Sunday, March 15, 2026
E-PAPER
Homeసోపతివసుంధరా దేవి కళల సౌధాలు కలలై కరిగిన జీవితం

వసుంధరా దేవి కళల సౌధాలు కలలై కరిగిన జీవితం

- Advertisement -

వెండితెరపై వసుంధరా దేవి అద్భుతమైన సౌందర్యం, నృత్య ప్రతిభ, నటనలకు తోడుగా కర్ణపేయమైన గాత్రం జత కలిసింది. వీటితో ఆమెకు సినిమాల అవకాశాలు వచ్చినవి. నిజానికి 1941 నుండి 60 వరకు 20 ఏళ్లలో నటించినవి అరడజను చిత్రాలు మాత్రమే. వాటిలో ఐదు తమిళం, ఒకటి హిందీ చిత్రం. అవన్నీ వరుసగా – రుష్య శృంగార్‌ (1941), మంగమ్మ శబదం (1943), ఉదయన్‌ వాసవ దత్త (1947),నాట్టియ రాణి (1949), హిందీ చిత్రం పైఘాం (1959), ఇరుంబు తిరల్‌ (1960).


వసుంధర దేవి హీరోయిన్‌గా తెరపై మొదట కనిపించిన చిత్రం రుష్య శృంగార్‌ (1941). మొదటి చిత్రంలోని ఆమె సరసన హీరోగా నటించినవాడు నాటి స్టంట్‌ హీరో రంజన్‌. కౌమార ఋష్యశ్రుంగునిగా వీణా బాలచందర్‌గా పేరొందిన ఎస్‌. బాలచందర్‌ నటించాడు.
పెద్దవాడైన ఋష్యశృంగుని పాత్రను చంద్రలేఖ ఫేమ్‌ రంజన్‌ పోషించారు. అతనికిది తొలి సినిమా. రంజన్‌ కూడా ఈ చిత్రంలో కొన్ని పాటలు పాడాడు. శర్మ బ్రదర్స్‌తో కలిసి చిత్తూరు నాగయ్య సమకూర్చిన సంగీతంలో వసుంధర పాడిన ‘ఆనందమే ఉన్‌ కాచ్చి’, ‘నానే భాగ్యవతి నళినియే’ పాటలు తమిళనాట మారు మోగినవి. ఆమె ‘ఎనై థైయై పురింధ్‌!’ అనే పాశ్చాత్య పాటను కూడా పాడింది. ఋష్యశృంగార్‌ భారీ విజయం రంజన్‌, వసుంధరలను కీర్తి శిఖరాల పైకి చేర్చింది.
వసుంధర – రంజన్‌ల కాంబినేషన్‌ బాక్సాఫీస్‌ వద్ద విజయవంతం కావడంతో ఆ వెంటనే జెమినీ వాసన్‌ వీరిద్దరితో ప్రఖ్యాత జానపద కథతో ‘మంగమ్మ శబదం’ (1943) తీశాడు. ఈ సినిమా గురించి 1943 అక్టోబర్‌ 7 నాటి ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఇలా రాశారు…

‘మంగమ్మ శబదం’ అన్ని ప్రమాణాల ప్రకారం అద్భుతమైన వినోదాత్మక చిత్రం. అద్భుతమైన రామనాథ్‌ సినిమాటోగ్రఫీ, శేఖర్‌ కళా దర్శకత్వంలో విలక్షణమైన, విలాసవంతమైన సెట్టింగ్‌లు, వసుంధర పాడిన శ్రావ్యమైన పాటలు, రంజన్‌ గొప్ప స్వరం, సంగీత, నృత్యాలు కూడా అలరించినవి. హీరోయిన్‌ వసుంధర స్వరాల రాణిగా ప్రశంసలు అందుకుంటుంది. తండ్రి, కొడుకుల కష్టతరమైన ద్వంద్వ పాత్రలలో రంజన్‌ది ఆకట్టుకునే నటన” అంటూ రాసింది. ‘మంగమ్మ శబదం’ జూలై 30, 1943న విడుదలైంది. మూడు గంటల సుదీర్ఘమైన నిడివి ఉన్నప్పటికీ, పరిపూర్ణమైన కళాత్మకంగా తీసిన చిత్ర రాజమని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ రాసింది. చరిత్రకారుడు రాండర్‌ గై ప్రకారం, ఈ చిత్రం రూ.4 మిలియన్ల లాభాన్ని ఆర్జించింది. ఇది 2025 నాటికి 650 మిలియన్లతో సమానం.
ఉదయన్‌ వాసవ దత్త (1947), చిత్రం వసుంధరా దేవి నటించిన మరొక నత్య సంగీత భరిత కళాఖండం. ఇది 1947లో టి. ఆర్‌. రఘునాథ్‌ దర్శకత్వం వహించి, నిర్మించిన తమిళ భాషా చిత్రం. ఈ చిత్రంలో వసుంధరా దేవి, విద్వాన్‌ జి. ఎన్‌. బాలసుబ్రమణ్యం ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జి.ఎన్‌.బి. రాగ భరితమైన పాటలు, వసుంధరా దేవి నత్యాల వల్ల గుర్తుండిపోయింది.

వసుంధరా దేవి హీరోయిన్‌గా నటించిన ఆఖరి చిత్రం ‘నాట్టియ రాణి’. ఈ చిత్రాన్ని బాస్కర్‌ పిక్చర్స్‌ నిర్మించింది. దర్శకుడు బి.ఎన్‌. రావు. కంబదాసన్‌ కథ, సంభాషణలు రాశాడు. ఈ చిత్రంలో ప్రత్యేకత ఏమిటంటే ఒకే పాత్రను ఇద్దరు వేర్వేరు కళాకారులు చేస్తారు. నిర్మాణం ప్రారంభమైనప్పుడు, వసుంధరా దేవి శాంతల పాత్రను పోషించింది. ఆమెతో పలు సన్నివేశాలు, నత్యాలు చిత్రీకరించారు. కానీ ఏవో కారణంతో ఆమె సినిమాను మధ్యలో వదిలేసింది. తరువాత బి. ఎస్‌. సరోజ మిగిలిన సన్నివేశాల్లో నటించింది. అయితే, దర్శకుడు వసుంధరా దేవితో తీసిన షాట్లను వదిలివేయకుండా హీరోయిన్‌ను మార్చాలనే అద్భుతమైన ఆలోచనను దర్శకుడు, స్క్రీన్‌ ప్లే రచయిత సాయంతో కథాగమనానికి భంగం కలగకుండా తెరకెక్కించారు. నాయిక అగ్ని ప్రమాదంలో మరణించిందని, ఆమె ఆత్మ మరొక శరీరంలోకి ప్రవేశించి శాంతలగా జీవించడం కొనసాగించిందని చెప్పడానికి కథను తిరిగి రాశారు. అయినప్పటికీ భౌతిక లక్షణాలు మారాయి. ఆ రోజుల్లో సినీ పండితులు ప్రేక్షకులు అంగీకారానికి ఆమోదయోగ్యమైన మార్పుగా దీనిని పరిగణించారు.
ఇంతలో వసుంధరా దేవి తన బంధువుతో కలిసి సొంతంగా దీపావళి అన్న సినిమాను నిర్మించడానికి పూనుకుని షూటింగ్‌ కూడా ప్రారంభించి సగం సినిమాను పూర్తి చేశారు. సినిమా తీయడంతో ఆర్థికంగా వసుంధర బాగా దెబ్బతింది. ఆ స్థితిలో ఆమెపై సానుభూతితో జెమినీ వాసన్‌ తను ఆరంభించిన ఇరుంబుతిరై చిత్రంలో వైజయంతి, వసుంధరలను తల్లీకూతుళ్లుగా నటింపచేశాడు. ఇదే చిత్రం పైగామ్‌ పేరిట హిందీలో కూడా తయారయ్యింది. రెండింటిలోనూ తల్లి వేషం వసుంధరనే వేసింది. ఈ సినిమా కారణంగా తల్లీకూతుళ్లిద్దరూ మళ్లీ ఒక్కటవుతారని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు వసుంధర, వైజయంతి మాల పరిచయం లేనట్టుగానే ముసలుకునేవారు. ఇందుకు కారణం అప్పటికే తల్లి, కూతుర్ల పెంపకం గురించి, వైజయంతి మాల సినిమాలలో నటించే విషయమై కోర్టులో కేసులు నడుస్తూ ఉండటం.

అయితే కూతురు పట్ల వసుంధరకు ప్రేమ లేదని కాదు. కూతురు కూడా తనలాగా నర్తకిగా నటిగా వెలుగులోకి రావాలని ఆమె ఆశించింది. కూతురిని కూడా తారను చేసేందుకు ముందు సన్నాహాలు ఆరంభించింది వసుంధర. వైజయంతికి నాట్యం కవూర్‌ రామయ్య పిళ్లై వద్ద ఇంటిలోనే నాట్యాభ్యాసం ఆరంభించింది. 1946లో నగరంలోని పెద్దలందరినీ ఆహ్వానించి తమ ఇంట్లోనే వైజయంతి చేత ఆరంగేట్రం కూడా చేయించింది. తల్లిని మించిన కూతురు అంటూ వచ్చినవారంతా మెచ్చుకుంటుంటే వసుంధర ఆనందానికి అవధులు లేవు. వైజయంతి చేత విరివిగా నాట్యప్రదర్శనలు ఇప్పిస్తూ తన మధుర కంఠస్వరంతో వాటిని రక్తి కట్టించేది వసుంధర. మరోవైపు మెల్లిగా యాగమ్మకు, వసుంధరకు దూరం పెరగనారంభించింది. అటు కుటుంబ బంధువుతో వసుంధర సాన్నిహిత్యం పెరగింది.
వాళ్లిద్దరూ కలసి తీసే దీపావళి హిందీ సినిమా నిర్మాణానికి యాగమ్మ తీవ్ర అభ్యంతరం తెలిపింది. కానీ వసుంధర తల్లి మాట లెక్కచేయలేదు. బంధువుతో కలిసి సినిమా ఆరంభించేందుకు బొంబాయి వెళ్లిపోయింది. ఈ పరిణామాలు అన్నీ కూడా వసుంధరకు, తల్లి యాగమ్మ, కూతురు వైజయంతి మాలకు మరింత దూరం పెంచినవి.
యాగమ్మ ఇక ఆలస్యం చేయకుండా కూతురు తీసుకుని అల్లుడుతో సహా వేరే ఇంటికి మకాం మార్చింది. ఇవన్నీ తెలిసి బొంబాయి నుండి తిరిగి వచ్చిన వసుంధర నేరుగా తల్లి వద్దకు వెళ్లి తన కూతుర్ని తనకు ఇమ్మంది. యాగమ్మ కాదు పొమ్మన్నది. వివాదం చిలికి చిలికి గాలివానగా మారి న్యాయం కోసం అంతా మద్రాసు కోర్టు ముందుకు వెళ్లారు.
వసుంధర సినిమా నిర్మాణంలో, నటనలో నిమగమై ఉండటం వలన కూతురి ఆలన పాలన చూడలేదని తమ దగ్గరే పెరగాలని తండ్రి, యాగమ్మ 1950 ఏప్రిల్‌లో కోర్టులో వాదించారు. చివరికి జస్టిస్‌ కష్ణస్వామి నాయుడు ఇరు వర్గాలకు కాకుండా వైజయంతి మాల పర్యవేక్షణను న్యాయవాది సుబ్రహ్మణ్య మొదలియార్‌కు అప్పగించారు. ఆఖరుకు సెప్టెంబర్‌ 20న కోర్టు తుది తీర్పునిస్తూ వైజయంతి మాల పాలన పోషణను తండ్రికి, అమ్మమ్మకు అప్పగిస్తూ చివరి తీర్పును వెలువరించింది. వసుంధరా దేవి తన కూతురిపై పెట్టుకున్న ఆశలన్నీ ఒకసారిగా అందని తీరాలుగా మారిపోయినవి. తన జీవితంలో ఇదొక వెంటాడే విషాదంగా మిగిలిపోయింది. మరోవైపు అమ్మమ్మ యాగమ్మ పెంపకంలో వైజయంతి మాల కళా జీవన యాత్ర ఒక జైత్రయాత్రగా దిగ్విజయంగా సాగిపోయింది. ప్రముఖ నటిగా, నర్తకిగా వైజయంతి మాల కీర్తి నలుదిశల వ్యాపించింది. తల్లి, భర్త కూతురుతో విడివడిన తర్వాత వసుంధర రంగరాజన్‌ అనే తన బంధువును పునర్వివాహం చేసుకుంది. వాళ్లకు కవలపిల్లలు కలిగారు. రామన్‌ పక్షవాతం వచ్చి చాలారోజులు మంచానపడి కన్నుమూశాడు.
చివరి రోజుల్లో మద్రాస్‌ దూరదర్శన్‌లో ప్రసారమైన ‘మలరుమ్‌ నినైవుగళ్‌’ కార్యక్రమంలో, తన సినిమా అనుభవాల జ్ఞాపకాలను పంచుకుంటున్న వసుంధరా దేవి, నిరంతరం ‘నా కూతురు వైజయంతి…’ అని గొణుగుతూ ఉండేది. అందులో తన ఏకైక కుమార్తెతో సాధారణ సంబంధం లేకపోవడం వల్ల కలిగిన బాధ కనిపించేది. భర్త నుండి విడిపోయిన తర్వాత ఆమె తన తల్లితో గాని, కూతురితో గాని ఎప్పుడూ రాజీపడలేదు. వసుంధరాదేవి సెప్టెంబర్‌ 7, 1988 మరణించింది. స్వయంకతాపరాధంతో అలా వసుంధరా దేవి కళల సౌధాలు కలలై కరిగిపోయి జీవితం విషాదంతమైంది.

రాజ్‌- వైజయంతి మాల – బాలి
యదుగిరి దేవి తన కూతురు వసుంధర దేవి నిర్లక్ష్యం నుండి తన మనవరాలైన వైజయంతి మాలను బాల్యంలో కాపాడగలిగింది. కానీ ఆమె హిందీ చిత్రరంగంలో నాయకగా ఎదిగాక వైజయంతిమాలను లొంగదీసుకోవాలని పట్టుదలతో ఉన్న రాజ్‌ కపూర్‌ నుండి రక్షించలేకపోయింది. రాజ్‌ వైజయంతిమాలను విదేశాలకు షూటింగ్‌కు తీసుకెళ్లినప్పుడు అతను తన లక్ష్యాన్ని సాధించాడని బొంబాయి పత్రికలు కోడై కూసినవి. అందరూ అనుకున్నట్లుగా ఆమె రాజ్‌ కపూర్‌ వలన నెల తప్పింది. కపూర్‌ తన మొదటి భార్య కష్ణకు విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకుంటాడని వైజయంతిమాల ఆశలు పెట్టుకుంది. కానీ ఆ షోమ్యాన్‌ దానికి ఒప్పుకోలేదు. ఆ కోపంతో వైజయంతి రాజ్‌ కపూర్‌ కుటుంబ వైద్యుడు చవన్‌లాల్‌ బాలి ప్రేమలో పడింది. అతనికి అప్పటికే పెళ్లై ముగ్గురు కొడుకులు ఉన్నారు, కానీ అతను వైజయంతి మాల అందం నుండి తన కళ్ళు తిప్పుకోలేకపోయాడు. అప్పటికే 36 ఏళ్ల ఆమె ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకుంది. కనుక తన అమ్మమ్మ వ్యతిరేకించినప్పటికీ, వైజయంతి మాల బాలి మొదటి భార్యకు భారీ భరణం చెల్లించింది (1967లో దాదాపు 50 లక్షల రూపాయలు, అది ఆ రోజుల్లో చాలా పెద్ద మొత్తం).1968 మార్చి 10న వాళ్ల పెళ్లయ్యింది. పెళ్లి తర్వాత ఆమె కొన్ని సినిమాలు చేసింది. ఆ తరువాత ఆమె తన దష్టిని నత్యంపై కేంద్రీకరించింది. మరోవైపు రాజకీయాల్లో కూడా చేరింది. అయితే 1974లో గానీ ఆమె సుచింద్ర బాలికి తల్లైంది. ప్రస్తుతం ఆమె చెన్నైలో తన శేష జీవితాన్ని గడుపుతున్నది.
(రిఫరెన్స్‌ కర్టసి: వి. బాబూరావు)

– హెచ్‌ రమేష్‌ బాబు, 2025 గద్దర్‌ ఫిలిం అవార్డు గ్రహీత
7780736386

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -