Sunday, July 12, 2026
E-PAPER
Homeజాతీయంగోడపై సూసైడ్ నోట్ రాసి విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

గోడపై సూసైడ్ నోట్ రాసి విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ కళాశాల విద్యార్థిని తాను అద్దెకు ఉంటున్న గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు ఆమె తన గది గోడపై చాక్‌పీస్‌తో రాసిన సూసైడ్ నోట్ సంచలనం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం బాధితురాలిని రాజ్‌గఢ్ జిల్లాకు చెందిన వైష్ణవి బనావడే (20)గా గుర్తించారు. ఆమె ఇండోర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. చదువు నిమిత్తం ఎంఐజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూ నగర్‌లో అద్దె గదిలో ఒంటరిగా ఉంటోంది. వైష్ణవి గత ఏడాదిగా ఓ యువకుడితో ప్రేమలో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది.

శనివారం ఆమె ప్రియుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వైష్ణవి స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి నేరుగా ఆమె గదికి చేరుకున్నాడు. లోపల నుంచి గడియ పెట్టి ఉండటంతో ఇంటి యజమాని సహాయంతో తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా, వైష్ణవి ఫ్యాన్‌కు ఉరివేసుకుని నిర్జీవంగా కనిపించింది. దీంతో షాక్‌కు గురైన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గదిని పరిశీలించగా, గోడపై తెల్లటి చాక్‌పీస్‌తో ఆంగ్లంలో రాసిన డెత్ నోట్‌ను గుర్తించారు. “నేను నా ఇష్టపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. నా తల్లి, సోదరుడు, ప్రియుడు అంటే నాకు చాలా ఇష్టం. కానీ నాన్న, నానమ్మ ప్రవర్తన వల్లే చనిపోతున్నా” అని అందులో రాసి ఉంది. ఈ ఘటనపై ఎంఐజీ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మాట్లాడుతూ.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని తెలిపారు. గోడపై రాసిన ఆరోపణలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, కుటుంబ సభ్యులను విచారించిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని ఆయన వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -