చైనా ఎంబసీ సెమినార్‌లో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ఉద్ఘాటన
న్యూఢిల్లీ : లక్షలాది మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చి పేదరికాన్ని సమూలంగా నిర్మూలించ డానికి కృషి చేశారంటూ చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన్ని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ అభినందించారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ పార్టీ కృషి చేస్తున్నదని ప్రశంసించారు. అద్భుతమైన ఆర్థిక, సామాజిక పరివర్తనకు చైనా నాయకత్వం వహిస్తోందని అన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ 105వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ చైనా ఎంబసీ ఏర్పాటు చేసిన సెమినార్‌లో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్ అరుణ్ కుమార్ సహా ఇతర వామపక్ష నేతలు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెమినార్‌లో ఎంఎ బేబీ మాట్లాడుతూ, చైనా కమ్యూనిస్టు పార్టీకి, నాయకత్వానికి, చైనా ప్రజలకు అభినందనలు తెలియచేశారు. భారత్, చైనాల మధ్య శతాబ్దాల తరబడి నెలకొన్న నాగరికతా సంబంధాల గురించి, సామ్రాజ్యవాద వ్యతిరేక సంఘీభావానికి సంబంధించిన ఉమ్మడి వారసత్వం, శాంతియుత సహజీవనానికి సంబంధించిన ఐదు సూత్రాలు (పంచశీల)కు గల కాలానుగుణ్యత గురించి బేబీ తన ప్రసంగంలో వివరించారు. భారత్, చైనాల అభివృద్ధి అనేది ఒకరి లాభం మరొకరికి నష్టం కలిగించే ఆట కాదని ఆయన నొక్కి చెప్పారు. చర్చలు, పరస్పర అవగాహన ద్వారా ద్వైపాక్షిక విభేదాలను పరిష్కరించుకోవాలని ఆయన పిలుపిచ్చారు. ఇరు దేశాలు అలాగే మొత్తంగా గ్లోబల్ సౌత్ ప్రయోజనాల కోసం బ్రిక్స్, ఎస్‌సీఓ వంటి వేదికల ద్వారా సహకారాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం వుందన్నారు. భారత్‌లో చైనా రాయబారి గ్జూ ఫీహాంగ్ కీలకోపన్యాసం చేశారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, ఏఐఎఫ్‌బీ ప్రధాన కార్యదర్శి జి దేవరాజన్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ కేంద్ర కమిటీ సభ్యులు రాజీవ్ దిమ్రి సహా పలువురు వక్తలు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.
ఆర్థిక, సామాజిక పరివర్తనకు చైనా నేతృత్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


