Friday, July 10, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఎందుకొచ్చారు? వెళ్లిపోండి!

ఎందుకొచ్చారు? వెళ్లిపోండి!

- Advertisement -

ఒక దేశాధినేత మరో దేశంలో అడుగుపెడితే సాధారణంగా ఆ దేశ ప్రజలు సాదరంగా స్వాగతం పలుకుతారు. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షిస్తారు. కానీ భారత ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యట నకు వెళ్లిన ప్రతిసారీ ‘‘గో బ్యాక్ మోడీ’’, ‘‘స్టాప్ మోడీస్ హ్యూమన్ రైట్స్ అబ్యూజెస్’’ వంటి నినాదాలు వినిపించడం ఇప్పుడు సాధారణ దృశ్యంగా మారింది. ఇది ఒక వ్యక్తిపై వ్యతిరేకత మాత్రమే కాదు.. పాలనా విధానంపై ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న అసంతృప్తికి ప్రతిబింబం. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా మన ప్రధానికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. భారతీయ ప్రవాసులు, మానవ హక్కుల కార్యకర్తలు ప్లకార్డులతో నిరసనలు చేపట్టారు. భార త్‌లో విద్వేష రాజకీ యాలు, మైనార్టీలపై దాడు లు, ప్రజాస్వామ్య సంస్థల బలహీనత, భావ ప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు వంటి అంశాలను వారు ప్రస్తావిం చారు. విదేశాల్లో భారత ప్రధానికి ఇలాంటి నిరసనలు ఎదురుకావడం ‌దేశ ప్రజాస్వామ్య పరిస్థితిపై అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తమవు తున్న ఆందోళనకు ఓ సంకేతం.

ఇది మొదటిసారి కాదు. అమెరికాలో ‘‘హౌడీ మోడీ’’, ‘‘నమస్తే ట్రంప్’’ కార్య క్రమాల సమయంలోనూ సభా ప్రాంగణాల వెలుపల నిరసనలు పెల్లుబికాయి. ఖలిస్తాన్ ఉద్యమానికి సంబంధించిన అంశాలతో పాటు మానవ హక్కుల ఉల్లంఘనలపై అనేక సంఘాలు నిరసనలు చేపట్టాయి. బ్రిక్స్ సదస్సు కోసం బ్రెజిల్‌‌కు వెళ్లినప్పుడు కూడా భారతీయ ప్రవాసులు ‘‘గో బ్యాక్ మోడీ’’, ‘‘సేవ్ ఇండియా’’, ‘‘స్టాప్ హేట్’’ వంటి ప్లకార్డుల్ని ప్రదర్శించారు. ఇది బ్రెజిల్‌తో ముగిసిన కథ కాదు. బ్రిటన్‌, కెనడా పర్యటనల్లోనూ భారీ ఎత్తున ఆందోళనలు చోటు చేసుకున్నాయి. లండన్‌లోని భారత హై కమిషన్ సమీపంలో, అలాగే ప్రధాని పాల్గొన్న కార్యక్రమాల వద్ద కూడా నిరసనలు పెద్దఎత్తున వ్యక్తమయ్యాయి. సిడ్నీ పర్యటన సమయంలోనూ వ్యతిరేక గళాలు వినిపించాయి. జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో మానవ హక్కుల సంస్థలు, విద్యార్థి సంఘాలు, ప్రవాస భారతీయ సంఘాలు నిరసన లు చేపట్టాయి. స్విట్జర్లాండ్‌ లో ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలకు హాజరైన సందర్భంలో కూడా ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ పలు సంఘాలు స్పందించాయి. ప్రతి పర్యటన లోనూ ఇవే నిరసనలు, ప్రతి దేశంలో ఇవే భిన్నస్వరాలు.

ఈ నిరసనల నేపథ్యాన్ని పరిశీలిస్తే ఒక్క సారిగా పుట్టుకొచ్చినవి కావు. గత పన్నేండేండ్ల కాలంగా మోడీ ప్రభుత్వ పాలనలో పెరుగు తున్న విభజన రాజకీయాలపై ప్రవాసుల్లోనూ ఆందోళన పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా నిరుద్యోగం విజృంభిస్తోంది. అది అమెరికానే కాదు, అన్నిదేశాలతో పాటు అస్ర్టేలియానూ పాకింది. భారత్‌ అందులో రెట్టింపు స్థానంలో ఉంది. ఉద్యోగాల పేరుతో తెచ్చిన అగ్నిపథ్‌‌లోని ‘‘అసలు కుట్ర’’ను దేశమంతా గమనించింది. తాత్కాలిక ప్రలోభాలతో రాజకీయాలు ఎంతోకాలం సాగవు. అందుకే అక్కడ, ఇక్కడ, ఎక్కడన్నది కాదు, యువత ఉద్యమ స్వరం పెంచుతోంది. ఇంకా చెప్పాలంటే, ఎన్నికల లాభం కోసం మతాన్ని రాజకీయ ఆయుధంగా మార్చడం, ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలు, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం అనేక చర్చలు లేవనెత్తాయి. పార్లమెంటు చర్చల ప్రాధాన్యత తగ్గించడం, రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను బలహీన పరచడం వంటి చర్యలు విద్యా వంతులు, మేధావి వర్గాల్లోనూ అసహనాన్ని పెంచాయి. ముఖ్యంగా మణిపూర్ అరాచకం. నెలల తరబడి కొనసాగిన హింసపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి.

రెండు తెగల మధ్య జరిగిన ఘర్షణకు మరింత ఆజ్యం పోశాయి. దాని ఫలితం ఇద్దరు కూకీ మహిళలను వివస్ర్తలుగా చేసి నడిరోడ్డుపై నడిపించి హత్య చేయడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. ఇలాంటి ఘటనలే అంతర్జాతీయంగా ప్రజాస్వామ్య సూచికల్లో భారత్‌ను అద:పాతాళానికి తొక్కేశాయి! ఇవి దేశ సరిహద్దులు దాటి విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల భావోద్వేగాలపైనా ప్రభావం చూపాయి. ఆ భావోద్వేగాలే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేడు తమ గొంతుల్ని పెద్దవిగా చేస్తున్నాయి. ఒక దేశ ప్రధాని విదేశాలకు వెళ్లినప్పుడు ఆ పర్యటన దేశ గౌరవాన్ని పెంచాలి. పెట్టుబడులు, సాంకేతిక సహకారం, ద్వైపాక్షిక సంబంధాలు, శాంతి-స్నేహ సందేశాలు ప్రధానంగా ఉండాలి. కానీ ప్రతి పర్యటనలోనూ నిరసనలే ప్రధాన వార్తగా మారితే అది వ్యక్తిగత ప్రతిష్టకే కాదు, దేశ ప్రతిష్టకూ నష్టం. అధికార ప్రచార యంత్రాంగం విదేశీ సభల్లో జన సమీకరణను విజయంగా చూపించవచ్చు. కానీ అదే సమయంలో బయట ‘‘గో బ్యాక్ మోడీ’’ నినాదాలు వ్యతిరేకతనూ బహిర్గత పరుస్తున్నవి. విదేశాల్లో వినిపిస్తున్న నిరసనలు భారతదేశానికి వ్యతిరేకంగా కావు, దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికత, రాజ్యాంగ విలువలను కాపాడాలనే ఆకాంక్షకు ప్రతిధ్వనులు. ఆ ధ్వనులను ఒక హెచ్చరికగా స్వీకరించాలి. లేదంటే మరిన్ని గళాలు ఏకమవుతాయి, అడుగడుగునా అడ్డుకుంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -