Monday, July 6, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రమాదకరంగా పారిశుధ్యం

ప్రమాదకరంగా పారిశుధ్యం

- Advertisement -

జీపీ, మున్సిపల్ కార్మికులకు అందని గ్లౌజ్‌లు, బూట్లు
డ్రయినేజీ మురుగు సైతం చేతితో ముట్టాల్సిందే
అనారోగ్యాలకు 
గురవుతున్న కార్మికులు
వర్షాకాలం వచ్చినా 
జాడేలేని రెయిన్ కోట్లు
విష కీటకాలతో ప్రమాదాలు
బడ్జెట్ వస్తున్నా.. విస్మరణ?


నవతెలంగాణ-
నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
తెల్లారే సరికి పల్లెను, పట్టణాన్ని శుభ్రపరిచి ప్రజలు రోగాల బారిన పడకుండా ఎప్పటికప్ప్పుడు తమ శక్తివంచన లేకుండా జీపీ, మున్సిపల్ కార్మికులు కృషి చేస్తుంటారు. కానీ వారి గోడును పట్టించుకునే వారు కరువయ్యారు. డ్రయినేజీలను క్లీన్ చేస్తూ, చెత్త తొలగిస్తున్న వీరికి కనీసం పని ప్రదేశాల్లో ఉపయోగించుకునే చేతి గ్లౌజ్‌లు, కాళ్లకు బూట్లు ఇవ్వడం లేదు. ఫలితంగా మురుగును సైతం నేరుగా చేతితో ముట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా అనారోగ్యాలకు గురవుతున్నారు. దీంతో పాటు పిచ్చిమొక్కలు తొలగించే క్రమంలో పొదల్లో నక్కి ఉండే పాములు, విష కీటకాలతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కార్మికులకు పరికరాలు, పనిముట్లు ఇచ్చేందుకు మున్సిపాల్టీల్లో టెండర్‌లు వేస్తున్నా.. జీపీలకు బడ్జెట్ వస్తున్నా పంపిణీ చేయకపోవడం గమనార్హం. కాగితాల్లో పంపిణీ చేసినట్టు ఉంటున్నా.. క్షేత్రస్థాయిలో ఉండటం లేదు. పైగా కార్మికులు గ్లౌజ్‌లు వేసుకునేందుకు ఇష్టపడరూ అంటూ బుకాయిస్తుండటం గమనార్హం. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 545 మంది జీపీలకు గాను 2831 మంది కార్మికులు, కామారెడ్డి జిల్లాలో 535 గ్రామాల్లో 1926 మంది కార్మికులు పారిశుధ్య పనులు నిర్వర్తిస్తున్నారు.

ఇది వరకే మల్టీపర్పస్ పేరిట ఒకే కార్మికుడితో అనేక పనులు చేయిస్తుండగా.. కార్మికులకు పని సమయంలో ఉపయోగించే గ్లౌజ్‌లు, బూట్లు పంపిణీకి నోచుకోవడం లేదు. దీంతో వట్టి చేతులతోనే డ్రయినేజీల్లో గైపారలతో మురుగు తీసి, తోపుడు బండిల్లో వేసి తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో మురుగు సైతం చేతులకు అంటుకుంటున్నా అదే విధంగా పని చేస్తున్నారు. దీంతో రోగాల బారిన పడుతున్నారు. దీంతో పాటు వర్షాలకు పొదలు, పిచ్చిమొక్కలు పెరుగుతుండగా.. వాటిని తొలగించే క్రమంలో పాములు, విష కీటకాలు కాటు వేసే ప్రమాదాలు లేకపోలేదు. నిజామాబాద్ జిల్లా సిరికొండలో జూన్ 27వ తేదీన ఓ కార్మికురాలు పీహెచ్‌సీలో పొదలు తొలగిస్తుండగా.. ఒక్కసారిగా పాము బుసలు కొడుతూ వచ్చింది. తృటిలో పాము కాటు నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఇలా ఎక్కడి నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితుల్లో పనులు చేస్తున్నారు.

మున్సిపాల్టీల్లో మరింత దారుణం..
మున్సిపాల్టీల్లో అయితే కార్మికుల పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. సాధారణంగా ఇక్కడ మూడు నెలలకోసారి కార్మికులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అందుకోసం టెండర్‌లు సైతం పిలుస్తుంటారు. లెక్కల్లో ఉంటున్న గ్లౌజ్‌లు చేతులకు మాత్రం కనిపించకపోవడం కొసమెరుపు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సానిటేషన్ విభాగంలో సుమారు 1030 మంది కార్మికులు పని చేస్తున్నారు. గ్లౌజ్‌ల విషయమై అధికారులను ఆరా తీస్తే.. కార్మికులే పెట్టుకునేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదని చెబుతుండటం గమనార్హం. కానీ గ్లౌజ్‌లు పెట్టుకొని పని చేస్తేనే సరైన గ్రిప్ ఉంటుందని కార్మికులు చెబుతున్నారు.

జాడే లేని రెయిన్ కోట్లు
వర్షాకాలం వచ్చినా.. జీపీ కార్మికులకు రెయిన్ కోట్‌లు ఇప్పటి వరకు అందలేదు. ప్రస్తుతం ముసురు వర్షం కురుస్తున్న సమయంలో అలానే పనులు చేసే పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలు కురిసే సమయంలో ఎక్కడైనా డ్రయినేజీలు పూడుకుపోతే వర్షంలోనే పని చేయాల్సి ఉంటుంది. మూడేండ్ల క్రితం ఇచ్చారని.. మళ్లీ వాటి జాడే లేదని జీపీ, మున్సిపల్ కార్మికులు ఆవేదన చెందుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -