ఆరు వికెట్లతో చెలరేగిన బ్రార్
రెండో అనధికార టెస్టులో భారత్-ఏ గెలుపు
శ్రీలంక-ఏతో టెస్టు సిరీస్ కుర్రాళ్ల వశం
గాలె (శ్రీలంక) : నాలుగు రోజుల పాటు రసవత్తరంగా సాగిన భారత్-ఏ, శ్రీలంక-ఏ రెండో అనధికార టెస్టులో టీమ్ ఇండియా కుర్రాళ్లు పైచేయి సాధించారు. ఓ దశలో డ్రా దిశగా సాగుతుందని అనిపించినా.. పొడగరి పేసర్ గుర్రూర్ బ్రార్ (6/68) ఆరు వికెట్లతో విజృంభించటంతో ఆతిథ్య జట్టుకు ఓటమి తప్పలేదు. గుర్నూర్ బ్రార్‌కు తోఉగా సరాన్షు జైన్ (2/66), అకిబ్ నబి (1/17), యశ్ ఠాకూర్ (1/16) రాణించటంతో రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక-ఏ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఆషెన్ బందెరా (87, 86 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో రాణించినా.. టాప్ ఆర్డర్‌లో, లోయర్ ఆర్డర్‌లో ఎవరూ మెరవలేదు. కుశార నువాంత (26), దిలుమ్ సుదీర (21) ఫర్వాలేదనిపించాఉ. 48.3 ఓవర్లలో కుప్పకూలిన శ్రీలంక-ఏ రెండో ఇన్నింగ్స్‌లో 209 పరుగులే చేసింది. ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 366 పరుగులు చేయగా.. భారత్-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 543 పరుగుల భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే. సాయి సుదర్శన్ (168), దేవద్ పడిక్కల్ (94), ధ్రువ్ జెరెల్ (53), సరాన్షు జైన్ (70), అకిబ్ నబి (30) రాణించారు. దీంతో భారత్-ఏకు శ్రీలంక-ఏ 33 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ (25 నాటౌట్, 22 బంతుల్లో 4 ఫోర్లు), ఆమన్ మోకాడె (11 నాటౌట్, 16 బంతుల్లో 1 ఫోర్) 6.2 ఓవర్లలోనే లాంఛనం ముగించారు. 10 వికెట్ల తేడాతో భారత్-ఏ ఘన విజయం సాధించింది. తొలి అనధికార టెస్టు డ్రాగా ముగియగా.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్-ఏ 1-0తో సొంతం చేసుకుంది.
సంక్షిప్త స్కోరు వివరాలు
శ్రీలంక-ఏ తొలి ఇన్నింగ్స్ : 366/10 (సహాన్ 127, ఫెర్నాండో 44, గుర్నూర్ బ్రార్ 4/77, సరాన్షు జైన్ 4/46)
భారత్-ఏ తొలి ఇన్నింగ్స్ : 543/10 (సాయి సుదర్శన్ 168, పడిక్కల్ 94, సరాన్షు 70, జురెల్ 54, నువాంత 5/159)
శ్రీలంక-ఏ రెండో ఇన్నింగ్స్ : 209/10 (ఆషెన్ 87, నువాంత 26, గుర్నూర్ బ్రార్ 6/68, సరాన్షు 2/66)
భారత్-ఏ రెండో ఇన్నింగ్స్ : 36/0 (సాయి సుదర్శన్ 25 నాటౌట్, ఆమన్ 11 నాటౌట్)



