– సీపీఐ(ఎం) జిల్లా నాయకులు శీలం, మోరంపూడి
– అంబేద్కర్ విగ్రహం ఎదుట సీపీఐ(ఎం) నాయకుల నిరసన
నవతెలంగాణ-సత్తుపల్లి : నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు, డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి, మోరంపూడి పాండురంగారావు డిమాండ్ చేశారు. ఆ పార్టీ సత్తుపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో సత్యనారాయణ రెడ్డి పాండురంగారావు మాట్లాడుతూ…
పార్లమెంట్ ముట్టడికి యత్నించిన విద్యార్థులపై లాఠీచార్జి, భాష్ప వాయువు ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడమే కాకుండా, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై పోలీసుల చేత దాడి చేయించడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. నీట్ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర దర్యాప్తు జరిపించాలని, విద్యార్థులపై దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో పారదర్శకమైన పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ సత్తుపల్లి పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు భాను, బాలాజీ, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.



