అమెరికా ఆటగాడిపై రెడ్ కార్డ్ ఎత్తివేత
ప్రీ క్వార్టర్స్‌లో ఆడేందుకు లైన్ క్లియర్
ట్రంప్ కోసం ఫిఫా అనూహ్య నిర్ణయం
సర్వత్రా వెల్లువెత్తుతున్న విమర్శలు
నవతెలంగాణ-సియాటెల్
ఫిఫా ప్రపంచకప్ రూల్స్‌లో అత్యంత నిలకడగా, పక్కాగా అమలు పరుస్తున్న నిబంధనల్లో రెడ్ కార్డ్ ఒకటి. ప్రపంచకప్ మ్యాచ్‌లో రెడ్ కార్డ్ ఎదురైతే.. తర్వాతి మ్యాచ్‌లో ఆడేందుకు అవకాశం ఉండదు. మ్యాచ్ నిషేధం అమల్లోకి వస్తుంది. దీనిపై ఎటువంటి చర్చ, తర్జనభర్జలు ఉండవు. రెడ్ కార్డ్‌పై అప్పీల్ చేసుకునే అవకాశం అసలే ఉండదు. కానీ అమెరికా ఆటగాడు ఫోలారిన్ బాలోగన్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో బోస్నియాపై రెడ్ కార్డ్ ఎదుర్కొన్నాడు. దీంతో సహజంగానే ప్రీ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో అతడిపై నిషేధం అమల్లో ఉంటుంది. ఫిఫా బాలోగన్‌పై రెడ్ కార్డ్‌ను ఎత్తివేయటంతో పాటు రెడ్‌కార్డ్‌కు ఆటోమెటిక్ సస్పెన్షన్ రూల్‌ను ఏడాదిపాటు రద్దు చేసింది. ఫిఫా తీసుకున్న అసాధారణ నిర్ణయం ఇప్పుడు ఫట్‌బాల్ అభిమానులు, ఆటగాళ్లను అయోమయంలో పడేసింది. ఎటువంటి కారణాలు లేకుండా, బాలోగన్‌పై మ్యాచ్ నిషేధం ఎత్తివేసిన ఫిఫా ఊహాగానాలకు చోటిస్తూ.. సెల్ఫ్‌గోల్ చేసుకుంది.
రెడ్ కార్డ్ ఎందుకు ఇచ్చారంటే..
ఫోలారిన్ బాలోగన్ అమెరికా స్టార్ ఆటగాడు. ప్రపంచకప్‌లో ఇప్పటికే మూడు గోల్స్ కొట్టిన బాలోగన్ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. బోస్నియాతో మ్యాచ్‌లో అతడు రెడ్ కార్డ్ అందుకున్నాడు. మ్యాచ్ రిఫరీ.. వీఏఆర్ (వార్) వీడియో సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నా డు. దీంతో ఆ మ్యాచ్ మధ్యలోనే (ద్వితీయార్థం) బాలోగన్ మైదానం వీడాడు. అమెరికా పది మంది ఆటగాళ్లతో 2-0తో బోస్నియాపై గెలుపొంది ప్రీ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది.
ఎందుకు ఎత్తివేశారు?
ఫిఫా రూల్స్ ప్రకారం ప్రపంచకప్‌లో రెడ్ కార్డ్‌పై ఎటువంటి అప్పీల్, సమీక్షకు అవకాశం లేదు. రెడ్ కార్డ్ ఎదురైతే, తర్వాతి మ్యాచ్‌కు బెంచ్‌కు పరిమితం కావాల్సిందే. అమెరికా ప్రీ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకోవటంతో రాజకీయ ఒత్తిడి నడుమ ఫిఫా అసాధారణ, వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. బాలోగన్‌పై రెడ్ కార్డ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దీంతో బెల్జియంతో ప్రీ క్వార్టర్‌ఫైనల్లో బాలోగన్ ఆడేందుకు అర్హత సాధించాడు. ఈ మేరకు ఫిఫా క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. రూల్ 32 ప్రకారం తనకు సంక్రమించిన అధికారాలతో ఫిఫా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
ఎవరి కోసం చేశారు? :
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆఫీస్‌తో ఫిఫా ఉన్నతాధికారులు తొలి నుంచి దగ్గరి సంబంధాలు కొనసాగిస్తున్నారు. ట్రంప్‌కు నోబెల్ శాంతి పురస్కారం దక్కలేదని.. ఏకంగా ఫిఫానే ట్రంప్‌కు గ్లోబెల్ పీస్ అవార్డును అందించింది. బాలోగన్ రెడ్‌కార్డ్, మ్యాచ్ సస్పెన్షన్ నిర్ణయాన్ని సమీక్షించాలని డొనాల్డ్ ట్రంప్ గురువారం ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్‌ఫాంటినోకు ఫోన్‌లో మాట్లాడారు. క్రమశిక్షణ కమిటీ ఈ విషయంలో సమీక్ష చేస్తుందని ట్రంప్‌కు జియాని హామీ ఇచ్చారు. ఫిఫా అధ్యక్షుడి ఆదేశాలతో క్రమశిక్షణ కమిటీ బాలోగన్‌పై రెడ్‌కార్డ్‌ను వెనక్కి తీసుకుని, మ్యాచ్ నిషేధం ఎత్తివేసింది.
భగ్గుమన్న యూఈఎఫ్‌ఏ
ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు 189 రెడ్ కార్డ్‌లు నమోదయ్యాయి. అందులో ఇద్దరు మాత్రమే సస్పెన్షన్ నుంచి తప్పించుకున్నారు. ఆటోమెటిక్ సస్పెన్షన్ లేని రోజుల్లో క్రమశిక్షణ సంఘం సమీక్షలో నిర్ణయాలు తీసుకునేది. 1962లో బ్రెజిల్ ఆటగాడు జెరించాపై మ్యాచ్ నిషేధం పడలేదు. ఆటోమెటిక్ నిషేధం అమల్లో ఉన్నప్పటికీ బాలోగన్ నిషేధం నుంచి తప్పించుకున్నాడు. 2026 ప్రపంచకప్‌లో రెడ్ కార్డ్ ఎదుర్కొన్న ఇతర 11 మంది ఆటగాళ్లు తర్వాతి మ్యాచ్‌లో సస్పెన్షన్‌ను ఎదుర్కొన్నారు. కానీ, బాలోగన్ అంశంలోనే ఫిఫా ఏకంగా ఫుట్‌బాల్ సమగ్రతనే ప్రశార్థకం చేసే నిర్ణయం తీసుకోవటంపై ఫుట్‌బాల్ సంఘాలు మండిపడుతున్నాయి. ‘ఇప్పటివరకు చూడని, అర్థరహిత, అన్యామైన నిర్ణయం పట్ల మా నిరసన తెలియజేస్తున్నామని’ యూరోపియన్ యూనియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచకప్‌లో రెడ్‌కార్డ్‌కు ఆటోమెటిక్ మ్యాచ్ సస్పెన్షన్‌ను ఏడాది పాటు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవటంతో ఫిఫా లక్ష్మణ రేఖ దాటిందని యూఈఎఫ్‌ఏ ఘాటుగా వ్యాఖ్యానిం చింది. బాలోగన్ మ్యాచ్ సస్పెన్షన్‌పై బెల్జియం ఫుట్‌బాల్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిఫా నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, అప్పీల్‌కు వెళ్తామని స్పష్టం చేసింది. బెల్జియం, అమెరికా ప్రీ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 5.30 గంటలకు జరుగనుంది. ఈ లోపు ఫిఫా తను తీసుకున్న మూర్ఖపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆట సమగ్రతను కాపాడుతుందా? లేదంటే ట్రంప్ మెప్పు కోసం ఫుట్‌బాల్‌ను పణంగా పెడుతుందా? ఆసక్తికరం.

బోస్నియా ఆటగాడి చీలమండపై కాలువేసి తొక్కుతున్న అమెరికా ఆటగాడు బాలోగన్. అందుకే రిఫరీ అతడికి రెడ్ కార్డ్ అందించాడు. ఆధునిక రూల్స్‌లో ఫౌల్ ఉద్దేశంతో సంబంధం లేకుండానే రిఫరీ నిర్ణయాలు తీసుకుంటున్నారు.



