోట్లు చెల్లించాల్సి వస్తుంది. ఆ విధంగా రాష్ట్రాలపై అపరిమిత భారాన్ని పెంచి ఆచరణలో ఈ పథకాన్ని మరింతగా నీరుగార్చింది. అంతే కాకుండా వ్యవసాయ సీజన్‌‌లో రెండు నెలల పాటు ఉపాధి హామీ పనులను నిలిపివేయాలని చట్టంలో పేర్కొనటం ద్వారా ఉపాధి కూలీల కడుపులను మాడ్చే నిరంకుశ చర్యకు పూనుకుంది. గతంలో ఉన్న 100 రోజుల పని దినాన్ని 125 రోజులకు ఈ కొత్త చట్టంలో పెంచుతున్నట్టు చేసిన ప్రకటన ఆచరణలో మరిన్ని పని దినాలు కోతకు గురవుతాయి. దీనికి నిదర్శనమే ఈ పథకానికి బడ్జెట్‌‌లో కేటాయింపులకు కోతలు పెట్టడమే సాక్ష్యాలుగా నిలుస్తాయి. అంతేకాక ఈ కొత్త పథకం వలన కూలీలకు దినసరి వేతనం వివిధ రాష్ట్రాలలో రూ.5 నుంచి రూ.32 రూపాయల వరకు పెంచినట్లు ప్రకటించటం రాకెట్‌లా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు మధ్య ‌కంటి తుడుపు చర్యగా మాత్రమే మిగిలిపోతుంది. పెంచిన రేట్ల ప్రకారం దినుసరి కూలీ గరిష్టంగా 350 కూడా దాటదు. కనీసం రూ.500 చేయాలని ప్రజల డిమాండ్‌.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలోనే ఈ పథకాన్ని నీరుగార్చే చర్యలకు పాల్పడుతూ ఉండగా ఇప్పుడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కొత్త చట్టం పేరుతో పేద ప్రజల ఉపాధి దొరక్కుండా ఉరితాళ్లను తయారు చేస్తున్నది. ఈ కొత్త చట్టం పేరుతో రాష్ట్రాలపై భారాలు పెంచటంపై బీజేపీ పాలిత రాష్ట్రాలైన బీహార్, మధ్య ప్రదేశ్, జార్ఖండ్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడు, క‌ర్నాటక, పంజాబ్ రాష్ట్రాలు ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కేరళలో గత ఎల్డీఎఫ్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా అమలు చేయమని ప్రకటించింది. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తామన్న పేరుతో అవకాశవాదాన్ని ఆశ్రయించింది. డబులింజన్ సర్కారులు ఉన్న రాష్ట్రాలే ఈ కొత్త పథకాన్ని వ్యతిరేకిస్తుంటే ఏపీలోనికూటమి ప్రభుత్వం కనీసం నిరసన తెలియజేయకపోవటం అన్యాయం. ఈ కొత్త పథకం వలన జరిగే నష్టాలను మరుగునపరిచి కష్టజీవుల ఊపిరి తీయడానికి డబుల్‌ఇంజన్ సర్కా‌ర్లు సిద్ధపడుతున్నాయి. కేంద్రం విధానాలను ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజాంతంత్ర శక్తులు వ్యతిరేకించాలి. ఐక్యపోరాటాల ద్వారా తిప్పికొట్టాలి.

ముప్పాళ్ల భార్గవ శ్రీ, 9848120105

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -