- నెలల తరబడి తేలని కేసులు
- సామినేని హత్యకేసు నిదర్శనం
- 8 నెలలైనా తేల్చరే..!
- శాంతిభద్రతల క్షీణతకు ఇదే నిదర్శనం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
ఖమ్మం జిల్లాలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. చిన్నచిన్న చోరీ కేసులను సైతం ఛేదించటంలో పోలీసులు విఫలమవుతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. దీనికి నిదర్శనం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో అక్టోబర్ 30న జరిగిన ఉమ్మడి రాష్ట్ర రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి సామినేని రామారావు హత్య కేసు. ఇప్పటికీ ఈ ఘటన జరిగి 8 నెలలవుతున్నా ఈ కేసులో పురోగతి లేకపోవడం విమర్శకులకు తావిస్తోంది. ఈ హత్యకు పాల్పడిన వారిలో కాంగ్రెస్ వాళ్లు ఉన్నారని సామినేని భార్య స్వరాజ్యం చెబుతున్నా పోలీసులు పట్టించుకోక పోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఈ హత్య విషయమై తేల్చాలని మండల కేంద్రం మొదలు శాసనసభ దాకా సీపీఐ (ఎం) శ్రేణులు తీసుకెళ్లినా పట్టింపు లేదు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో ప్రస్తావించినా చలనం లేదు. ముఖ్యమంత్రినీ, డీజీపీనీ ఈ విషయమై బాధితులు కలిసిన సందర్భాలూ ఉన్నాయి. రామారావు హత్య జరిగిన చింతకాని మండలంలోనే సీఎం సభ నిర్వహించాలని ఓవైపు ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం ఆ ప్రాంతానికే చెందిన సామినేని హత్య కేసును తేల్చాలని సీపీఐ (ఎం) శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. సీఎం ఈ సభా వేదికపై నుంచే దీనికి సమాధానం చెప్పాలని కూడా కోరుతున్నాయి. హత్య, దొంతనం, రేప్ ఏది జరిగినా..జిల్లాలో చలనం ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.



