నవతెలంగాణ-ఆలేరు టౌను
విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ, గురుకుల హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) జిల్లా కార్యదర్శి ఆర్. ఉదయ్ డిమాండ్ చేశారు. ఆలేరు పట్టణంలో శుక్రవారం జరిగిన పీడీఎస్‌యూ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అనేక సంక్షేమ, గురుకుల హాస్టళ్లలో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
చాలా హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు కూడా లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ముఖ్యంగా మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థులు హాస్టల్ ఆవరణ బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది విద్యార్థుల భద్రతకు, ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టళ్లలో తాగునీరు, పరిశుభ్రత, విద్యుత్, భోజనం, భద్రత వంటి కనీస సౌకర్యాలను ప్రభుత్వం వెంటనే కల్పించాలని, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువుకునే పరిస్థితులను ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత ఉందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, కోరారు. ప్రైవేటు విద్యాసంస్థలు విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులను ఫీజుల పేరుతో దోచుకుంటున్నాయని, ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతి విద్యార్థికి అందుబాటు ధరలో నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు.
అదేవిధంగా జిల్లాలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలను వెంటనే గుర్తించి వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రైవేటు యాజమాన్యాలతో కుమ్మక్కై నిబంధనల ఉల్లంఘనలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారులపై కూడా ప్రభుత్వం విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆర్. ఉదయ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు విద్యను ప్రోత్సహించే విధానాలను విరమించుకోవాలని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లను బలోపేతం చేయడానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు మామిడాల ప్రవీణ్, నాయకులు ప్రణయ్, దార చందు, భాను, తమ్మడి చరణ్, బన్నీ, లవన్, కిరణ్, మహాష్ తదితరులు పాల్గొన్నారు.



