- కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కింజరాపు రామ్మోహన్ నాయుడులతో వరుస సమావేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలతో బిజీబిజీగా ఉన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్, ఎంపీ రఘువీర్ రెడ్డి, రాష్ట్ర అధికారులు సమావేశమై రీజినల్ రింగ్ రోడ్డు (RRR)తో పాటు తెలంగాణలోని పలు జాతీయ రహదారుల నిర్మాణాల గురించి మాట్లాడారు.
ఈ సమావేశంలో రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి 95 శాతం భూసేకరణ పూర్తయిందని సీఎం వివరించారు. ఉత్తర భాగం పనులు ప్రారంభించేందుకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని నితిన్ గడ్కరీని కోరారు. అలాగే రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు అవసరమైన కేంద్ర అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కూడా సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ రఘువీర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలోని అదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న విమానాశ్రయాల అభివృద్ధి పనులపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణలో ప్రాంతీయ విమాన సేవలను విస్తరించాలని సీఎం కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో రహదారులు, విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్ర సహకారం అందించే అంశంపై ఈ భేటీలు కీలకంగా మారాయి.



