నీట్ లీకేజీ ఉదంతం, కాక్రోచ్ ఉద్యమం, యువత ఆగ్రహం, విద్యామంత్రి రాజీనామా వెరసి కేంద్ర ప్రభుత్వానికి నిద్ర పడుతున్నట్టు లేదు. మొన్నటివరకు జంతర్‌మంతర్ కేంద్రంగా పోరాడిన విద్యార్థులపై లాఠీలు జులిపించి, టియర్‌గ్యాస్‌లతో బెదిరించి, పెల్లెట్ గన్స్ ప్రయోగించి పోరాటాన్ని అణచివేయాలనుకున్న మోడీ సర్కార్‌కు అది సాధ్యపడకపోగా అసమర్థ పాలనతో దేశమంతా అభాసుపాలైంది. అయితే, ఇప్పుడు ఆ యు వజన ఉద్యమంలో కీలకపాత్ర ఎవరిదన్న కోణంలో వేట మొదలు పెట్టింది. నీట్ కుంభకోణంపై దేశవ్యాప్తంగా చెలరేగిన ఆగ్రహాన్ని ఎదుర్కోలేక, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు దిగడం కేంద్ర ప్రభుత్వ అసహనానికి నిదర్శనం. మొన్న ఢిల్లీలోని సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయంలోకి పోలీసు యంత్రాంగం అక్రమంగా చొరబడింది. యూనిఫాం లేదు, నేమ్‌బోర్డు లేదు, సివిల్ డ్రస్సుల్లో ప్రయివేటు వాహనాల్లో వచ్చి ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత సంయుక్త కార్యదర్శి, జేఎన్‌యూ ఎస్‌యూ మాజీ అధ్యక్షురాలైన ఐషీ ఘోష్‌ను తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. అక్కడే ఉన్న సీపీఐ(ఎం) రాజ్యసభ నాయకుడు జాన్ బ్రిట్టాస్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు అడ్డుకోవడంతో వారు అక్కడినుంచి వెనుదిర గాల్సి వచ్చింది. అయితే ఢిల్లీ ఉద్యమానికి సంబంధించి విద్యార్థులు, యువతపై కేసులు పెట్టకూడదని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
ఇందులో ఏమీ చేయలేమనుకున్న ప్రభుత్వం ఐదేండ్ల నాటి కేసును తిరగదోడింది. కొన్ని నెలల క్రితం పాటియలా హౌస్‌కోర్టు జారీచేసిన నాన్ -బెయిలబుల్ వారెంట్‌ను చూపి ఐషీని అరెస్టు చేసి తీహార్ జైళ్లో నిర్భందించేందుకు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది! ఆమె చేసిన తప్పేంటి? ప్రశ్నించడం నేరమా? విద్యా వ్యవస్థలో జరిగిన అక్రమాలను నిలదీయడం దేశద్రోహమా? పేపర్ లీక్ చేసిన వారిని వదిలేసి, లీకేజీని వ్యతిరేకించిన విద్యార్థులను నిర్భందించాలను కోవడంలోనే , ఇక్కడే కేంద్రం కక్షపూరిత ధోరణి అర్థమవుతోంది. నీట్ పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. పరీక్షల విశ్వసనీయత దెబ్బతింది. నిరాశ నిస్పృ హలకు లోనై కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి జవాబుదారితనం కొరవడింది. పరీక్షా నిర్వహణ సంస్థ తీరు అసంతృప్తిని రగిల్చింది. ప్రధాని మౌనవ్రతమే జవాబైంది. బాధ్యత వహించాల్సిన మంత్రి సీటు వదులుకోవడానికి ససేమిరా అన్నాడు. దీంతో దేశవ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐతో పాటు వామపక్ష విద్యార్థి సంఘాలు నిరసనబాట పట్టాయి. కాక్రోచ్ ఉద్యమం కూడా ఈ ఆవేదనకు ప్రతీకగా నిలిచింది. ఇదంతా నాణానికి ఒకవైపు అయితే, ఇప్పుడు విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పాలకులు, ఇప్పుడు వారినే నిందితులుగా చిత్రీకరించే పనిలో పడటం బాధాకరం.
మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ప్రజాస్వామ్య దేశంలో ఒక చారిత్రక వారసత్వ గుర్తింపు పొంది, కొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి కూడా వచ్చిన ఒక జాతీయ పార్టీ కార్యాలయంలోకి తగిన చట్టపరమైన ప్రక్రియలను ఉల్లంఘిస్తే పోలీసులు ప్రవేశించడం అత్యంత ప్రమాదకర ధోరణి. ప్రభుత్వాలపై విమర్శలు చేయడం, నిరసనలు చేపట్టడం, ప్రజా సమస్యలపై ఉద్యమించడం రాజ్యాంగం కల్పించిన హక్కులు. విద్యార్థి ఉద్యమాలు భారత ప్రజాస్వామ్య చరిత్రలో కీలక పాత్ర పోషించాయి. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి అత్యవసర పరిస్థితి వరకు, విద్య హక్కు నుంచి సామాజిక న్యాయం వరకు అనేక ప్రజా ఉద్యమాల్లో విద్యార్థులు ముందున్నారు. అలాంటి ఉద్యమాలను కేసులతో అణచివేయాలని చూడడం చరిత్రను తిరస్కరించడమే.
కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా విమర్శించే ప్రతి వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటోందనే విమర్శలు పెరుగుతున్నాయి.
రైతుల ఉద్యమం, కార్మిక సంఘాల నిరసనలు, విద్యార్థుల ఆందోళనలు, జర్నలిస్టులపై కేసులు, సామాజిక కార్యకర్తల అరెస్టులు-ఈ పరిణామాలన్నీ విభిన్న అభిప్రాయాలను అణచివేసే ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. ఇప్పుడు విద్యార్థి ఉద్యమాలపై కూడా అదే విధానాన్ని అమలు చేయడం ఆందోళన కలిగించే విషయం.ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, లోపాలపై చర్చ జరగకుండా, ప్రశ్నించిన వారిపైనే దృష్టిపెట్టడం ప్రజాస్వామ్యానికి మేలు చేయదు. ముందు నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా విద్యార్థులు రోడ్డెక్కడానికి కారణమెవరు? పరీక్షల విశ్వస నీయత దెబ్బతినడం, వరుస లీకేజీలు, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడడం-ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలే. వీటికి బాధ్యత వహించాల్సిన కేంద్రం, వాటిపై ప్రశ్నించిన విద్యార్థులను నిందితులుగా నిలబెట్టడం ద్వారా తన బాధ్యత నుంచి తప్పించుకోలదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు విమర్శలను భరించే సంస్కారం అవసరం. కేసులు, అరెస్టులు, పోలీసు వేధింపులు సమస్యలకు పరిష్కారం కావు. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పడం, విద్యా వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడం ప్రభుత్వ బాధ్యత. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించి రాజకీయ కక్షతో వ్యవహరిస్తే ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుంది.
ఇదేమి రాజ్యం?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


