‘మా’ (పాపము శమించుగాక) ‘నా’ కూపస్థ మండూకాన్ని (బావిలో కప్పంటే కొందరు సోదరీమణులు పొరపాటుగా అర్థం చేసుకుని కారాలు, మిరియాలు నూరి నా మీద పెప్పర్ స్ప్రే చల్లవచ్చనే భయంతో) ఈ జంట నగరాల్లోని కొన్ని ప్రశస్థ యాత్రా ప్రదేశాలు తిప్పితే ఆమె మానసికోల్లాసం నూరింతలై…నా పాదసేవ గట్రా సరిగ్గా చేస్తుందనే ధృడ విశ్వాసంతో పట్నం టూరు పెట్టాడు గోవిందరాజులు. షార్ట్ కట్‌లో గోరా అందాం. పేరుకు తగ్గట్టే మూడు నిలువు నామాలు, కణతలపై గ్రంథం రాసుకున్న ఆజానుబాహుణ్ణి చూస్తే కొందరు నిజమైన గోవిందరాజుల స్వామి నేలపై దిగొచ్చాడనుకొంటారు ఆ ఆహార్యంతో! తన భార్య, ఆ మాటకొస్తే, ఏ ఆడదైనా వంటింటి కుందేల్లా పడుండాలని ఆయన ఉద్దేశ్యం. ఒక మర చెంబులో కాపీ నీళ్లు, ఇంకోదాన్లో మంచినీళ్లు, తినేటప్పుడు ‘శూద్రు’’ లెవరూ చూడకుండా అడ్డం కట్టడానికి తెల్లపంచా.. దాదాపు బారిష్టరు పార్వతీశం లండన్ బయల్దేరే ముందు ఓడెక్కిచ్చి నంత సామగ్రి ఆటోలో సర్దుతూంటే.. ఆటో అబ్బాయికి డౌటొచ్చినట్టుంది..
ఆటో అబ్బీ : ‘‘మీదీ ఎన్ని రోజులు.. తిర్గుతుంది సాబ్ సిటీల..!’’
నిజానికి ఆండాళ్లమ్మ గారికీ అదే సందేహమొచ్చి చచ్చింది. అడిగితే కరుస్తాడని వదిలేసింది.
గోరా: ‘‘నీకు మాట్లాడుకున్న డబ్బులకి పైసా దాటినా మొత్తం మీ కుటుంబం మీద ఒట్టురా అబ్బీ!’’ అన్నాడు.
రెండు వైపులా పదునున్న ఆ మాట ఆ వెధవకి అర్థమైనట్టు లేదు.. ‘‘షుక్రియా సాబ్’’ అన్నాడు. సత్యభామా సమేతుడై శ్రీ మహావిష్ణువు వినతాసుతుని వీపు మీదెక్కి ఊరేగినట్లు మా ఇంటి దగ్గరల్లోని సుభాన్ మియా కొడుకుని ఐదునూట పదహార్లకు మాట్లాడుకుని బయల్దేరాడు గోరా. ఈ మొత్తానికి ఒక బ్యాక్ గ్రౌండేడ్చింది. మా పక్కింట్లో ఉండే ఎల్‌ఐసి ఆమె ‘‘అన్నయ్యగారూ! వదినగారూ’’ అనుకుంటూ చనువుగా ఇంట్లోకి వచ్చేది. అయ్యంగార్లయినా తెలుగు స్పష్టంగా మాట్లాడేది. గోరాకి పెద్ద అభ్యంతరం ఉండేది కాదు. అప్పుడప్పుడూ ఎర్ర చీరా, జాకెట్టుతో వచ్చేది. తెల్లటి మనిషి కాబట్టి అందం ఇనుమడింపచేసుకోడానికి కట్టుకుందేమో అనుకున్నట్టున్నాడు గోరా. ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు.. ఆయన ధోతీ కట్టుకుని, నామాలు దిద్దుకుని డ్యూటీకి వెళ్లిన తర్వాత నాతోనూ ఎర్రచీర కట్టించి తెల్ల జాకెట్ తొడిగించి మీటింగుకు తీసికెళ్లేదామె! మొదట్లో వాండ్లు మాట్లాడేదేమీ అర్థమయ్యేది కాదు. క్రమంగా ఈ సమాజం పొట్టవిచ్చి ఎన్ని పురుగులున్నాయో కరెక్టుగా చూపించారు. బహుశా ఈ విషయాలన్నింటినీ గ్రహించే తన భార్యామణిని అగ్ని పునీతను చేయడానికే హైద్రాబాద్‌లోని పుణ్యక్షేత్రాలు తిప్పే పని పెట్టుకున్నాడు.
గాలి గన్నారావు ఆఫ్ గూగుల్
ప్రశాంతంగా ఆటో నడుస్తూంటే గూగుల్‌లో ‘డింగ్’మని సౌండ్ వచ్చింది. ‘‘తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు తెలంగాణ అంతాకానీ, అక్కడక్కడాగానీ పడొచ్చు. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వీచే అవకాశం ఉంది’’ కనకాంబరం మొక్కలు వంగిపోవచ్చు! జాజిపూలు రాలిపోవచ్చు అని ఆ వాక్య సారాంశం అర్థం చేసుకోండి. చిలుకూరు బాలాజీ టెంపుల్ మొదట చూపించాలని గోరా గారి ఉబలాటం. పైగా రానున్న రోజుల్లో గర్భవతిగా ఉన్న తమ కూతురు దగ్గరికి వెళ్లాలంటే ఇద్దరికీ అమెరికా వీసా కావాలి. అందుకే ‘‘వీసా బాలాజీ’’గా పేరున్న ఆ గుడిలో ముందు దర్శనం చేసుకోవాలి. ‘‘ముందు వికారాబాద్ రోడ్డులోకి తిప్పరా సాయిబూ!’’ అన్నాడు (ఆ పిల్లవాడికి రోషమొచ్చినట్టుంది) ‘‘మేరా నామ్ ఇస్మాయిల్‌హై సాబ్!’’ అన్నాడు.
బొద్దింక.. బొద్దింక
గోరా : ఆటోలో బొద్దింకేమిటే నీ పిండా కూడు!
ధర్మపత్ని : ఆటోలో కాదండీ! పేపర్లనిండా బొద్దింకల వార్తలే!
గోరా : అవన్నీ పాకిస్థాన్ బొద్దింకలు. (మెల్లిగా నా చెవులో అన్నారు) సాయిబు బొద్దింకలే అవి పిచ్చిమొద్దా!
ధర్మపత్ని : బొద్దింకంటే ఏదో తేలు అయినట్టు అలా పారిపోయాడేంటి కేంద్రమంత్రి?
గోరా : ‘ప్రధాని’వైపు బండి తిప్పుతున్నారే ఆ సన్నాసులు. అందుకే ‘ప్రధాన్’ని బలివ్వక తప్పలేదు’. అందుకే, యావత్ పార్టీ ‘నీ వెంటే మేమంతా’ అని చెప్పారు. చూశావా? పైగా పెట్రోలియం శాఖకి ఉపమంత్రిగా ఉన్నపుడే ఆరెస్సెస్‌కి కొన్ని వందల కోట్లు దక్కేలా చేశాడని వార్తలొచ్చాయి.. ప్రత్యేకించి ఆయన ‘త్యాగాన్ని’ మోహన్ భగవత్ నుండి గల్లీ లీడర్ల వరకూ వేనోళ్ల పొగడటం చూస్తున్నాం కదా! హఠాత్తుగా సినిమా పోస్టర్ సైజులో ఒక పేద్ద పోస్టర్ దర్శనమిచ్చింది.. అదీ భార్యామణికే. ‘‘పని మనిషి, వాచ్‌మ్యాన్ కావలెవు. వసతి సౌకర్యం ఇస్తాం. మాకు పెద్ద గోశాలుంది. ఆవుల పేడెత్తుటకు 10-12 ఏండ్ల వయసున్న పిల్లలుంటే ఇంకా మంచిది. పక్కనే గోబర్ గ్యాస్ ప్లాంటుంది. ఆ పని క్రమం తప్పకుండా చేస్తుంటే ఆ ప్లాంటులో అబ్‌సార్బ్ చేసుకుంటారు. నూతన లేబర్ కోడ్స్ ప్రకారం వేతనాలు ఇవ్వబడును!’’ ఇది చదివేసరికి గోవిందరాజులుగారి ఛాతి దాదాపు 56 అంగుళాలు సాగింది.
గోరా : ఉన్న వాళ్లందరికీ ఉద్యోగాలిచ్చే సరికి కార్మికుల కొరత ఎలా ఉందో చూశావా?
భార్యామణి : అవునవున్లే! రైల్వే గ్యాంగ్‌మెన్ ఉద్యోగాలకు బీటెక్‌లు, వీఆర్‌ఏ ఉద్యోగాల్లో పీజీలు,.. ఇలా ఎవరికీ ఏ ఉద్యోగంలో సంతృప్తి లేదు. హెవీ వెహికిల్ లైసెన్సున్న వారు ఆటోలు తోలుకుంటున్నారు! ఆవేశంగా అన్నది ‘‘నా పరిస్థితి అదే అమ్మా!’’ అన్నాడు ఇస్మాయిల్! భార్యామణి ‘ఫ్లో’ ఆగలేదు. ‘ఇప్పటికి 24 కోట్ల మందికి ఉద్యోగాలిచ్చి ఉండాలి. ఇదేనా మీ ప్రధానిగారి ఘనకార్యం?’’ తయారీలో వున్న ‘ఐద్వా’ లీడర్ మొగుడిపై రెచ్చిపోతోంది. సమాధానాలు లేక, దొరక్క నోరెళ్ల పెట్టడం భర్త శిఖామణి వంతైంది.
-ఆరెస్బీ
కూపస్థ మండూక యాత్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



