నవతెలంగాణ – హైదరాబాద్ : ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తన పార్టీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే విద్యా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించనున్నారు. 10, 12వ తరగతి స్టేట్ బోర్డ్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన స్వయంగా సత్కరించనున్నారు. ఈ నెలాఖరున లేదా ఆగస్టు మొదటి వారంలో చెన్నై వేదికగా ఈ భారీ కార్యక్రమం జరగనుంది.
విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగడం ఇదే తొలిసారి. 2023లో టీవీకే పార్టీ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివి, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అగ్రస్థానంలో నిలిచిన మొదటి ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసి, వారికి బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు, ఇతర బహుమతులను అందజేస్తారు. ఈ వేడుకకు విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు.


