సంజు శాంసన్ ఎంపిక చేయని సెలక్టర్లు
23 నుంచి జింబాబ్వేతో టీ20 సిరీస్
నవతెలంగాణ-ముంబయి
2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌కు మరోసారి సెలక్షన్ కమిటీ నుంచి గట్టి ఎదురుదెబ్బ. ఐర్లాండ్, ఇంగ్లాండ్‌తో టీ20ల్లో నిరాశపరిచిన సంజు శాంసన్ ఇప్పటికే భారత తుది జట్టులో చోటును వైభవ్ సూర్యవంశీకి కోల్పోగా.. జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న భారత జట్టులో ఏకంగా చోటునే గల్లంతు చేసుకున్నాడు. సంజు శాంసన్‌తో పాటు ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్‌లను సైతం సెలక్షన్ కమిటీ వదిలేసింది. దీంతో ఈ ఆటగాళ్లకు విశ్రాంతి అందించారా? లేదంటే వేటు వేశారా? అనేది సస్పెన్స్‌గా ఉంది. జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు సీనియర్ సెలక్షన్ కమిటీ సోమవారం జట్టును ఎంపిక చేసింది. కానీ ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న జట్టులో ఆరు మార్పులు చేయడానికి గల కారణాలను వెల్లడించలేదు. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ కొనసాగగా.. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ప్రిన్స్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్, శివమ్ దూబె, సూర్యాన్షు షెడ్జె జట్టులో నిలిచారు. ప్రభుసిమ్రన్ సింగ్, మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్, ఆశోక్ శర్మ, రింకు సింగ్, హర్ష్ దూబె జట్టులోకి వచ్చారు.
కోహ్లి ఫిట్, నితీశ్ ఔట్
ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి సిద్దమయ్యాడు. ఐపీఎల్ ఫైనల్లో గాయపడిన విరాట్ కోహ్లి స్వదేశంలో అఫ్గాన్‌తో వన్డేలకు దూరమైన సంగతి తెలిసిందే. ఫిట్‌నెస్ నిరూపించుకున్న విరాట్ కోహ్లి ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు అందుబాటులో ఉండగా.. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయంతో వన్డే జట్టుకు దూరమయ్యాడు.
అతడి స్థానంలో మరో పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబెను జట్టులోకి తీసుకున్నారు. భారత్, జింబాబ్వే టీ20 సిరీస్ ఈ నెల 23 నుంచి ఆరంభం కానుండగా.. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఈ నెల 14 నుంచి షురూ కానుంది.
భారత టీ20 జట్టు : శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, సూర్యాన్షు షెడ్జె, రింకు సింగ్, హర్ష్ దూబె, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభుసిమ్రన్ సింగ్
(వికెట్ కీపర్).
విశ్రాంతి? వేటు?
- Advertisement -
- Advertisement -



