మద్యం తాగేవారి ఆరోగ్యాన్నే కాదు కుటుంబ వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేస్తుంది. ఇంట్లో గొడవలు, హింసకు కారణంగా ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం కోల్పోవడంతో పాటు కుటుంబంలోని అందరిపైనా దాని ప్రభావం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆ ప్రభావం పిల్లలపై పడుతుంది. వారి ఆరోగ్యం, విద్య, మానసిక వికాసంపై దాని ప్రభావం మరింతగా ఉంటుంది. అలా మద్యానికి బానిసైన ఓ వ్యక్తి వల్ల కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందో ఈ రోజు ఐద్వా అదాలత్(ఐలమ్మ ట్రస్ట్)లో చదవండి…
దివ్యకు 42 ఏండ్లు ఉంటాయి. ఓ ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తుంది. భర్త కూడా ప్రయివేటు సంస్థలోనే పని చేస్తున్నాడు. ఇద్దరు పిల్లలు కాలేజీలో చదువుతున్నారు. వీరిద్దరూ బాగానే ఉంటారు. అయితే సమస్య ఏమిటంటే.. దివ్య తమ్ముడు ముఖేష్ అతని భార్యతోనే. ఇతను కూడా ఓ ప్రయివేటు సంస్థలో ఉద్యోగి. అతని భార్య అనిత ప్రభుత్వ ఉద్యోగి. ఇద్దరూ ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. వాళ్లకి పెండ్లి జరిగి పదమూడేండ్లు అవుతుంది. ఒక పాప, బాబు ఉన్నారు. పిల్లలిద్దరూ స్కూల్‌కి వెళుతున్నారు.ముఖేష్ పెండ్లి తర్వాత తాగడం మొదలుపెట్టాడు. పెండ్లయిన కొత్తలో అల్లుడు ఇంటికి వస్తున్నాడని అత్తింటి వారే ఈ అలవాటు మొదలుపెట్టాడు. తర్వాత ఏ ఫంక్షనైనా, పెండ్లి అయినా కలిసి తాగడం ఓ అలవాటుగా మారిపోయింది. అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలంటే తాగాల్సిందే. తాగకపోతే బంధువులు ఏమనుకుంటారో అని కచ్చితంగా తాగేవాడు. అదే తర్వాత ముఖేష్‌కి వ్యసనంగా మారింది. ఐదారేండ్ల వరకు అక్కకు, తల్లికి అతని తాగుడు గురించి తెలియదు.
ఒక రోజు తాగొచ్చి భార్యాభర్తలిద్దరూ గొడవ పడడంతో విషయం బయటపడింది. అప్పటికే అతను మద్యానికి బానిసైపోయాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు బాగా పెరిగిపోయాయి. ‘నీ తమ్ముడు ఇలా తాగొచ్చి గొడవ చేస్తే ఎలా..?’ అంటూ దివ్య భర్త ఆమెను తిట్టడం మొదలుపెట్టాడు. పిల్లలున్నారని కూడా చూడకుండా ముఖేష్ ఇంట్లోనే తాగడం మొదలుపెట్టాడు. దాంతో దివ్య తన తమ్ముడిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కా, తల్లి కలిసి అతనితో మందు మాన్పించడానికి చాలా ప్రయత్నం చేశారు. దాంతో రెండేండ్లు తాగుడు మానేశాడు. కానీ ఈ మధ్య మళ్లీ మొదలుపెట్టాడు. ఈసారి తాగి తల్లిని కూడా తిడుతున్నాడు. తాగి రోడ్డుపైనే పడిపోతున్నాడు. దాంతో భార్యాభర్తల మధ్య గొడవలు మరింతగా పెరిగిపోయాయి. అంతకు ముందు దివ్య, తమ్ముడు కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు. ఈ గొడవల వల్ల రెండేండ్ల నుండి విడిగా ఉంటున్నారు. కానీ తాగి గొడవ చేయడం మాత్రం మానుకోలేదు. దాంతో ‘పిల్లల్ని చంపి నేను కూడా చచ్చిపోతాను’ అంటూ అనిత బెదిరించడం మొదలుపెట్టింది. దాంతో వాళ్లు ఎప్పుడు గొడవ పడినా దివ్య అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల దివ్య కాపురంలో కూడా ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ ఆలోచనలతో దివ్య తల్లికి అరోగ్యం పాడైపోయింది. ముఖేష్‌ను మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లడానికి అనిత ఒప్పుకోవడం లేదు.
పిల్లలు కూడా తండ్రిని అసహ్యించుకుంటున్నారు. అతను తాగినప్పుడు తప్ప మిగిలిన సమయంలో భార్యాభర్తలిద్దరు చాలా సంతోషంగా ఉంటారు. కానీ దివ్యనే తమ్ముడి వల్ల ఇబ్బందులు పడుతుంది. భర్త తాగినప్పుడల్లా అనిత అతని తల్లికి ఫోన్ చేస్తుంది. ఆమె టెన్షన్‌తో దివ్యకు ఫోన్ చేస్తుంది. తల్లి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దాంతో దివ్య ‘మీరు తాగండి, గొడవ పడండి, తిట్టుకోండి, కొట్టుకోండి. కానీ మాకు మాత్రం ఫోన్ చేయవద్దు’ అంది అనితతో. కానీ అనిత ఇవేవీ పట్టించుకోదు. ఏం చేయాలో అర్థం కాక దివ్య ఐలమ్మ ట్రస్ట్‌కు వచ్చింది. ‘మీరే మా తమ్ముడిని, అతని భార్యను పిలిచి మాట్లాడండి, వాడు తాగుడు మానుకుంటే మేమంతా సంతోషంగా ఉంటాము. వీళ్ల వల్ల మా కుటుంబంలో అన్నీ ఇబ్బందులే, సంతోషమే లేకుండా పోయింది’ అంటూ బాధపడింది.
మేము అనితను, ముఖేష్‌ను పిలిపించాము. అనితతో మాట్లాడితే ‘దివ్య ఎక్కడో దూరంగా ఉంటూ ఇంత బాధపడుతుంది. కానీ నేను రోజూ ఇంట్లో నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో ఎవరికి చెప్పుకోవాలి. ఏమైనా అంటే డీ అడిక్షన్ సెంటర్‌కు తీసుకెళదాం అంటారు. అంతకు ముందు తీసుకెళ్లాం. కొన్ని రోజులు మానేసి మళ్లీ మొదలుపెట్టాడు. ప్రస్తుతం తాగి వచ్చినప్పుడు మాత్రమే గొడవ చేస్తున్నాడు. తాగకపోతే అతని కంటే మంచి వ్యక్తి మరొకరు లేరు.
మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఆ మందులు వాడిన తర్వాత ఆయనకు ఏమైనా అయితే నా పరిస్థితి ఏంటీ? దివ్య వాళ్లు ఎప్పుడో ఒకసారి వస్తారు. అయినా తాగనప్పుడు బాగానే ఉంటున్నాడు కదా?’ అంది. దివ్య మాట్లాడుతూ ‘ఇలా తాగి రోడ్డుపైన పడిపోతుంటే ఆ ప్రభావం పిల్లలపై పడదా? పైగా వాళ్లు గొడవ పడినప్పుడల్లా మాకు ఫోన్ చేస్తుంది. మాకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది. మీరు మంచిగా ఉండాలనే కదా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లమంటుంది. అది అర్థం చేసుకోకుండా ఏమైనా అయితే అని భయపడుతుంటే ఎలా’ అంది. మేఖేష్ మాట్లాడుతూ ‘నేను తాగడానికి కారణం నా భార్య. నన్ను ఓ మనిషిలా చూడదు. ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. తాగి గొడవ చేస్తున్నానని మా అక్కతో నన్ను తిట్టుస్తుంది. అసలు ఆమె గొడవ చేయడం వల్లనే నేను తాగుతున్నాను’ అన్నాడు. దానికి మేము ‘మీ అక్క, అమ్మ, భార్య చెప్పేది ఒక్కటే. నువ్వు తాగుడు మానుకోవాలి. మీరు మానుకుంటే ఈ గొడవలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. నీ వల్ల నీ కుటుంబమే కాదు మీ అక్క కుటుంబం, మీ అమ్మ ఆరోగ్యం కూడా పాడైపోతుంది.
వెంటనే డీ ఎడిక్షన్ సెంటర్‌కు వెళ్లండి. మీకు ఉన్న అనుమానాలు డాక్టర్‌కు చెప్పండి. లేదంటే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇప్పటికే మీ పిల్లలకు మీరు దూరమయ్యారు. కొన్ని రోజులకు అందరూ మీకు దూరమైపోతారు. అప్పుడు మిమ్మల్ని పట్టించుకునే వాళ్లే వుండరు. తాగుడు మానడమే మీ సమస్యకు పరిష్కారం. మీ అక్క మిమ్మల్ని అమ్మలా చూసుకుంటుంది. కానీ మీ తాగుడుతో ఆమె సంసారాన్ని కూడా నాశనం చేస్తున్నారు’ అని చెప్పాము. దానికి అతను ‘మీరు చెప్పింది నిజమే నేను నా ప్రయత్నం చేస్తాను. నా భార్యనే కాదు మా అక్క, అమ్మ కూడా నా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. నా పిల్లలు కూడా అసహ్యించుకుంటున్నారు. నాతో అస్సలు మాట్లాడడం లేదు. కచ్చితంగా తాగుడు మానుకుంటాను’ అని చెప్పాడు.


