ఒరిజినల్ దేవదాసును తెలంగాణకు అన్వయం చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే కాలువ మల్లయ్య ”తెలంగాణ దేవదాసు” ను చదవాల్సిందే. దొరకూతురు చిందొర్సానికి, పాలేరు కొడుకు రఘురాంకు స్నేహం ఏర్పడడం, రఘురాం గడిలోకి వెళ్లి వాళ్లతో ఆడుకోవడం, కలిసి బడిలో చదువుకోవడమేమిటో అర్థం కాదు. బాల్యంలోనే రఘురాం హేతుబద్ధంగా, శాస్త్రీయంగా వాదించి చిందొర్సానిలో మార్పు తేవడం ఏమిటో? చిందొర్సాని ప్రేమలేఖ రాసి పెళ్లి చేసుకుందామని ప్రతిపాదించడం ఏమిటో? రఘురాం పట్నం పోయి బాగా చదువుకుని ఇంజనీరై వస్తాడు. ఈలోపల చిందొర్సాని పెళ్లి చేసుకొని మరింత పెద్ద గడిలోకి వెళ్ళిపోతుంది. ఆమె భర్తకు చిందొర్సాని, రఘురాముల ప్రేమ, పెళ్లి ప్రతిపాదనల గురించి తెలిసినా ఆదర్శ పురుషుడు, త్యాగమూర్తిలా నిలిచిపోతాడు. చిందొర్సాని చివరకు రఘురాంకు తనకు మధ్య ఉన్న అంతరాలను జ్ఞాపకం చేసి, రఘురాంను ప్రేమించే మహేశ్వరిని పెళ్లి చేసుకోమని సూచిస్తుంది.
తర్వాత రెండు జంటలు ఆత్మీయంగా స్నేహంగా కలిసిపోయారని సూచిస్తూ నవల ముగుస్తుంది. పుస్తకం నిండా దొరల అకత్యాలు, నిరంకుశత్వాన్ని వివరించారు. ఇందులో సునీత ”తెలంగాణ దేవదాసువి కావడం నీకు ఇష్టమా? ఇంకా పెళ్లి చేసుకోకపోవడం ఏమిటి? ఇంజనీరుగా మంచి ఉద్యోగంలో ఉన్న నీకు ఇదేం కర్మ. తెలంగాణలో వివిధ ఉద్యమాలు అనేక పోరాటాలు ఉండటం సహజమేమో కానీ దేవదాసులు ఉండడం సహజం కాదు. నువ్వు వాస్తవికవాదివి కదా! అసహజమైన వాటి నెందు కనుకరిస్తావు” అని రఘురాంను నిలదీయడం బాగా వచ్చింది. అవాస్తవ అహేతుక రీతిలో రూపొందిన ఈ తెలంగాణ దేవదాసు ఆసక్తికరంగా చదివింపజేయడం విశేషం.
కె.పి.అశోక్ కుమార్
9700000948



