Sunday, July 5, 2026
E-PAPER
Homeఆటలుసరైన సన్నద్ధత ఏదీ?

సరైన సన్నద్ధత ఏదీ?

- Advertisement -

బ్యాక్‌ఫుట్‌ నో బాల్స్‌పై విమర్శలు
రెండో టీ20లో ఓటమికి అవే కారణం

మాంచెస్టర్‌ : భారత్, ఇంగ్లాండ్‌ రెండో టీ20 పోరు. అప్పటికే వరుసగా మూడు మ్యాచ్‌ల్లో భారత్‌కు విజయమే లేదు. కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ సైతం తొలి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. అభిషేక్‌ శర్మ (43), ఇషాన్‌ కిషన్‌ (49), శ్రేయస్‌ అయ్యర్‌ (37) రాణించటంతో భారత్ 190 పరుగులు చేసింది. ఆతిథ్య ఇంగ్లాండ్‌ లక్ష్యం 191 పరుగులు. 16 ఓవర్లలో ఆ జట్టు 142/5తో ఆడుతోంది. చివరి నాలుగు ఓవర్లలో ఇంగ్లాండ్‌ మరో 49 పరుగులు చేయాలి. ఈ స్థితిలో మ్యాచ్‌ పూర్తిగా ఎటూ మొగ్గలేదు. ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో బంతి అందుకున్న స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ ఎవరూ ఊహించని రీతిలో నో బాల్స్‌ సంధించాడు. ఆ ఓవర్లో రెండు, ఓవరాల్‌గా మూడు నో బాల్స్‌ వేసిన బిష్ణోయ్‌ 6 బంతుల్లోనే 29 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో మ్యాచ్‌ ఇంగ్లాండ్‌ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఫ్రీ హిట్స్‌ అండతో మూడు సిక్సర్లు సంధించిన ఇంగ్లాండ్‌ మాంచెస్టర్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫ్రీ హిట్‌ బాల్స్‌తో ఒత్తిడి లేకుండా బ్యాట్ ఝులిపించిన జాకబ్‌ బెతెల్‌ (76 నాటౌట్) భారత్‌కు ఝలక్‌ ఇచ్చాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.

ఇది ప్రిపరేషన్‌ లోపమే
బౌలర్లు నో బాల్స్‌ వేయటం సహజమే. అందులో ఎక్కువగా పేసర్లు నో బాల్స్ వేస్తారు. ఫ్రంట్‌ ఫుట్‌ నో బాల్స్‌తో పాటు హైట్‌ నో బాల్స్‌ పేసర్లకు సాధారణం. కానీ స్పిన్నర్లు నో బాల్‌ వేయటం సాధారణ విషయం కాదు. అందులోనూ బ్యాక్‌ ఫుట్‌ నో బాల్స్‌ చెప్పనక్కర్లేదు. నెట్స్‌లో కొత్తగా ఏదైనా ప్రయత్నించినప్పుడు అక్కడ రనప్‌ సవరించుకోకుండా నేరుగా మ్యాచ్‌లో కొత్త ప్రయోగాలు చేయటంతో రవి బిష్ణోయ్‌ ఏకంగా మూడు బ్యాక్‌ ఫుట్‌ నో బాల్స్‌ వేశాడు. ఓ సమయంలో రవి బిష్ణోయ్‌ బంతి ఎక్కడ వేయాలనే ఆలోచన మానేసి.. బ్యాక్‌ ఫుట్‌ ఎక్కడ ల్యాండ్‌ అవుతుందనే చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉత్కంఠగా సాగుతున్న మ్యాచ్‌ ఏకపక్షమైంది. 19 ఓవర్లలోనే ఇంగ్లాండ్‌ ఛేదించింది. ఐర్లాండ్‌ టూర్‌లో ఆడని రవి బిష్ణోయ్‌.. ఈ సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నిలిచాడు. ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ బిష్ణోయ్‌ని అన్ని మ్యాచ్‌ల్లో ఆడించలేదు. అయినా, బిష్ణోయ్‌ భారత టీ20 జట్టులోకి నేరుగా వచ్చేశాడు. ఇప్పడు ఇది వివాదానికి దారితీస్తోంది. సెలక్షన్‌ కమిటీతో పాటు బౌలింగ్‌ కోచ్‌ రవి బిష్ణోయ్‌ ప్రదర్శనకు బాధ్యత వహించే పరిస్థితి వచ్చింది.

ఇక పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టి ఆతిథ్య జట్టును దెబ్బకొట్టాడు. కానీ తన రెండో ఓవర్లో అర్ష్‌దీప్‌ సింగ్‌ మూడు సిక్స్‌లు,రెండు ఫోర్లతో ఏకంగా 27 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో రెండు ఓవర్లలోనే (29, 27) 54 పరుగులు ఇవ్వటంతో ఇంగ్లాండ్‌ ఛేదన సులువైంది. భారత్‌, ఇంగ్లాండ్‌ మూడో టీ20 మంగళవారం నాటింగ్‌హామ్‌లో జరుగుతుంది. ఓ వైపు టీ20 ప్రపంచకప్‌ విజయం సాధించిన కెప్టెన్‌, టీ20 ప్రపంచకప్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ను పక్కనపెట్టిన టీమ్‌ ఇండియా నుంచి ఇటువంటి ప్రదర్శన ఎవరూ అంచనా వేయలేదు. మూడో టీ20లో భారత్‌ వరుస ఓటములకు బ్రేక్‌ వేయకుంటే, విమర్శలు మరింత పదునెక్కటం ఖాయం..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -