నవతెలంగాణ-హైదరాబాద్: ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్ల మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. స్పెయిన్ విజయం సంబరాలు జరుపుకుంటున్న సమయంలో అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పరేడెస్, స్పెయిన్ ఆటగాడు గావిపై దాడికి దిగాడు. అతడిని తోసేసి ముఖంపై పిడిగుద్దులు కురిపించగా, అడ్డుకునేందుకు వచ్చిన మరో ఆటగాడిపై కూడా దాడి చేశాడు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తోసుకుంటూ ఘర్షణకు దిగారు. పరిస్థితిని అదుపు చేసేందుకు రిఫరీ పరేడెస్‌కు రెడ్‌కార్డ్ చూపించినా అతడు శాంతించకపోవడంతో మైదానంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈక్రమంలో ఫిఫా క్రమశిక్షణ కమిటీ ఆటగాళ్ల పై కఠిన చర్యలు తీసుకోనుంది. ఫైనల్ పోరు సందర్భంగా ఆటగాళ్ల ఘర్షణపై దర్యాప్తు కమిటీ వేయనుంది. బీబీసీ స్పోర్ట్ నివేదిక ప్రకారం, పలువురు అర్జెంటీనా ఆటగాళ్లు కనీసం మూడు మ్యాచ్‌ల నిషేధాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంది.
ఫిఫా (FIFA) క్రమశిక్షణా నియమావళిలోని ఆర్టికల్ 13 ప్రకారం, ప్రత్యర్థిపై దాడికి సంబంధించిన దుష్ప్రవర్తన, మోచేతితో కొట్టడం, పిడికిలితో కొట్టడం, తన్నడం, కొరకడం, ఉమ్మివేయడం లేదా కొట్టడం వంటి చర్యలకు పాల్పపడితే కనీసం మూడు మ్యాచ్‌లు లేదా తగినంత కాలం పాటు సస్పెన్షన్ విధించబడనుంది.



